వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ సిటీలో ‘సామాన్యులకు అందుబాటులో లే ఔట్ ప్లాట్లు’ అంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న కాకతీయ అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ (కుడా).. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే చర్యలకు పాల్పడుతోంది. కుడా ప్రాజెక్ట్పేరుతో అధికారులు, పాలకవర్గం మూడేండ్లకోసారి వేలం పాటలో ఎక్కువ ధరకు పది, ఇరవై ప్లాట్లు అమ్ముతున్నారు. కుడా అమ్మే రేట్లను సాకుగా చూపుతున్న ప్రైవేట్ వెంచర్లు అప్పటివరకు ఆ ప్రాంతంలో తక్కువగా ఉన్న ధరను గజానికి నాలుగైదు వేలు పెంచి జనం జేబులు గుల్ల చేస్తున్నాయి. కుడా నుంచి కొందరు పెద్దలు ‘నీకింత.. నాకింత’ టైపులో సొంత లాభం చూసుకుని పరోక్షంగా సాయం చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
జనం సొమ్ముతో ప్రైవేట్ వెంచర్లకు రోడ్లు
కామన్ మ్యాన్‍ను దృష్టిలో పెట్టుకుని 150 ఎకరాల్లో ‘మా సిటీ’ రియల్ బిజినెస్ చేస్తున్నామని కుడా పెద్దలు చెబుతున్నా.. వీరు వేసే అడుగులు మొదటినుంచీ ప్రైవేటు వెంచర్లకు లాభం చేసేలా ఉంటున్నాయి. కుడా వెంచర్ డెవలప్‍మెంట్ పేరుతో నాలుగేండ్ల క్రితం ప్రైవేట్ వెంచర్లను దాటి భూములను కొన్నారు. హనుమకొండ నుంచి మడిపల్లి రోడ్‍లోని ప్రభుత్వ వెంచర్ వరకు దాదాపు 12 కిలోమీటర్ల దూరం.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన కోట్లాది రూపాయలతో డబుల్ రోడ్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు. అప్పటివరకు బైకులు కూడా సక్రమంగా నడవలేని దారులను డబుల్ రోడ్లు చేశారు. అయితే 150 ఎకరాలు ఉండగా కేవలం 50 ప్లాట్లకు మాత్రమే ప్రకటన జారీ చేశారు. గజానికి రూ.3 వేల మార్కెట్ రేట్ఉండగా కొందరితో రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు వేలం పాడించి అమాంతం ధర పెంచారు. ఇందులో కేవలం 31 ప్లాట్లు విక్రయించి ప్రాజెక్ట్ ఆపివేశారు. రూ.4 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పటివరకు రూ.3 వేలకు గజం చొప్పున అమ్మిన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. తమకంటే దూరంలో ఉండే ‘మా సిటీ’ ప్రాజెక్ట్ను సాకుగా చూపి రూ.6 వేలకు ధర పెంచారు. తమ వెంచర్ల మెయిన్ గేటు ముందు నుంచే విశాలమైన రోడ్లు, లైటింగ్ వెళ్లడాన్ని చూపుతూ గడిచిన మూడేండ్లుగా వారి వ్యాపారాన్ని రెండు మూడింతలు పెంచుకున్నారు.
ప్రైవేట్ వెంచర్లలో రేట్లు పెరిగేలా..
రెండో దఫా మా సిటీ ప్లాట్ల బిజినెస్ పేరుతో వేలం వేసేందుకు కుడా పెద్దలు రెడీ అవుతున్నారు. మొదటి దశలో తక్కువలో తక్కువ రూ.8 వేల ధర పలికిందనే కారణం చూపుతూ ఈసారి 98 ప్లాట్లకు మినిమం వేలం పాట ధర రూ.8 వేలుగా నిర్ణయించారు. ఈస్ట్ఫేసింగ్ ప్లాట్లయితే రేటు మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. గతంలో మాదిరి ఈసారి ఇక్కడి ప్లాట్లకు ధరలు పెంచి ప్రైవేట్ వెంచర్లకు లాభం చేసే కుట్ర కనపడుతోంది. కుడా పెద్దలు సామాన్యుల మేలు కోరేలా ఆలోచిస్తే ఇక్కడున్న ప్రైవేట్ ధరల కంటే తక్కువ రేట్లకు అమ్మాల్సి ఉండగా.. వేలం పేరుతో రియల్ వ్యాపారులతో చేతులు కలిపి గజానికి రూ.15 వేల నుంచి రూ.20 వేలకు కొన్ని ప్లాట్ల విక్రయాలు జరిగేలా కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుడా తరపున గతంలో మాదిరి కొన్ని ప్లాట్లు విక్రయించి సైలెంట్ అయితే.. మా సిటీ ధరలను చూపుతూ ప్రైవేట్ వెంచర్ల నిర్వాహకులు వందల ఎకరాల్లో వారు చేసిన ప్లాట్లలో గజం ధర తక్కువలో తక్కువ రూ.12 వేలకు పెంచే అవకాశం ఉంది. రేటు విషయంలో అధికారులు తీసుకున్న నిర్ణయంపై కుడాలోని కొందరు సభ్యులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల స్పందన ఆధారంగా రేట్లు నిర్ణయిస్తాం
మా సిటీ ప్లాట్ల రేట్ల విషయంలో జనాల రెస్పాన్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. గత ప్రాజెక్టులో రూ.3 వేల కనీస ధర ఉంది. 98 ప్లాట్లకు ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం అధికారులు రూ.8 వేలకు పెంచారు. ఎవరైనా ప్రైవేట్ వెంచర్ల వ్యక్తులు కావాలని ప్రస్తుత ధర కంటే ఎక్కువ పెంచే ప్రయత్నం చేస్తే తెలిసిపోతుంది. పెంచిన ధరతో కొనుగోలు చేసేందుకు జనాలు ఇంట్రెస్ట్చూపే అవకాశం ఉండదు. అదే జరిగితే మా సిటీ ప్లాట్ల ధర తగ్గించే విషయంలో మరోమారు కూర్చొని నిర్ణయం తీసుకుంటాం.- సుందర్‍రాజ్ యాదవ్, కుడా చైర్మన్
అప్పుడు రూ.3 వేలు.. ఇప్పుడు 8 వేలు
రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన కుడా మొదట వరంగల్‍లో ఓ సిటీ ప్రాజెక్ట్ చేపట్టింది. అది నడుస్తున్న క్రమంలోనే చిట్‍ఫండ్ కమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ నడిపే ప్రైవేటు వెంచర్ల నిర్వాహకులు హనుమకొండ సిటీ నుంచి దేవన్నపేట, మడిపల్లి దారిలో వందల ఎకరాల్లో ప్లాట్ల బిజినెస్ మొదలుపెట్టారు. కుడా సైతం వీటన్నింటిని దాటుకుంటూ వెళ్లి 150 ఎకరాల్లో ‘మా సిటీ’ లే ఔట్ ప్లాట్ల వెంచర్ డెవలప్ చేసింది. 2019లో మర్రి యాదవరెడ్డి కుడా చైర్మన్‍గా ఉండగా 51 ప్లాట్లు అమ్మేందుకు ప్రకటన ఇచ్చింది. వేలం పాటలో గజం ధర రూ.3 వేలుగా నిర్ణయించింది. ఇప్పుడు కుడా చైర్మన్‍గా సుందర్‍రాజ్ ఉండగా.. అధికారులు రెండోసారి 98 ప్లాట్లను అదే తరహాలో విక్రయించనున్నట్లు ప్రకటన జారీ చేశారు. ఈసారి మాత్రం గజం ధర రూ.8 వేలుగా నిర్ణయించారు. ఈ నెల 13న దీనికి సంబంధించి వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రూ.25 వేల బ్యాంక్ టోకెన్ తీసుకుని వేలంలో పాల్గొనాలని చెప్పారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.