ముథోల్ లో అత్యధికంగా రూ.16 కోట్ల నష్టం
ప్రభుత్వానికి ఆర్అండ్ బీ,పీఆర్శాఖల ప్రతిపాదనలు
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లాలో వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలో నిర్మల్, ముథోల్, ఖానాపూర్డివిజన్లలో మొత్తం 39 రోడ్లు మేజర్ డ్యామేజ్కాగా.. పీఆర్ పరిధిలో 70కి పైగా రోడ్లు పాడైపోయినట్లు ఆఫీసర్లు గుర్తించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముథోల్ సెగ్మెంట్లో అత్యధికంగా రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు శాఖల పరిధిలో మొత్తం 150 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైపోగా.. రూ.16 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆఫీసర్లు తెలిపారు. కొద్ది రోజులుగా వర్షం లేకపోవడంతో సంబంధిత ఆఫీసర్లు రోడ్లను పూర్తిగా పరిశీలించి నివేదికలు తయారు చేశారు.
తాత్కాలిక రిపేర్లుముథోల్ సెగ్మెంట్లోని ఏడు మండలాల్లో ఆర్అండ్బీ పరిధిలో 17 రోడ్లు, పంచాయతీ రాజ్పరిధిలో 30కి పైగా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతుల కోసం ఆర్అండ్బీ పరిధిలో రూ.10 కోట్ల వరకు, పీఆర్పరిధిలో రూ.6 కోట్ల వరకు నిధులు అవసరమని ఆఫీసర్లు తెలిపారు. తాత్కాలిక మరమ్మత్తుల కోసం ఆర్అండ్బీ పరిధిలో రూ.కోటి 90 లక్షలు అవసరం కాగా.. పీఆర్లో రూ.80 లక్షల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం అక్కడక్కడ తాత్కాలిక రిపేర్లు చేపడుతున్నారు.
మేజర్‌గా డ్యామేజ్ అయిన రోడ్లివే..
ముథోల్ నియోజకవర్గంలోని భైంసా, కుంటాల, కుభీర్, లోకేశ్వరం, ముథోల్, బాసర, తానూర్ మండలాల్లో రోడ్లు భారీగా డ్యామేజ్ అయ్యాయి. భైంసా మండలం సిరాల కట్ట వద్ద ప్రధాన రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కామోల్–-ఖత్గాం, భైంసా-–హాస్గుల్, మాటేగాం-–బోరిగాం, మహగాం-–చింతల్బోరి రోడ్లు దెబ్బతిని రాకపోకలు సాగించేందుకు కూడా వీల్లేకుండా ఉన్నాయి. కుభీర్-–పార్డి(బీ), కుంటాల మండలంలో అందకూర్-–వెంకూర్, లోకేశ్వరం మండలంలో నగర్-పిప్రి, అర్లి పురాతన వంతెన వద్ద, పుస్పూర్ రోడ్లు తెగిపోయాయి. ముథోల్ మండలంలో ఆష్ఠా-కన్కాపూర్, విఠోలి-వడ్తాల, బాసర మండలంలో ఓని-బాసర, కిర్గుల్(బి)-బాసర, తానూర్ మండలంలోని బోల్సా-–ఎక్స్‌రోడ్డు, నంద్‌గాం, ఎల్వత్–-ముథోల్ రహదారులు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల మైనర్డ్యామేజ్లు జరిగాయి. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లే ప్రజలు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కొన్ని గ్రామాలకు అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితులున్నాయి. పలు కల్వర్టులు సైతం ఎక్కడికక్కడ తెగిపోయాయి.