రహదారుల రూపురేఖలే మార్చారు: మ్యాన్ ఆఫ్​​ది ఇన్ర్ఫాస్ట్రక్చర్​

రహదారుల రూపురేఖలే మార్చారు: మ్యాన్ ఆఫ్​​ది ఇన్ర్ఫాస్ట్రక్చర్​

నితిన్ గడ్కరీ శైలి విభిన్నమైందిగా పేరొందింది. ముఖ్యంగా భారతీయ రాజకీయాల్లో ఆయన చేసిన కృషి, అతని పనితీరులో చూపించిన సృజనాత్మకత వల్ల  గడ్కరీ రాజకీయ చరిత్ర, ఆయన వ్యాఖ్యలు, విధానాల్లో ప్రత్యేకతలు కొన్నున్నాయ్. నితిన్ జైరామ్ గడ్కరీ 27 మే,1957లో మహారాష్ట్రలో జన్మించారు. ఆయన న్యాయశాస్త్రంలో విద్యాభ్యాసం చేశారు. మహారాష్ట్ర విద్యార్థి పర్యావరణంలోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.

 1976లో విద్యార్థి నాయకుడిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో చేరడం ద్వారా రాజకీయ జీవితం మొదలైంది. అంచెలంచెలుగా మహారాష్ట్రలో బీజేపీకి కీలక నాయకుడిగా ఎదిగారు.  గడ్కరీ మహారాష్ట్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా అభివృద్ధి చెందారు. 

మహారాష్ట్రలో రహదారుల రూపురేఖలే మార్చారు1995–--99 మధ్య కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆయన రహదారి నిర్మాణాన్ని పురోగమించే విధానాలకు పునాదులు వేశారు. పుణే-ముంబై ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వే లాంటి ప్రాజెక్టులతో ఆయన మహారాష్ట్రలో రహదారుల రూపురేఖలే మార్చేశారు.  2009లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

 భారతదేశంలో రహదారులు, రవాణా, మరియు హైవేలు అభివృద్ధికి ఆయన అద్భుతమైన కృషి చేశారు. 2014లో కేంద్ర రవాణా, హైవేల మంత్రిగా నియమించబడ్డారు, ఆయన పరిశ్రమ పునరుజ్జీవనానికి పాటుపడ్డారు. 

నూతన ప్రతిపాదనలకు ఆయన పెట్టింది పేరు

గడ్కరీ ప్రసంగాలు సాధారణ ప్రజలతో సులభంగా అనుసంధానమయ్యేలా ఉంటాయి. ఆయన అనేక సందర్భాల్లో కేవలం రాజకీయాల్లోనే కాదు, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం,  టెక్నాలజీపై కూడా ప్రత్యేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆయన అందరికంటే ముందుగా పరిశ్రమల అభివృద్ధి కోసం సృజనాత్మక పరిష్కారాలను ప్రోత్సహించడం, పారిశ్రామిక అవసరాలను తీర్చడం కోసం చట్టసభలో నూతనప్రతిపాదనలు చేయడం ఆయనకి ఉన్న ప్రత్యేకత. గడ్కరీకి ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్’ అనే పేరుంది,  ఆయన నేతృత్వంలో రహదారుల నిర్మాణం విస్తృతంగా జరిగింది.  

సమర్థతకు ప్రాధాన్యం

సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా గడ్కరీ ఎప్పుడూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్లాస్టిక్ నుంచి, సహజ వనరుల నుంచి రహదారులు నిర్మించే సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. ఆవిష్కరణాత్మకతకుపెట్టింది పేరు. ఆయన టోల్ ఫ్రీ హైవేలు, ఫ్లైఓవర్లు, రివర్ షిప్పింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి సాంకేతిక పరిష్కారాలను ముందుకు తెచ్చారు.  సార్వజనీన అభివృద్ధికి తోడ్పడ్డారు. గడ్కరీ పనితీరులో సమర్థతకు ప్రాధాన్యత ఉంటుంది. 

కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే కాదు, అవి సాధారణ ప్రజలకు ఉపయోగకరంగా ఉండేందుకు కూడా ఆయన శ్రద్ధ చూపుతారు. భారతదేశ రవాణా వ్యవస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని ఆయన లక్ష్యం. ‘బుల్లెట్ ట్రైన్’ ప్రాజెక్టు, అభివృద్ధి చెందుతున్న రహదారులు,  క్లీన్ ఎనర్జీ ప్రమాణాలను పాటించే వాహనాలను ప్రోత్సహించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

నిబద్ధత గల నేత

నితిన్ గడ్కరీ ఒక నిబద్ధత గల నాయకుడు, వ్యక్తిగత అనుభవాలతోనే కాక, వాస్తవికత, సుస్థిర అభివృద్ధిని కాంక్షించే నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. నితిన్ గడ్కరీని ‘అజాత శత్రువు’ అని పిలవడం ఆయన రాజకీయ వ్యక్తిత్వానికి సజీవ చిహ్నం. ఈ పదానికి అర్థం ‘శత్రువులేని వ్యక్తి’ అంటే రాజకీయ రంగంలో దురభిప్రాయాలు లేని వ్యక్తి. గడ్కరీ తన సున్నితమైన, పారదర్శక సమర్థమైన పనితీరుతో రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులతో కూడా మంచి సంబంధాలు కాపాడుకుంటారు. ఇది ఆయన రాజకీయ జీవితం, వ్యక్తిత్వానికి సంబంధించిన కీలక అంశం.

సౌమ్యుడు

సహజ సౌమ్యత ఆయన సొంతం. గడ్కరీ రాజకీయాలలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సౌమ్యంగా ప్రవర్తిస్తారు. రాజకీయ విభేదాల పరంగా ఆయన ఎప్పుడూ వ్యక్తిగత దూషణలు లేదా అవమానాల వైపు వెళ్లడం లేదు. బీజేపీలోనే కాకుండా, ఇతర పార్టీల నాయకులతోనూ ఆయన సమన్వయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. గడ్కరీ వివాదాలపై పరిష్కారాలను ప్రతిపాదించే విధానం ఆయన ప్రత్యేకత. 

ప్రతి పక్షాలతోనూ చర్చలు జరిపి, అభివృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడం ఆయనకి తెలిసిన కళ. ఆయన టెక్నోక్రాట్‌‌‌‌గా భావించబడుతూ, రాజకీయ అంశాలపై కంటే, నిష్పక్షపాతంగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టడం ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతుంది. వివాదాలకు  దూరంగా ఉంటారు. గడ్కరీ రాజకీయ విమర్శలు తట్టుకుని తనకు తానే సమాధానాలు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటారు. అభివృద్ధికి పెద్దపీట వేస్తారు. 

అజాత శత్రువుగా..

కేవలం రాజకీయ వ్యూహాలకు కట్టుబడి ఉండకుండా, ప్రజలకు ఉపయోగపడే విధానాలు అమలు చేయడంలో దృష్టి పెట్టడం ఆయనను అజాత శత్రువుగా నిలబెట్టింది. గడ్కరీ పట్ల ప్రతిపక్ష నాయకులు కూడా గౌరవం కలిగిఉంటారు. ఆయన పనితీరును ఇతర పార్టీల నాయకులు కూడా ప్రశంసిస్తారు. కాంగ్రెస్ నుంచి శరద్ పవార్ వంటి ప్రముఖులు గడ్కరీ సృజనాత్మకతను, రాజకీయ నాయకుడిగా ఆయన సమర్థతను మెచ్చుకున్నారు. 

గడ్కరీని అజాత శత్రువుగా పేరొందించడానికి కారణం ఆయన స్వచ్ఛమైన, పారదర్శక పాలన. కాంట్రా క్టర్లతో సంబంధాల విషయంలో ఆయన అనుసరించిన విధానం, రహదారులు, హైవేలు,  ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తీసుకున్న నిర్ణయాలు, ఎటువంటి అనుమానాలకు తావు ఇవ్వలేదు. నితిన్ గడ్కరీ తన రాజకీయ జీవితంలో పలు అడ్డంకులను దాటుతూ, ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ, స్నేహపూర్వకతతో కూడిన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మోదీ ప్రభుత్వంలో ఉత్యుత్తమ మంత్రి (సక్సెస్​ఫుల్​ మినిస్టర్)గా​ గడ్కరీని ప్రజలు భావిస్తుండటం కూడా మనం గమనించొచ్చు.

– డా. చిట్యాల రవీందర్