సర్వీస్ రోడ్డు లేక వాహనాల రాకపోకలకు ఇబ్బంది
మహబూబ్‌నగర్, వెలుగు: దేవరకద్రలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నెమ్మదిగా సాగుతుండడంతో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. సర్వీస్ రోడ్లు లేకపోవడంతో రైల్వే గేట్పడిన ప్రతిసారి అరగంట నుంచి గంట దాకా ట్రాఫిక్ జామ్అవుతోంది. ప్రయాణికులతో పాటు వెహికల్స్ సౌండ్, దమ్ము లేస్తుండడంతో రోడ్డు పక్కన ఉన్న పండ్లు, ఇతర వ్యాపార దుకాణాలు, హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే పరిధిలోని పనులు పనులు పూర్తయినా.. స్టేట్ గవర్నమెంట్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి ఏడేండ్లైనా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
2015లోనే రైల్వే పరిధి పనులు కంప్లీట్
పాలమూరు జిల్లా దేవరకద్రలో రైల్వే గేట్‌వద్ద ఆర్వోబీ నిర్మాణానికి 2010 ప్రతిపాదనలు సిద్ధం చేయగా 2011లో ప్రిలిమినరీ సర్వే పూర్తి చేశారు. ఫిబ్రవరి 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్వోబీ నిర్మాణానికి అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇచ్చి రూ.24.56 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.17 కోట్లు సర్వీస్ పనులకు, మిగతా రూ.7.56 కోట్లు ల్యాండ్ అక్విజైషన్, ఎలక్ర్టికల్ పోల్షిఫ్టింగ్, వాటర్ పైప్‌లైన్, రోడ్ మార్కింగ్, లైట్లకు ఖర్చు చేయాల్సి ఉంది.
మొదట ఈ పనులు రైల్వే డిపార్ట్మెంట్ ప్రారంభించి వారి పరిధి వరకు 2015లో పనులు పూర్తి చేశారు. మిగతా పనులు స్టేట్ గవర్నమెంట్ చేయాల్సి ఉంది. అప్రోచ్ రోడ్డు కూడా రాష్ర్టానిదే బాధ్యత. ఇందులో భాగంగానే ఓ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి 2015లో అగ్రిమెంట్ చేశారు. ఏడాది దాటినా ఆయన పనులు ప్రారంభించకపోవడంతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. అనంతరం ఎన్‌హెచ్‌ఏఐకి పనుల బాధ్యత అప్పగించారు. వారిని కూడా కాదని చివరకు స్టేట్ ఆర్‌అండ్‌బీకి పనులు బదలాయించారు. వీరు 2018 సెప్టెంబరులో రీ ఎస్టిమేట్చేసి కొత్త టెండర్లు పిలిచారు. అనంతరం జనవరి 2019లో పనులు ప్రారంభించారు.
ఏడాదిలోనే పూర్తి చేయాల్సి ఉన్నా..
2019లో ఆర్‌అండ్‌బీ పనులు స్టార్ట్‌చేసిన తర్వాత 2020 డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ, కొవిడ్ కారణంగా కాంట్రాక్టర్‌కు బిల్లులు చేయకపోవడంతో పనులు జరగలేదు. దీంతో 2022 డిసెంబర్ 31వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలని డేట్ఎక్స్టెండ్ చేశారు. ఈ డెడ్‌లైన్ పూర్తి కావడానికి ఇంకా ఐదు నెలలే ఉన్నా, ఇంత వరకు పనులు స్పీడప్ కావడం లేదు. ఇంకా ఆర్వోబీకి రెండు వైపులా సర్వీస్ రోడ్డును వేయలేదు. బ్రిడ్జి మీద అప్రోచ్ (ఆర్ఈ వాల్స్) పనులు కొన్ని చోట్ల పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, బ్రిడ్జి కోసం 30 స్లాబ్‌లు ఏర్పాటు చేయగా ఒక్కో దానికి రూ.21 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉంది. ఇంకా 9 స్లాబ్లకు సంబంధించి రూ.1.89 కోట్లు, అప్రోచ్‌కు సంబంధించి రూ.కోటి వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది.
గేట్పడితే.. ఆగమాగం..
దేవరదక్ర మీదుగా ప్రతి రోజు ఉదయం సాయంత్రం టైంలో 20 రెగ్యులర్ట్రైన్లు, వీక్లి ట్రైన్లు 17 హైదరాబాద్ నుంచి కర్నూల వైపు, కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. ఇవి కాక గూడ్స్ రైళ్లు రోజులో కనీసం మూడు వెళ్తుంటాయి. ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు పది సార్లు, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు 10 సార్లు గేట్లు పడుతున్నాయి. వీక్లీ ట్రైన్లు వచ్చే టైంలో అదనంగా రెండు సార్లు గేట్లు పడతాయి.
సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ఈటైంలో రెండు వైపులా కిలోమీటరున్నర వరకు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఉదయం కాలేజీలు, ఆఫీసులకు, అత్యవసర పనులకు వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా లేకపోవడంతో బైక్‌లు, కార్లను రోడ్డుకు అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. చాలాచోట్ల గుంతలు పడడంతో అందులో స్కిడ్ అయి పడుతున్నాయి.
పోలీసులను పెడతం
దేవరకద్రలో రైల్వే గేటు ప్రతి రోజు30 నుంచి 40 సార్లు పడుతుంది. గేట్ తీసినపుడు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. వర్షం కురిసినపుడు భారీ వాహనాలు గుంతలో దిగబడుతున్నయి. దీంతో కొంత ఇబ్బంది ఉంది. గేటుకు అటు ఇటు పోలీసులను పెట్టి ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తం. - భగవంత్ రెడ్డి, ఎస్ఐ, దేవరకద్ర
సర్వీస్ రోడ్లు లేక ఇబ్బందులు
ఆర్వోబీ పనులు చేయకముందు సర్వీస్ రోడ్డు వేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ సర్వీస్ రోడ్డు వేయలేదు. పాత రోడ్లు మీదుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నయి. దీంతో ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. వర్షాలు పడితే గోతుల్లోకి నీళ్లు చేరుతున్నయి. ఇందులో ఆటోలు, కార్లు, బైక్‌లను అదుపు తప్పి పడిపోతున్నయి. - గోపాల్, చిన్నరాజమూరు
ఐదు నెలల్లో కంప్లీట్ చేస్తం
సివిల్ పనులు కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో, మిగతా పనులు చేసేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నయి. డెడ్‌లైన్ ప్రకారం ఐదు నెలల్లో పనులు కంప్లీట్ చేస్తం. --- -కౌశిక్, ఆర్‌అండ్‌బీ అసిస్టెంట్ ఈఈ, మహబూబ్‌నగర్