ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో దొంగలు దాడి చేసి బ్యాంక్ మేనేజర్‌ను కొట్టి.. సుమారు రూ. 8.5 కోట్ల విలువైన నగదు, బంగారంతో ఉడాయించారు. సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన జగత్‌పూర్ బ్రాంచ్‌లో ఉదయం 9.30 గంటలకు ఈ సంఘటన జరిగిందని రాయ్‌ఘర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సదానంద్ కుమార్ తెలిపారు. సుమారుగా ఆరు నుండి ఏడుగురు దొంగలు బ్యాంకులోకి ప్రవేశించి బ్యాంకు ఉద్యోగులను ఒక గదిలో బందీలుగా ఉంచారని తెలిపాడు.
లాకర్ గది తాళాలు తీయాలని బ్యాంకు మేనేజర్‌పై కాలిపై పదునైన ఆయుధంతో దాడి చేశారని, నగదు, బంగారు ఆభరణాలు, కడ్డీలు దోచుకెళ్లి దుండగులు పారిపోయారని పోలీసులు వెల్లడించారు. బ్యాంక్ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు దోచుకెళ్లిన నగదు విలువ రూ.7 కోట్లు కాగా, బంగారు కడ్డీలు, ఆభరణాల విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బ్యాంక్ మేనేజర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.