హైదరాబాద్‎ను ఆగంజేసిన వానలు​.. 264 చెట్లు కూలినయ్.. 412 స్తంభాలు విరిగినయ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాలు మహానగరంలో రోడ్లను దెబ్బతీశాయి. రెండు రోజుల పాటు ఆగకుండా కురిసిన వర్షానికి రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 9013 కిలోమీటర్ల రోడ్లుండగా, 2,846 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్ల ఇంటర్నల్​సీసీ రోడ్లున్నాయి.  వీటిపై సుమారు 10 వేల పాట్ హోల్స్​ఏర్పడినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం మొత్తం తగ్గాక ఈ సంఖ్య డబుల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మెయిన్​రోడ్లతో పాటు ఇంటర్నల్​రోడ్లు  కూడా ప్రయాణించడానికి వీలులేకుండా తయారయ్యాయి. 

నాగోల్ నుంచి బండ్లగూడ వెళ్లే దారిలో, రేతిబౌలి మెయిన్​రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. టోలిచౌకీలో ఇంటర్నల్​రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. షేక్ పేట్ ఫ్లైఓవర్ సమీపంలో పూర్తిగా గుంతలు ఏర్పడ్డాయి. విజయ్ నగర్ కాలనీ, రెడ్ హిల్స్, కూకట్ పల్లి, బాలానగర్, జీడిమెట్ల ఇలా అన్ని ప్రాంతాల్లో పాట్ హోల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా తగ్గాక రిపేర్లు చేస్తామని అధికారులు అంటున్నారు. 

అంతర్గత రోడ్లూ ముఖ్యమే.. 


సిటీలో రోజురోజుకూ ట్రాఫిక్ పెరుగుతుండటంలో చాలామంది ఇంటర్నల్​రోడ్లను ఎంచుకుంటున్నారు. దీంతో అంతర్గత రోడ్లపై చాలా వరకు లోడ్ పెరిగింది. మెయిన్​రోడ్లపై రద్దీ తగ్గించడానికి ట్రాఫిక్​పోలీసులు గతేడాది నుంచి అంతర్గత రోడ్లు వాడాలంటూ సూచిస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గాయి. టోలీచౌకి, ఎల్బీనగర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, దిల్ సుఖ్​నగర్, మెహిదీపట్నం లాంటి రద్దీ ప్రాంతాల్లో ఈ ఇంటర్నల్​రోడ్లు చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. అయితే ఇవి డ్యామేజీ అవుతున్నా రిపేర్లు చేయించకపోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

 వరుసగా కురుస్తున్న వర్షాలతో జీహెచ్ఎంసీ, హైడ్రా ఏర్పాటు చేసిన హెల్ప్​లైన్​నంబర్లకు ఆది, సోమవారాల్లో 397  ఫిర్యాదులు రాగా 370కిపైగా కంప్లయింట్స్‎ను హైడ్రాతో కలిసి పరిష్కరించారు. ఇందులో 264  ఫిర్యాదులు చెట్లు కూలాయని,  412 కరెంట్​స్తంభాలు విరిగిపడ్డాయని, విద్యుత్​స్తంభాలు మీద పడి 10 వాహనాలు ధ్వంసమయ్యాయని, 4 కాంపౌండ్ వాల్స్ కూలాయని వచ్చాయి. ఆదివారం హైడ్రా డీఆర్ఎఫ్ టీమ్స్ కి 139 కంప్లయింట్స్​రాగా 10 మాత్రమే పెండింగ్‎లో ఉన్నాయి. 

సోమవారం మరో 52 ఫిర్యాదులు రాగా ఒకటి పెండింగ్​లో ఉంది. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వరకు 131 ఫిర్యాదులు రాగా 6 పెండింగ్​లో ఉన్నాయి. సోమవారం 75 రాగా 4 పెండింగ్​లో ఉన్నాయి. 15 ప్రాంతాల్లో వైర్లు తెగిపోవడంతో గంటల తరబడి విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సమస్యలకు సంబంధించి విద్యుత్ శాఖ(మెట్రో జోన్‌‌) కు 150 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ టీమ్స్ తో కలిసి విద్యుత్ సిబ్బంది సమస్యలను పరిష్కరించారు. ఇంకొన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. 

అత్యవసరమైతే కాల్​ చేయండి .. 

ఏదైనా అత్యవసరమైతే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్​040–-- 21111111 కు గాని , మై జీహెచ్ఎంసీ యాప్ కు ఆన్ లైన్ ద్వారా గానీ,  డీఅర్ ఎఫ్(హైడ్రా) ఫోన్ నంబర్ 9000113667 లో సంప్రదించవచ్చన్నారు. అలాగే సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోని కంట్రోల్ రూమ్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమ్రపాలి మాట్లాడుతూ..141 లొకేషన్లలో 242 ఎమర్జెన్సీ టీమ్స్,157 మొబైల్ టీమ్స్, 30 డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‎లో ఏడు ఎమర్జెన్సీ టీమ్‎లను, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నాలుగు చొప్పున అదనపు ఎమర్జెన్సీ టీంలను కేటాయించినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో 12 మంది, డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ లో 10 మంది 24 గంటలపాటు  పనిచేస్తున్నారన్నారు.  

 

 నగరంలో మూడోరోజు ముసురు 


నగరంలో మూడోరోజు ముసురు కురిసింది. అయితే గడిచిన రెండు రోజులతో పోలిస్తే సోమవారం కాస్త గ్యాప్ ఇచ్చింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముసురు లేదు. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడా ముసురు పడింది. సోమవారం ఉప్పల్ లో అత్యధికంగా 1.33 సెంటిమీటర్లు కురవగా, కుత్భుల్లాపూర్ లో 8 మిల్లీమీటర్లు  కూకట్ పల్లిలో 5.3 మిల్లీమీటర్లు కురిసింది. నగరానికి సంబంధించి వాతావరణశాఖ పెద్దగా హెచ్చరికలు జారీ చేయనప్పటికీ... మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని తెలిపింది.