గతేడాది జులైలో కురిసిన వానలకు టోలిచౌకిలోని రోడ్లు గుంతలమయంగా మారాయి. వానలు తగ్గిన తర్వాత అదే నెలలో అధికారులు రిపేర్ పనులు చేపట్టారు. సరిగ్గా 10 రోజుల్లోనే అక్కడ మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. కొన్నాళ్లకు ఆ రోడ్లను మళ్లీ రిపేర్ చేశారు.నాణ్యత పాటించకపోవడంతో మరోసారి అదే సమస్య రిపీట్అయ్యింది. నాణ్యత లేకపోవడంతో ఆరు నెలల్లో రెండుసార్లు రిపేర్లు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది.
యాకుత్‌పురా నుంచి రెయిన్‌బజార్ వరకు 6 నెలల కిందట రూ.65 లక్షలతో సీసీ రోడ్డు వేశారు. కానీ, ఈ రోడ్డు మూడు నెలల్లోనే డ్యామేజ్ అయ్యింది. దీనిపై బల్దియా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి పనుల్లో క్వాలిటీ లోపం ఉన్నట్లు గుర్తించారు. పనుల్లో నాణ్యత పాటించలేదని గుర్తించిన ఉన్నతాధికారులు చార్మినార్ సర్కిల్ ఎస్ఈకి ఈనెల 13న షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్, వెలుగు: కోట్ల రూపాయలు ఖర్చు చేసి జీహెచ్ఎంసీ రోడ్ల పనులు చేపడుతున్నప్పటికీ.. వాటిలో నాణ్యత కనిపించడం లేదు. సిటీలో వరుసగా రోడ్లు కుంగిపోవడానికి ఇది కూడా ఓ కారణమే. పనుల్లో క్వాలిటీ లేకపోవడంతో చేసిన చోటనే మళ్లీ మళ్లీ పనులు చేయాల్సి వస్తోంది. రోడ్లు వేసిన మూడు, నాలుగు నెలల్లోనే కరాబ్ అవుతుండటంతో పరిస్థితి మొదటికి వస్తోంది. ముఖ్యంగా అంతర్గత రోడ్లను గుడ్డిగా చెక్ చేసి లైన్ క్లియర్ చేస్తుండటంతో వేసిన కొన్నాళ్లకే మళ్లీ రిపేర్లకు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయడంలోనూ అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సిటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాసిరకం మెటీరియల్..
గ్రేటర్లో మొత్తం 9,013 కి.మీ. విస్తీర్ణంతో రహదారులు ఉండగా.. 2,846 కి.మీ. మేర బీటీ రోడ్లు, 6,167 కి.మీ. మేర సీసీ రోడ్లు ఉన్నాయి. రోడ్ల నిర్వహణకు, నిర్మాణం, రిపేర్లకు జీహెచ్ఎంసీ ప్రతి ఏటా సుమారు రూ.900 కోట్లను ఖర్చు చేస్తోంది. రోడ్ల రీ కార్పెటింగ్, మెయింటెనెన్స్ కోసం 2016 నుంచి ఇప్పటివరకు మొత్తం 3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. కాంక్రీట్ పేమెంట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లు, రోడ్ల నిర్మాణం, రిపేర్లను ఏటా నిర్వహించాల్సి ఉంటుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇలా వివిధ విభాగాలకు సంబంధించి సుమారు 10 వేల సివిల్ పనుల కోసం ఏటా రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్లు వాడుతున్న మెటీరియల్ నాసిరకంగా ఉంటోంది. ఫలితంగా ఈ పనులు కొంత కాలానికే దెబ్బతింటున్నాయి. దీంతో ఆ కాంట్రాక్టర్లకే మళ్లీ పనులు అప్పగిస్తుండటంతో వారు అందినకాడికి దండుకొని నాసిరకం పనులు చేస్తున్నారు.
పర్యవేక్షణ లేకపోవడంతో..
నిర్ణీత సమయంలో రోడ్డు పాడైపోతే సదరు కాంట్రాక్టరే రిపేర్ పనులు చేపట్టాలి. కానీ వారు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో మళ్లీ జీహెచ్ఎంసీనే ఖర్చు చేసి ఆ పనులు చేయిస్తోంది. కాంట్రాక్టర్లపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వారు ఇష్టారీతిన పనులు చేసి చేతులు దులుపుకొంటున్నారు. టెండర్లు వేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన తర్వాత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనులు పూర్తయిన తర్వాత క్వాలిటీ చెక్ చేసి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి పర్యవేక్షణ లేకుండానే క్లియరెన్స్ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పనుల కారణంగా ప్రజాధనం వృథా అవుతుందని సిటిజన్లు మండిపడుతున్నారు.
దుబారా ఖర్చు చేయొద్దు జీహెచ్ఎంసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది. నాసిరకం పనులు చేసి బల్దియాపై భారం వేయొద్దు. చేసే కొన్ని పనుల్లో కూడా నాణ్యత పాటించడం లేదు. క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఇప్పటికైనా మేల్కొవాలి.
–అబ్దుల్ రెహమాన్, సోషల్ యాక్టివిస్ట్