మేడారం ఆగమాగం.. జులైలో వరదలకు ధ్వంసమైన రోడ్లు

  • పనులను పట్టించుకోని పాత  సర్కారు
  • మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు పంపినా బేఖాతరు
  • ఫిబ్రవరి 21 నుంచి మహాజాతర

జయశంకర్‌‌ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు : మేడారం మహా జాతరకు టైం దగ్గర పడుతోంది. ఇంకా రెండు నెలలే గడువు ఉంది. జులైలో వచ్చిన వరదలకు సమ్మక్క జాతర ప్రాంగణం అంతా అస్తవ్యస్తంగా మారింది. చరిత్రలో తొలిసారిగా మేడారం గద్దెలకు వరద పోటెత్తింది. భారీ వర్షాలకు అంతర్గత రోడ్లు కొట్టుకపోగా, జంపన్నవాగుపై కట్టిన ఘాట్లు కూలిపోయాయి. తెగిన బ్రిడ్జిలు, కూలిన విద్యుత్​ స్తంభాలతో మేడారంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వరదల తర్వాత బీఆర్ఎస్​ ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయలేదు.  పనుల కోసం రూ.75 కోట్లతో ఆఫీసర్లు పంపించిన ఫైల్‌‌  పాత సర్కారు దగ్గరే  పెండింగ్​ పడింది. తాజాగా  కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువుదీరడం, ములుగు జిల్లాకు చెందిన సీతక్కకు మంత్రిపదవి దక్కడంతో కొత్త సర్కారుపైనే భక్తులు ఆశలు పెట్టుకున్నారు.

వరదలతో భారీ నష్టం.. 

ఈ ఏడాది జులైలో వచ్చిన భారీ వరదలకు మేడారం అతలాకుతలమైంది. భారీ వరదల కారణంగా ఈ ప్రాంతంలో రెండు వేలకుపైగా విద్యుత్‌‌  స్తంభాలు, 200కు పైగా విద్యుత్‌‌  ట్రాన్స్‌‌ఫార్మర్లు నేలకూలాయి. వాటిలో‌ కొన్నింటిని బాగు చేసినా జాతర ప్రాంగణంలోని 20 కిలోమీటర్ల  పరిధిలో పూర్తి స్థాయిలో కరెంట్‌‌ సప్లయ్‌‌ ను పునరుద్ధరించలేదని స్థానికులు చెబుతున్నారు. ఇక జంపన్నవాగు వద్ద భక్తుల కోసం నిర్మించిన కల్యాణకట్టల్లో ఐదు కొట్టుకపోగా, మూడు కట్టలు 50 శాతానికి పైగా దెబ్బతిన్నాయి. జంపన్నవాగుపై  మొట్లగూడెం బ్రిడ్జి కూలిపోగా, గోనెపల్లి బ్రిడ్జి కుంగిపోయింది. జంపన్నవాగుపై నిర్మించిన జంట వంతెనలు కూడా డ్యామేజ్  అయ్యాయి. మహాజాతరలోగా వాటన్నింటికీ రిపేర్లు చేయాల్సి ఉంది. మేడారం చుట్టుపక్కల వందల కిలోమీటర్ల పొడవునా నిర్మించిన అంతర్గత రోడ్లు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి. జంపన్నవాగుకు పోయే దారిలో, గ్రామ పంచాయతీ దగ్గర, హరిత కాకతీయ హోటల్‌, నార్లాపూర్‌‌, ఊరట్టం, వెంగళనగర్‌‌  తదితర ప్రాంతాల్లో వేసిన ‌సీసీ రోడ్లు, బీటీ రోడ్లు చాలా వరకు చోట్ల దెబ్బతిన్నాయి. వాటిన్నింటికి రిపేర్లు చేయాల్సి ఉంది. ఇక వరద తాకిడికి మేడారంలోని హరిత కాకతీయ హోటల్‌‌  పూర్తిగా నాశనం అయ్యింది. జంపన్నవాగు పొంగడంతో ఈ హోటల్‌‌  పూర్తిగా నీట మునిగింది. దీంతో ఇక్కడ 16 రూముల్లో ఉన్న ఏసీలు, ఫ్యాన్లు, మంచాలు, పరుపులు డ్యామేజయ్యాయి. అన్ని రూముల్లో పైకప్పు సీలింగ్‌లు ఊడి కింద పడ్డాయి. బురద నీళ్ల వల్ల జనరేటర్‌‌  పాడయ్యింది. నిజానికి మేడారం మహాజాతరకు ఆరు నెలల ముందే  నిధులు మంజూరు చేసి రిపేర్లు చేపట్టాల్సిన బీఆర్ఎస్​ సర్కారు నిర్లక్ష్యం చేసింది. జాతర నిర్వహణ కోసం రూ.75 కోట్లతో ఆఫీసర్లు ప్రతిపాదనలు తయారుచేసి సర్కారుకు పంపినా నిధులు కేటాయించలేదు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో సుమారు రెండు నెలల పాటు ఎలక్షన్‌‌  కోడ్‌‌ అమల్లో ఉండె. దీంతో అటు నిధులు లేక.. ఇటు పనులు చేయక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.

తరలివస్తున్న భక్తులు  

వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య మేడారం మహాజాతర జరగనుంది. వివిధ ప్రాంతాల నుంచి కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే  ప్రతి ఆది, బుధవారాల్లో సమ్మక్క భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. కొన్నేళ్లుగా ఇది ఆనవాయితీగా మారింది. జాతర సమయంలో పిల్లలతో వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఇబ్బందిగా భావించిన వాళ్లు ముందుగానే వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్తున్నారు. ఈ క్రమంలో  కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రూ.75 కోట్లతో ప్రతిపాదనలు 

మేడారం మహా జాతర పనులు,  మౌలిక వసతుల కోసం నాడు బీఆర్ఎస్  ప్రభుత్వానికి ఆఫీసర్లు రూ.75 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కానీ, పాత సర్కారు ఫండ్స్​ ఇవ్వలే. దీంతో ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా నిధులను త్వరగా మంజూరు చేసి వెంటనే పనులు చేపట్టాలి.
- ఆలకుంట రమేశ్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు, మేడారం గ్రామం, ములుగు జిల్లా

రెండు నెలలే గడువుంది 

మేడారం మహా జాతరకు ఇంకా రెండు నెలలే గడువుంది. కోటి మందికి పైగా భక్తులు వస్తారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలను బాగు చేయాలి. భక్తులకు అన్నీ సౌకర్యాలు కల్పించాలి. జాతర కోసం పాత సర్కారు నిధులివ్వలే. కొత్త సర్కారు  వెంటనే నిధులిచ్చి పనులు సక్రమంగా జరిగేలా చూడాలి.
- బంగారి చక్రపాణి,  మేడారం గ్రామం, ములుగు జిల్లా