- భారీ వర్షంతో మానుకోట జిల్లాకు తీవ్ర నష్టం
- వందల ఎకరాల్లో పంటలకు నష్టం
- మహబూబాబాద్‌లో తెగినపోయిన 25 చెరువులు
- ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
మహబూబాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వరదల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. 25 చెరువులు, కుంటలు తెగిపోవడంతో ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో హైలెవల్ బ్రిడ్జిల వద్ద రహదారుల కనెక్టివిటీ పూర్తిగా దెబ్బతిన్నది. కేసముద్ర మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో పునరుద్ధరణ పనులు వేగంగా నిర్వహిస్తున్నారు. మరిపెడ మండలం పురుషోత్తమగూడెం వద్ద భారీ వరద ఉధృతికి 365 నేషనల్ హైవే హైలేవల్ బ్రిడ్జి కనెక్టివిటీ, కిలోమీటర్ మేరకు రోడ్డు దెబ్బతిన్నది. మహబూబాబాద్ _మరిపెడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ మండలం ముల్కల పల్లి _ ఖమ్మం వెళ్లే రహదారి హైలెవల్ బ్రిడ్జి వద్ద కనెక్టివిటి దెబ్బతిన్నది.
చిన్నగూడూరు మండల కేంద్రం నుంచి ఉగ్గంపెల్లి వెళ్లే హైలెవల్ బ్రిడ్జి కనెక్టివిటీ, రోడ్డు పూర్తిగా కట్ అయ్యింది. తొర్రూరు_ నర్సంపేటకు రహదారి అమ్మాపురం వద్ద బ్రిడ్జి కనెక్టివిటీ దెబ్బతిన్నది. సోమారపుకుంట తండా రోడ్డు కొట్టుకుపోయింది. మరిపెడ మండలంలో ఎడ్జెర్ల _ధర్మారం, లక్ష్మతండాల _మరిపెడకు వచ్చే రోడ్డు దెబ్బతిన్నది. ఆకేరు వాగు పక్కనే ఉన్న సీతారామ్ నాయక్ తండా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోగా, తండాలోని 100 మందిని భూక్యా తండా రైతు వేదికకు తరలించి, పునరావాసం కల్పించారు. వివిధ గ్రామాల్లో భారీ చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయాయి. కురవి, డోర్నకల్ వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. నెల్లికుదురు మండలంలో ఆలేరు ఎక్స్ రోడ్ వద్ద లో లెవెల్ వంతెన కొట్టుకపోవడంతో తొర్రూర్_ మహబూబాబాద్ కు రాకపోకలు బంద్ అయ్యాయి. మహబూబాబాద్ టౌన్ లో రోడ్లు దెబ్బ తిన్నాయి. రహదారుల పునరుద్ధరణకు ఆఫీసర్లు సిద్ధమయ్యారు.
Also Read :- ఎవరిని కదిలించినా కన్నీళ్లే
పంటలకు తీవ్ర నష్టం..
మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షంతో 25 కుంటలు, చెరువులు పూర్తిగా తెగిపోయి వాగులు పొంగడంతో వందల ఎకరాల్లో పంటల నష్టం వాటిల్లింది. సోమవారం కొంత మేరకు వర్షం తగ్గడంతో రెవెన్యూ, అగ్రికల్చర్ ఆఫీసర్లు పంటలకు నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. జిల్లా వ్యవసాయాధికారి నిర్మల ఆధ్వర్యంలో పంట నష్టం అంచనా కొనసాగుతుంది.
ఏజెన్సీలో మంత్రి సీతక్క పర్యటన
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా గంగారం ఆశ్రమ బాలికల హైస్కూల్ ను సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ లో ఫుడ్ ను పరిశీలించి మెనూ ప్రకారం నాణ్యమైన ఫుడ్ అందించాలని హె చ్ కు ఆదేశించారు. అనంతరం కొత్తగూడలో మాజీ సర్పంచ్ భూపతి తిరుపతి తల్లి రెండు రోజుల క్రితం చనిపోగా ఆయనను పరామర్శించారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో మండల ఆఫీసర్లతో వరద నష్టంపై రివ్యూ నిర్వహించారు.
విచ్చలవిడిగా చెరువుల ఆక్రమణలవల్లే పెను ముప్పు
మహబూబాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రమంతటా చెరువుల ఆక్రమణల వల్లనే తీవ్ర నష్టం వాటిల్లిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని వరద ప్రాంతాల్లో ఆమె సోమవారం పర్యటన చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ మరణించడంపై సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ రామ్నాథ్కేకన్, ఆర్డీవో అలివేలు, వివిధ శాఖల అధికారులున్నారు.
రైతులను ఆదుకోవాలి..
రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. గతంలో ఎన్నడూలేని విధంగా పెద్ద చెరువు అలుగుపోయడంతో వాగు పొంగి వరి పంటపై ఇసుక మేటలు వేశాయి. పొలం సరిహద్దులు కూడా కనిపిస్తలేవు. నాతో పాటు అనేక మంది రైతులకు పంట నష్టం కలిగింది. సర్కారే మమ్ములను ఆదుకోవాలి.
రేఖా వెంకన్న, రైతు , నరసింహులపేట
కొట్టుకుపోతున్న ఆటో.. కాపాడిన గ్రామస్తులు
నెక్కొండ: వరంగల్జిల్లా నెక్కొండ మండలంలోని వెంకటాపురం- తోపనపల్లి నడుమ గల కాజ్వే లోలెవల్‌లో వరద ఉధృతికి కొట్టుకుపోతున్న కిరాయి ఆటోను సోమవారం గ్రామస్తులు కాపాడారు. ఆటోలో ప్రయాణికులు లేకపోవడం, డ్రైవర్ ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.