
హైదరాబాద్: కాచిగూడ వ్యాపారి ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దొంగతనం జరిగిన గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్నారు. కేజీ బంగారం, 50 లక్షల రూపాయల డబ్బుతో కారులో పరారీ అయినా నిందితులను సంతోష్ నగర్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం మూడు బృందాలుగా పోలీసులు గాలించారు. నేపాల్కు చెందిన వారిగా గుర్తించారు.
సంవత్సరం క్రితం నేపాల్కు చెందిన ఓ మహిళను హేమరాజ్ దంపతులు పనిలో చేర్చుకున్నారు. అప్పటికే పని చేస్తున్న మహిళ సహాయంతో మరి కొంతమందిని హేమ రాజ్ దంపతులు పనిలో చేర్చుకున్నారు. హేమరాజ్తో పాటు అదే ఇంట్లో అతని కొడుకు కూడా నివసిస్తున్నాడు. ఇటీవల హేమరాజ్ కొడుకు కోడలు బ్యాంకాక్ వెళ్లారు.
ఎవరూ లేని సమయంలో ప్లాన్ ప్రకారం.. హేమరాజ్, అతని భార్య తినే భోజనంలో మత్తు మందును కలిపారు. అది తిన్న తర్వాత హేమరాజ్, అతని భార్య మత్తులోకి జారుకున్నారు. బంగారం, నగదుతో ఇంటి పని మనుషులు ఉడాయించారు. ప్రస్తుతం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ ప్రైవేట్ హాస్పిటల్లో హేమరాజ్ దంపతులు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హేమ రాజ్ ఉదయం వాకింగ్కి వెళ్లకపోవడంతో స్నేహితుడు ఇంటికి వెళ్లాడు. భార్యాభర్తలిద్దరూ స్పృహ తప్పిపోయి కనిపించారు. అప్పుడు ఈ దొంగతనం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.