దాదాపు అందరి అభిప్రాయం రోడ్లు (రహదారులు) అభివృద్ధికి సోపానాలు. రోడ్లనే ఆయా దేశాల అభివృద్ధికి సంకేతాలుగా భావిస్తారు. అమెరికా వెళ్లివచ్చిన ప్రతి ఒక్కరు ‘ఆహా అక్కడ రోడ్లు అద్భుతం’ అని ఇక్కడి వాటితో పోల్చి వాపోతుంటారు. రోడ్లు వస్తే మంచిది అని చాలామంది నమ్ముతారు. రోడ్ల కోసం ప్రజలు ఆందోళన చేస్తుంటారు. రోడ్డు వేస్తే కొందరికి లాభం. ఇంకొందరికి నష్టం. రోడ్డు వేస్తే వ్యాపారాలు పెరుగుతాయని సంతోషించేవారు కొందరు అయితే రోడ్డు వలన ఉపాధి కోల్పోతున్నవారి బాధ ఎవరికీ పట్టదు. రోడ్లు వేయడం ప్రగతికి సంకేతాలుగా భావించి రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో ఓట్ల కోసం దీనిని తమ రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు.
రోడ్ల వలన కలిగే లాభనష్టాలు బేరీజు వేసుకోకపోవడం వల్ల ఈ ‘అభివృద్ధి’ అస్త్రం ఒక రాజకీయ సమస్యగా అనేక దేశాలలో ఇప్పటికే పరిణమించింది. మన దేశంలో కూడా మారబోతున్నది. పల్లెలను పట్టణాలకు కలిపే రోడ్లు, అడవిలోని నివాసాలకు సమీప పల్లెలకు కలిపే రోడ్లు మార్పుకు నాంది పలుకుతాయి. ఈ మధ్య దృశ్య శ్రవణ మాధ్యమాలు పెరిగినాక మారుమూల పల్లెలలో రోగులు, గర్భిణీల వెతలు చూపెడుతూ రోడ్ల కోసం డిమాండ్లు కనపడుతున్నాయి. వాగులకు, నదులకు రెండు తీరాలు కలిపే బ్రిడ్జీలు ఈ డిమాండ్లో భాగమే. రాజకీయ నాయకులే కాంట్రాక్టర్లు అయిన ప్రతి సందర్భంలో ఆయా ప్రాంతంలో రోడ్ల మీద ప్రభుత్వ పెట్టుబడులు పెరిగినాయి.
కొన్ని రోడ్లు కొందరికే పరిమితం
భారతదేశంలో మొత్తం రహదారుల పొడవు 63.86 లక్షల కిలోమీటర్లు. అమెరికాలో 66.45 లక్షల కిలోమీటర్ల రహదారి నెట్‌వర్క్ ఉన్నది. ఇందులో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలు, రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రహదారులు, ఇతర జిల్లా రహదారులు, గ్రామ రహదారులు ఉన్నాయి. చిన్న, పెద్ద రోడ్లే కాకుండా అవి ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారు అనేది కూడా ముఖ్యం. రోడ్డు బట్టి ప్రభుత్వ శాఖలకు
బాధ్యతలు ఉన్నాయి. మునిసిపల్ రోడ్లు, R&B రోడ్లు, పంచాయతిరాజ్ రోడ్లు, జిల్లా పరిషత్ రోడ్లు, కార్పొరేషన్ రోడ్లు, జాతీయ రోడ్లు, అంతర్రాష్ట్ర రోడ్లు, సరిహద్దు రోడ్లు వగైరా రోడ్ల బాధ్యత ఆయా శాఖలు లేదా ప్రత్యేక సంస్థలు నిర్వహిస్తాయి. ఎలివేటెడ్ రోడ్లు, అండర్ పాస్ రోడ్లు, బైపాస్ రోడ్లు, సొరంగం రోడ్లు, ఆక్సెస్ కంట్రోల్డ్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, రింగ్ రోడ్లు, ఎక్స్‌ప్రెస్ రోడ్లు వాటి డిజైన్ ద్వారా కొందరికే పరిమితం చేస్తారు. మెట్రో నగరాలను కలిపే రోడ్డు ప్రాజెక్ట్లు వేగంగా పయనించే వాహనాలకు నిర్మిస్తారు. ఆ తోవలో చిన్న పట్టణాలు, పల్లె వాసులు వాటిని ఉపయోగించకుండా వాటి పరిధిలో రోడ్డు ఎత్తుగా వేస్తారు.
ఓఆర్ఆర్ భారం రూ.12వేల కోట్లు
హైదరాబాద్ చుట్టూ కట్టిన ఔటర్ రింగ్ రోడ్డు భారం దాదాపు రూ.12 వేల కోట్లు అప్పు ప్రజలందరి మీద ఉంటుంది. కానీ, దానిని కేవలం కార్లు, లారీలకే పరిమితం చేశారు. హైదరాబాద్ మెహదీపట్నం నుంచి అరంఘర్ ఎలివేటెడ్ రోడ్డు కూడా కొన్ని రకాల వాహనాలకే పరిమితం. కొందరికే పరిమితం చేసే రోడ్డు మీద ప్రభుత్వ పెట్టుబడులు పెట్టడం కూడా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. హైదరాబాదులో SRDP పేరు మీద మొదట్లో తలపెట్టిన రోడ్లు కొన్ని ధనికుల ప్రాంతాలకే పరిమితం చేశారు. అక్కడ కూడా రోడ్డు డిజైన్ కొందరు బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుగుణంగా నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, సమస్య ఒకటి అయితే పరిష్కారం వేరేది రుద్దటం మన దేశ ప్రభుత్వాలకు అలవాటు అయిపోయింది. సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నదని ఆందోళనలో ప్రభుత్వం చూపుతున్న పరిష్కారం ఎలివేటెడ్ రోడ్డు. ఎలివేటెడ్ రోడ్డు అంటే కొన్ని కిలోమీటర్ల ఫ్లై ఓవర్. రోడ్డు మీద రోడ్డు కాదు. రోడ్డు మధ్యలో ఫ్లై ఓవర్. దీనివలన స్థానిక ట్రాఫిక్ రద్దీ తగ్గకపోగా ఇంకా జటిలం అవుతున్నది.
రాజకీయ పక్షాలన్నీ ఏకాభిప్రాయం
ఈ మధ్య రింగ్ రోడ్లు గోల మొదలయ్యింది. ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్లు కడతామని, తాము సాధించిన ప్రగతిగా రాజకీయ నాయకులు చెప్పుకోవడానికి ఇప్పుడు ఇది ఒక నూతన అస్త్రం. భూ
వ్యాపారం పెంచడానికే. హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డు చుట్టూ ఇప్పుడు ఇంకొక రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. దీనిని అన్ని రాజకీయ పక్షాలు ఆమోదించాయి. ప్రతి విషయంలో విరుద్ధ ఆలోచనలు ఉండే రాజకీయ పక్షాలు ఈ రోడ్డు విషయంలో ఏకాభిప్రాయం రావడానికి ప్రధాన కారణం దానిలో వాళ్లకు స్వప్రయోజనాలు కనిపించాయి. కాబట్టి, ప్రజల అభిప్రాయం అడగడం మాత్రం చేయలేదు. రీజనల్ రింగ్ రోడ్డు చట్రంలో ఇరుక్కుంటున్న దాదాపు 500 గ్రామాలకు ఇది తలపెట్టలేదు. ఈ రింగ్ రోడ్డు లక్ష్యం రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచడానికే. అప్పులతో కుదేలు అయినా తెలంగాణా ఆర్థిక వనరులకు కావాల్సిన నిధులు భూముల క్రయ విక్రయాల ద్వారా ఆర్జించాలని ప్రభుత్వాధినేతలు ఆలోచించారు. ప్రభుత్వం మారినా ఈ ఆలోచన మారలేదు.
అనుమతులు సరళీకృతం
2017లో మొదలు పెట్టిన భారతమాల పరియోజన పథకం కింద రూ. 5.35 లక్షల కోట్లతో 34,800 కి.మీ హైవేలను అదనంగా నిర్మించనున్నారు. 2022-–23లో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖపై మొత్తం వ్యయం రూ.1,99,108 కోట్లుగా అంచనా వేశారు. ఇది 2021–-22 సవరించిన అంచనాల కంటే 52% ఎక్కువ. 2022-–23లో మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తంలో అత్యధికంగా NHAIకి రూ. 1,34,015 కోట్లు (67%). దీని తర్వాత రోడ్లు, వంతెనలకు రూ. 64,573 కోట్లు (32%) కేటాయించారు. పురోగతిలో ఉన్న మొత్తం రహదారి ప్రాజెక్టులు రూ.11 లక్షల కోట్ల బడ్జెట్ తో, 64,000 కి.మీ. వీటిలో 40,000 కి.మీ పైగా పూర్తయ్యాయి.
నిర్మాణం, నిర్వహణపై ఆడిట్ లేదు!
రోడ్ల మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు కూడా పెరుగుతున్నది. ఒకప్పుడు కిలోమీటర్‌కు రూ.2 కోట్లు అయ్యేది ఇప్పుడు అది పెరిగింది. కొంతమంది భారతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం భారతదేశంలో బిటుమెన్ రహదారిని నిర్మించడానికి పైన పేర్కొన్న అంశాల ఆధారంగా కిలోమీటరుకు సుమారుగా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుంది. యితే, ద్రవ్యోల్బణం, మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఈ ఖర్చులు కాలక్రమేణా మారవచ్చని గమనించడం చాలా అవసరం. రోడ్ల నిర్మాణం మీద, నిర్వహణ మీద పెడుతున్న ఖర్చు మీద ఆడిట్ లేదు. ఇదివరకు నిర్మించిన రహదారుల మీద కాగ్ నివేదికలు ఉంటే పరిశీలించాలి. హైదరాబాదుద్ORR రింగ్ రోడ్డు ఖర్చు మీద ఆడిట్, ఖర్చు గురించి ఎక్కడా చర్చ లేదు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదిస్తున్నారు. ఎక్కడ రోడ్డు వేసినా అది ఏ లక్ష్యంతో వేస్తున్నారు? దాని వలన ప్రయోజనం ఎవరికి, అసలు దాని అవసరం ఉన్నదా? నిర్వహణ ఖర్చుకి నిధులు ఎట్లా వస్తాయి? స్థానిక పర్యావరణం మీద దాని వలన ఉండే ప్రభావం వంటి అంశాలు అన్ని పరిగణనలోకి తీసుకునే వ్యవస్థ రావాలి. మొత్తం మీద దేశంలో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి రోడ్లు అన్నీ దాదాపు టోల్‌గేట్లతో విరాజిల్లుతున్నాయి. అవి సామాన్యుడి ప్రయాణాన్ని వెక్కిరిస్తున్నాయి. ఇవాళ దేశంలో రోడ్డు అంటే వ్యాపార వస్తువుగా మారిపోయింది తప్ప అవి ప్రజా రవాణా రోడ్లు అనే అనుభూతి ఎక్కడా కనిపించదు.
పర్యావరణంపై రోడ్ల ప్రభావం
1994లో బ్రిటన్ దేశంలో రోడ్డు వ్యతిరేక ఉద్యమం మొదలు అయ్యింది. అయితే, రోడ్లు రాజకీయాలకు అతీతం కావు. మన దేశంలో రోడ్లు జాతీయ వివాదాంశంగా మారలేదు. రైలు మార్గాల మీద కొంత వివాదాలు అయినా రోడ్ల మీద కాలేదు ఎందుకనో. సమాజంలో వర్గ సంబంధాల (class relations) సంఘర్షణలో రోడ్లకు కూడా పాత్ర ఉన్నది. ఈ సంబంధాలు ఏ రోడ్డు ఎవరికి ఎక్కడ వేయాలో నిర్ణయిస్తుంది. రోడ్ల వలన నీటి పరీవాహక వ్యవస్థ దెబ్బ తింటున్నది. ఎన్నడు లేని ప్రాంతాలలో వరదలు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో హైవే వెడల్పు, ఎత్తు పెంచిన క్రమంలో దెబ్బతిన్న నీటి పారుదల వల్ల అక్కడ కొన్ని గ్రామాలు వరదలను చూస్తున్నాయి. కొత్త రోడ్డు లేదా ఉన్నదాన్ని వెడల్పు చేస్తే ఆ రోడ్డు నిర్మాణానికి దగ్గరలో ఉన్న మట్టి గుట్టలు, రాళ్ల గుట్టల నుంచి మట్టి, కంకర సేకరిస్తారు. ఆ విధంగా గుట్టలు కరుగుతున్నాయి. రోడ్ల ఎత్తు, వెడల్పు పెరుగుతున్నది.
- డా. దొంతి నర్సింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్