- జిల్లాలో బురద, గుంతలమయంగా రోడ్లు
- ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ప్రజలు
- పల్లె, పట్టణం ఎక్కడ చూసినా ఇదే దుస్థితి
- ఏజెన్సీ గ్రామాల్లో మరీ అధ్వాన్నం
అధ్వాన్న రోడ్లు.. అడుగేస్తే పాట్లు.. ఆదమరిస్తే హాస్పిటలే.. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి. మూడు రోజుల నుంచి వర్షం కురుస్తుండడంతో దారులు దారుణంగా తయారయ్యాయి. పల్లె పట్టణమన్న తేడా లేకుండా చిన్న పాటి వర్షానికి రోడ్లపై గుంతలు పడ్డాయి. వాహనాలు నడపాలంటే ప్రజలు భయపడిపోతున్నారు.
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు వందకు పైగా రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వీటికి తోడు వర్షానికి చిన్నచిన్న కల్వర్టులు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రోడ్లు కి.మీ. మేర ప్రమాదకరంగా మారాయి. అత్యవసర సమయంలో వైద్యం అందే పరిస్థితి లేదు. కొన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది రోడ్డు, వంతెనలు లేకపోయినా కాలినడకన గ్రామానికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. బజార్హతూర్, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, బీంపూర్, ఆదిలాబాద్ రూరల్, తాంసి, తలమడుగు మండలాల్లోని మారుమూల గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. ఈ వర్షానికి ఉన్న మట్టి రోడ్లు బురదమయంగా తయారయ్యాయి..
ఏటా వర్షకాలంలో చాలా గ్రామాల్లో రోడ్లు, కల్వర్డులు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోతాయి. అసలే రోడ్లు లేని గ్రామాలకు ప్రత్యామ్నాయంగా రోడ్లు వేయాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలో మాత్రం ఇవేమీ కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటు వర్షకాలానికి ముందే అధికారులు సైతం దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ ఫొటోలో బురదమయమై కనిపిస్తున్న రోడ్డు బజార్హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి వెళ్లే రోడ్డు. ప్రతి ఏడాది వర్షకాలంలో చినుకుపడితే ఈ రోడ్డు చిత్తడిగా మారుతుంది. ఈ గ్రామ ప్రజలు దాదాపు 6 కి.మీ. బురదలోనే ప్రయాణించాల్సి వస్తోంది. ఒకవేళ అత్యవసర సమయంలో వైద్యం కోసం హాస్పిటల్కు వెళ్లాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే.
పెద్దపెద్ద గుంతలతో కనిపిస్తున్న ఈ రోడ్డు బోథ్ మండలంలోని సొనాల గ్రామం మీదుగా వెళ్లే దారి. దీని గుండా బజార్హత్నూర్, ఇచ్చోడ మండల కేంద్రాలకు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు నడుస్తాయి. రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతో చిన్నపాటి వర్షానికి గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. 2 కి.మీ. వరకు ఇలాగే అధ్వాన్నంగా ఉంది.
రోడ్డు లేక నరకం అనుభవిస్తున్నం
మా గ్రామానికి ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేదు. వర్షకాలంలో రోడ్డుపై ప్రయాణించాలంటే నరకం అనుభవిస్తున్నం. బురదలో నడవలేకపోతున్నం. బండ్లపై వెళ్తే జారి పడుతున్నం. రోడ్డు సౌకర్యం లేక విద్యకు, వైద్యానికి దూరమవుతున్నం. ఎమర్జెన్సీ అయితే దేవుడి మీద భారం వేయాలి. కనీసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి. దయచేసి ప్రభుత్వం మా గోస చూసి ఇప్పటికైనా రోడ్డు వేయాలి.
- తర్మేక్వాడ్ రాము, గ్రామం డెడ్రా