
- మలక్పేట పరిధిలో ఘటన
మలక్ పేట, వెలుగు: రోడ్డుపై నిల్చున్న ఓ వ్యక్తిని మామా అంటూ పిలిచి, తన బర్త్ డే పార్టీ అని వైన్స్ షాప్ కు తీసుకువెళ్లి మద్యం తాగించి నిలువుదోపిడీ చేసిన ఆటో డ్రైవర్ ను సైదాబాద్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 5 గ్రాముల రింగ్, ఫోన్, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్ పీఎస్ లో ఏసీపీ వెంకన్న నాయక్ వివరాలు వెల్లడించారు. సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీలో ఉండే గోవర్ధనాచారి(49) పైవేటు ఉద్యోగి.
ఆదివారం సాయంత్రం బైక్ రిపేర్ కోసం చంపాపేట భారత్ గార్డెన్స్ ముందు ఉన్న మెకానిక్ షాపుకు వచ్చాడు. మెకానిక్ బిజీగా ఉండడంతో వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మామా అని మాటలు కలిపాడు. ఈ రోజు తన బర్త్ డే అని.. పార్టీ ఇస్తానని చంపాపేట లోని వైన్స్ కు తీసుకెళ్లాడు.
అక్కడ మందు తాగించి..‘మామా నాకు బర్త్డే గిఫ్ట్ ఏమిస్తున్నావ్’ అని అడిగాడు. బెదిరించి గోవర్ధన చారి ఫోన్, అరతులం ఉంగరం గుంజుకుని పరారయ్యాడు. అప్పటికే మద్యం మత్తులోకి ఉన్న గోవర్ధనాచారి అక్కడే పడుకున్నాడు. ఉదయం సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు గాయాలతో ఉన్న గోవర్ధనాచారిని దవాఖానకు తరలించారు. బాధితుడు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా స్కూటీ నెంబర్ గుర్తించి దాడికి పాల్పడింది మల్లాపూర్ కు చెందిన పాత నేరస్థుడు మాల తిరుపాల్(42)గా గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.