- జగిత్యాల జిల్లాలో గతేడాది వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు
- 13 మండలాల్లో రోడ్లు డ్యామేజ్
- 58 రోడ్లకు రిపేర్లు చేయాల్సి ఉండగా 15 మాత్రమే పూర్తి
- మరికొన్ని చోట్ల మొదలుపెట్టలే..
- ఈ రోడ్లపై ప్రయాణానికి జంకుతున్న వాహనదారులు
జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లాలో గతేడాది కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో బీటీ, సీసీ, మట్టి రోడ్లు కోతకు గురయ్యాయి. రిపేర్లు చేయాల్సిన సర్కార్ తూతూమంత్రంగా పనులు చేపట్టి వదిలేయడంతో అవి ఇంకా అధ్వానంగా మారాయి. చాలా చోట్ల గతుకులు, గుంతలు ఏర్పడడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు సాగించడం కష్టంగా మారిందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. మరికొన్ని చోట్ల అసలు రిపేర్లు మొదలు పెట్టకపోవడం.. వర్షకాలం మళ్లీ రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
13 మండలాల్లో డ్యామేజ్
జిల్లాలో గతేడాది కురిసిన భారీ వర్షాలకు జగిత్యాల, ధర్మపురి, వెల్గటూర్, పెగడపల్లి, గొల్లపల్లి, బూగ్గారం, ధర్మారం, పొలస, మల్యాల, మేడిపల్లి, సారంగాపూర్, బీర్పూర్, రాయికల్ మండలాల్లో చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లపై బీటీ కొట్టుకుపోయి, గుంతలుపడ్డాయి. ఈ రోడ్డుపై వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. ఇప్పటికే వానాకాలం స్టార్ట్కాగా ఇప్పటికీ రోడ్ల పరిస్థితిని తలుచుకొని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
దెబ్బతిన్న రోడ్లలో కొన్ని...
- కోరుట్ల లోని ఆదర్శ నగర్ కాలనీలోని రోడ్లు చిన్నపాటి వర్షానికి రొడ్లు బురదమయం అవుతున్నాయి. గతం లో కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న రోడ్ల లో రిపేర్లు చేపట్టలేదు. అలాగే ఈ కాలనీ లో తహశీల్దార్ , ఎంపీడీవో, ఎస్టీవో, ఆర్టీవో ఆఫీసులున్నాయి. వివిధ పనుల నిమిత్తం ఆఫీసులకు ప్రజలు వస్తూ పోతుంటారు. భారీ వర్షాలకు కొన్ని చోట్ల పాత రోడ్లు కొట్టుకొని పోయాయి. ఆఫీసుల చుట్టూ రోడ్లు బురద తో అధ్వానంగా ఉన్నాయి.
- కోరుట్ల మండలం కల్లూరు గ్రామం నుంచి యూసుఫ్ నగర్ మీదుగా ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ రోడ్డు వరకు 13 కిలోమీటర్ల రోడ్డు 14 కోట్లతో టెండర్ వేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ అయిపోయి 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు రోడ్డు పనులు మొదలు పెట్టకపోవడం తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో చేసిన పనులకు నిధులు మంజూరు కాకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదని గ్రామస్తులు చెపుతున్నారు.
- జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట్ వైపు వెళ్లే రోడ్డు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు సగానికి పైగా ధ్వంసమైంది. రిపేర్లు చేయాలని ఆఫీసర్లు, లీడర్లకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు.
- కరీంనగర్ జిల్లాలో రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి నుంచి గన్నేరువరం మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. గుండ్లపల్లి దేవుని చెరువు వద్ద మత్తడి, జంగా పెళ్లి చెరువు మత్తడి, గన్నేరువరం చెరువు మత్తడి మారితే రాకపోకలు బంద్ అవుతున్నాయి.
66 రోడ్ల రిపేర్లకు రూ.28.79కోట్లు
జిల్లాలో 66 పీఆర్ రోడ్ల రిపేర్లకు సర్కార్ రూ.28.79 కోట్లు కేటాయించింది. ఇందులో 58 రోడ్లకు పనులు ప్రారంభం కాగా 15 రోడ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 43 రోడ్లకు రిపేర్లు కొనసాగుతున్నాయని ఆఫీసర్లు చెబుతున్నా 10 రోడ్లు మొదలు కాలేదని సమాచారం. ఆర్అండ్ బీ పనుల కోసం మంజూరైన రూ. 58 లక్షలతో 10 రోడ్లకు తాత్కాలిక రిపేర్లు చేపట్టారు. లోలెవల్బ్రిడ్జిలు సైతం కోతకు గురయ్యాయి. లింక్ రోడ్లు శిథిలమయ్యాయి. ఈ రిపేర్లు వేసవిలోనే పూర్తి కావాల్సి ఉండగా ఎక్కడా నిర్ణీత టైంలో పూర్తి చేయలేదు.