అభివృద్ధికి ప్రత్యేక నిధులు లేవు..
ఏటా రిపేర్లకు లక్షల్లో ఖర్చు
అయినా శాశ్వత పరిష్కారం చూపని కార్పొరేషన్
నిజామాబాద్, వెలుగు : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో రోడ్లు అధ్వాన స్థితికి చేరాయి. 80 రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వరదతో రోడ్లు కోతకు గురికాగా, మరికొన్ని రోడ్లు కొట్టుకుపోయాయి. అర్బన్ లో రోడ్లు దెబ్బతినగా రూ. 3 కోట్ల నష్టం వాటిల్లింది. కార్పొరేషన్ లో 35 రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తేల్చారు.
అన్ని డివిజన్లలో అంతే..
అర్బన్‌లోని 4వ డివిజన్ మాధవ్ నగర్, 2వ డివిజన్ లోని మాణిక్ బండార్, 13 డివిజన్ లోని సారంగాపూర్ , 7వ డివిజన్ లో రేడియో స్టేషన్, 5వ డివిజన్ లో బోర్గం, 10 వ డివిజన్, 1వ డివిజన్ల పరిధిలో బ్రహ్మపురి, నాగారం బ్రహ్మణకాలనీల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిర్మల్ హృదయ కాన్వెంట్ రోడ్, మహాలక్ష్మి టెంపుల్ రోడ్లు దెబ్బతిన్నాయి. అర్బన్ పరిధిలో సుమారు 35 రోడ్లు కొట్టుకుపోయి గుంతలు పడ్డాయి. సుమారు రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. అర్బన్‌లోని లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోగా కొన్ని డివిజన్లలో గుంతలు పడ్డాయి.
అభివృద్ధి ఊసే లేదు..
అర్బన్ లో రోడ్ల అభివృద్ధికి కార్పొరేషన్ బడ్జెట్లో ఫండ్స్ కేటాయింపు దాఖలాలు లేవు. డివిజన్ అభివృద్ధికి వచ్చిన ఫండ్స్ లోనే రోడ్లను నిర్మిస్తున్నారు. వర్షకాలంలో కార్పొరేషన్ స్పెషల్ ఫండ్స్ తో రిపేర్లు చేస్తున్నారు.ప్రతీ వర్షాకాలంలో దెబ్బ తిన్న రోడ్లకు రూ. 50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినా శాశ్వత పరిష్కారం చూపడంలేదు. కొన్ని డివిజన్ లలో రోడ్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ చేపట్టారు. అర్బన్ లో మెయిన్ రోడ్స్ మెయింటెన్స్ పై ఆర్ అండ్ బీ నిధులు ఖర్చు చేస్తోంది. డ్రైనేజ్ లు సానిటేషన్ పై దృష్టి పెడుతున్న ఆఫీసర్లు రోడ్ల అభివృద్ధిని పట్టించుకుంటలేరని విమర్శలు ఉన్నాయి.
గుంతల రోడ్లపై నరకయాతన
అధ్వానంగా ఉన్న అర్బన్ రోడ్లపై ప్రయాణం నరకంగా ఉంది. వర్షాలతో రోడ్లు గుంతలు పడ్డాయి. ఇంతవరకు గుంతలను పూడ్చలేదు. కార్పొరేటర్లు ఆఫీసర్లు రోడ్లను పట్టించుకుంటలేరు. గుంతల్లో నీరు నిల్వ ఉండడంతో యాక్సిడెంట్లు అవుతున్నయి. వెంటనే రోడ్లు రిపేర్లు చేయాలె.
- భిక్షపతి స్థానికుడు చంద్రశేఖర్ కాలనీ
రోడ్లను అభివృద్ధి చేయాలి
అర్బన్ రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టడంలేదు. ఇందూరు నగరం లో ని 36, 35 డివిజన్ లలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఎమ్మెల్యే టివీ డిబేట్ లకు పరిమితమయిన్రు. అర్బన్ లో పర్యటిస్తే రోడ్ల పరిస్థితి తెలుస్తది. రోడ్లు గుంతలుగా మారినా ఆఫీసర్లు పట్టించుకుంటలే. ఆఫీస్ ల నుండి బయటకు వస్తే ఖరాబైన రోడ్లు కన్పిస్తయి.
- కేశ వేణు మాజీ కార్పొరేటర్