
- రూ.1.7 లక్షల క్యాష్, 26 తులాల గోల్డ్‌తో పరార్
- నిఘా పెట్టి పట్టుకున్న కాచిగూడ పోలీసులు
బషీర్‌బాగ్, వెలుగు: ‘నీ జాతకం బాగోలేదు.. శాంతి పూజ చేయాలి.. అప్పుడే దోషం పోతుంది’ అంటూ సిటీకి చెందిన ఓ మహిళను దొంగ బాబా బురిడీ కొట్టించాడు. రూ.1.7లక్షల క్యాష్, 26 తులాల బంగారం దోచేసి పరారయ్యాడు. కొన్నిరోజులుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని కాచిగూడ పోలీసులు శనివారం పట్టుకున్నారు. అడిషనల్ డీసీపీ నరసయ్యతో కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి నిందితుడి వివరాలు వెల్లడించారు. కాచిగూడ పీఎస్పరిధిలో ఉండే గీత భర్త గతేడాది చనిపోయాడు.
భర్త లెక్చరర్ గా పనిచేసిన దిల్సుఖ్ నగర్ లోని వశిష్ఠ జూనియర్ కాలేజీలోనే గీత రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. భర్త చనిపోవడం, ఎంబీబీఎస్చదివే కూతురు అనారోగ్యానికి గురవడం ఇలా సమస్యలు చుట్టుమట్టడంతో మానసికంగా కుంగిపోయింది. కాలేజీ ప్రిన్సిపాల్ సూచన మేరకు దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండే గుంటూరుకు చెందిన అరిగెల సాంబశివుడు అలియాస్ గురిజీ శివస్వామి అనే బాబాను కలిసింది. ‘నీ కూతురు జాతకం బాగోలేదు.. పెళ్లి అయ్యాక ఆత్మహత్య చేసుకోవడమో.. లేదా హత్యకు గురవ్వడమో జరిగే అవకాశం ఉంది.
శాంతి పూజలు చేస్తే దోషం పోతుంది’ అంటూ బాబా నమ్మబలికాడు. భయపడిపోయిన గీత శాంతి పూజల కోసం ముందుగా రూ.1.70 లక్షలు ఇచ్చింది. తర్వాత మరికొన్ని పూజలు చేయాలని చెప్పడంతో 26 తులాల బంగారం అప్పగించింది. తర్వాత పూజల పేరుతో మహిళను, ఆమె ఇంటి డాక్యుమెంట్లను శ్రీకాళహస్తి తీసుకెళ్లాడు. పూజ పేరుతో గీతతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదంతా ఫ్రాడ్అని తెలుసుకున్న గీత కూతురు హైదరాబాద్ తిరిగి వచ్చాక ఇంటి డాక్యుమెంట్లను వెనక్కి తీసుకుంది. తన తల్లి ఇచ్చిన బంగారాన్ని తిరిగి ఇవ్వాలని బాబాపై ఒత్తిడి చేసింది. దాంతో సాంబ శివుడు పరారయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో కాచిగూడ పోలీసులు కేసు ఫైల్‌చేశారు.
కాచిగూడ ఇన్స్పెక్టర్ ఝాన్సీ, డీఐ సురేశ్, ఎస్సై నరేశ్బురిడీ బాబాపై నిఘా పెట్టారు. ఈ నెల 12న తిరుపతి నుంచి సిటీకి వచ్చిన బాబాను అదుపులోకి తీసుకొన్నారు. గతంలో అతను ప్రైవేట్ల్యాండ్ సర్వేయర్ గా పని చేశాడని, ఆదాయం సరిపోక బాబా అవతారం ఎత్తినట్లు పోలీసులు గుర్తించారు. అతని నుంచి 20.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రెండు తులాల బంగారాన్ని బ్యాంక్ లో తాకట్టు పెట్టగా, మిగిలిన మొత్తాన్ని అమ్మేశాడని పోలీసులు తెలిపారు.