హైదరాబాద్ లో ఎరుపెక్కిన రోడ్డు.. భయం గుప్పిట్లో జనం

హైదరాబాద్ లో ఎరుపెక్కిన రోడ్డు.. భయం గుప్పిట్లో జనం

హైదరాబాద్ లో డ్రైనేజి ఓవర్ ఫ్లో వల్ల రోడ్లు జలమయం అవ్వటం తరచూ చూస్తూనే ఉంటాం.. వర్షాకాలంలో అయితే.. రోడ్లపై నీళ్లు నిలవటం మామూలే. అయితే.. అదే రోడ్లు సాలార్ సినిమాలో ప్రభాస్ డైలాగ్ కాన్సార్ ఎరుపెక్కాల.. అన్నట్లు రక్తపు ఏరును తలపిస్తూ ఎరుపెక్కితే.. ఆ ఊహే భయంకరంగా ఉంది కదా.. ఇక నిజంగా అలా జరిగితే అక్కడి జనాల పరిస్థితి ఏంటో ఊహించుకోండి. హైదరాబాద్ లోని జీడీమెట్లలో ఉన్న సుభాష్ నగర్ లో రోడ్డు ఒక్కసారిగా ఎర్రగా మారటంతో స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు..  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Also Read:-ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన లారీ.. ఐదుగురు అక్కడిక్కడే మృతి

సుభాష్నగర్లోని లాస్టు బసుస్టాప్ రోడ్డులో సోమవారం ( నవంబర్ 25, 2024 ) రాత్రి ఒక్కసారిగా భూగర్భ డ్రైనేజీ నుంచి ఎరుపురంగులో రసాయనాలు ఉబికి పైకి వచ్చాయి.దీంతో కాలనీ వాసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పూర్తిగా రసాయనాలు ఎరుపురం గులో ఉండి విపరీతమైన దుర్వాసన వెలువడిందని కాలనీవాసులు తెలిపారు. స్థానికంగా కొంతమంది రీసైక్లింగ్ పరిశ్రమలను నిర్వహిస్తూ..రసాయనాల డ్రమ్ములను కడిగి నాలాల్లో పారబోయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.


ఈ విషయమై పలుమార్లు పీసీబీ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకుని అనుమతులు లేకుండా కాలనీలో ఇళ్లమధ్యలో నడుస్తున్న పరిశ్రమలను మూసివేయించాలని డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు కాలనీవాసులు.