- రాష్ట్రంలో హడలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు
- ఈ ఏడాది 9 నెలల్లోనే 18,991 ప్రమాదాలు
- 5606 మంది మృతి, 17,689 మందికి గాయాలు
- నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్పాటించకపోవడమే ప్రధాన కారణం
హైదరాబాద్, వెలుగు:నిత్యం యాక్సిడెంట్లతో రాష్ట్రంలోని రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. వాహనదారులను, సామాన్య జనాన్ని ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. బుధవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్లలో మరణిస్తున్న వారిలో 70 శాతం మంది యువతే ఉంటున్నారు.
నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, నిద్రలేమి, డ్రంకన్ డ్రైవ్ వల్లే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు.ఈ ఏడాది తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు సగటున 70 ప్రమాదాలు జరుగగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 18,991 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 5,606 మంది చనిపోయారు. 17,689 మంది గాయాలపాలయ్యారు.
గతేడాదితో పోల్చితే 2,075 ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 7,168 యాక్సిడెంట్లు రిపోర్ట్ కాగ.. 1,380 మంది ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1,027 ప్రమాదాలు జరగ్గా 328 మంది చనిపోయారు. మరో 1,019 మంది గాయాలపాలయ్యారు. ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం
రోడ్ సేఫ్టీపై ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా వాహనదారులు నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదు. పర్యవసానంగా ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పటిలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఆ తరువాతి స్థానంలో వరంగల్ నిలిచింది. రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ చేయడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని పోలీస్ గణాంకాలు చెబుతున్నాయి.
నిర్లక్ష్యంగా వాహనం నడిపిస్తూ తమతో పాటు పాటు ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. బైక్ జర్నీ డెత్స్ ఎక్కువగా ఉండడం వాహనదారులను కలవర పెడుతున్నది. బైక్ ప్రమాదాలకు గురైన వారిలో చాలామంది హెల్మెట్ వాడకపోవడంతోనే ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు చెప్తున్నారు.
68 శాతం ప్రమాదాలకు యువతే కారణం
అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ 68 శాతం రోడ్డు ప్రమాదాలకు యువతే కారణమవుతున్నట్లు పోలీసు కేస్ట్ స్టడీస్ చెప్తున్నాయి. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ ఉండే ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8గంటల మధ్యలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రాత్రి11గంటల తర్వాత టూవీలర్‌పై వెళ్లే వారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు.
ఖాళీగా ఉన్నరోడ్స్‌పై ఓవర్ స్పీడ్‌తో డ్రైవ్ చేయడమేనని దీనికి కారణమని పోలీసులు అంటున్నారు. అలాగే సిటీ రోడ్లపై ఫుట్‌పాత్‌లకు రెయిలింగ్, ప్రీకాస్ట్ సిమెంట్ బ్లాక్స్, సైన్‌బోర్డులు, స్టాపేజ్ సిగ్నళ్లు, సైడ్ రెయిలింగ్స్ సరిగా లేని ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఓ వైపు ట్రాఫిక్ రూల్ పాటించని వాహనాదారులు మరోవైపు రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోని అధికార యంత్రాంగం రోడ్డు ప్రమాదాలకు కారణముతున్నారు.