తరుగు పేరుతో  దోపిడీ రూ.73 కోట్లు!

  • రైతుల కష్టమంతా మిల్లర్ల పాలు
  • రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తరుగు విధానం..
  • కలెక్టర్​ హెచ్చరించినా  మారని నిర్వాహకులు
  • ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించాలని రైతుల  డిమాండ్​ 

నిజామాబాద్, వెలుగు: వ్యాపారులు, దళారుల మోసాల నుంచి రైతులకు విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే .. అక్కడా సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు కలిసి  రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నారు. తరుగు పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు.  కలెక్టర్, ఉన్నతాధికారులు హెచ్చరించినా మారడం లేదు. ఇలా జిల్లాలో తరుగు పేరుతో రైతులకు జరుగుతున్న నష్టం విలువ సుమారు రూ.73 కోట్లు గా తెలుస్తోంది. ఈ పైసలను సింగిల్​విండోలతో పాటు మిల్లర్లు  సైలెంట్​గా జేబుల్లో  వేసుకుంటున్నారు.


దిగుబడిలో టాప్​ప్లేస్ 


వడ్ల దిగుబడిలో రాష్ట్రంలోనే  నిజామాబాద్​ జిల్లా  టాప్​ప్లేస్​లో ఉంది.  2022–-23  వర్షాకాలం సీజన్​లో  5.85 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు (రూ.1,204 కోట్ల విలువ)  స్టేట్​ రికార్డు  పొందింది. యాసంగిలో అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు అయినందున 9 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు  కొనాలని  ఆఫీసర్లు టార్గెట్​ పెట్టుకొని 467 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.  20 రోజుల నుంచి కాంటాలు మొదలు పెట్టారు. దొడ్డు రకం వడ్లను ‘ఏ’ గ్రేడ్​గా పరిగణించి క్వింటాల్​కు రూ.2,060 రేటును ప్రభుత్వం ప్రకటించింది. ‘బీ’ గ్రేడ్​ రకం సన్నాలకు రూ.2,040 గా నిర్ణయించింది.  


అన్ని కొనుగోలు కేంద్రాల్లో..


జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో  ప్రతి 40 కిలోల బస్తాకు కిలోన్నర తరుగు తీసుకుంటున్నారు. దీంతో  క్వింటాల్​వడ్లు అమ్మిన రైతుకు 4 కిలోలు తరుగు రూపంలో కట్​చేస్తున్నారు.  9 లక్షల మెట్రిక్​ టన్నుల కొనుగోలు లక్ష్యం 90 లక్షల క్వింటాళ్ల వడ్లకు సమానం.  ఆ లెక్కన ప్రతి క్వింటాల్​ వడ్లకు4 కిలోల తరుగు గుణిస్తే 3,600 టన్నులు అవుతోంది. దాని విలువ ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం రూ.73 కోట్లు అవుతుంది. అంటే 467 కొనుగోలు కేంద్రాలకు యావరేజ్​గా  రూ.15 లక్షలు వెళ్తాయి.  


ఎక్కడాలేని  విధంగా..


వడ్ల కొనుగోలులో ఎక్కడా లేని విధంగా..  నిజామాబాద్​జిల్లాలోనే తరుగు విధానం కొనసాగుతోంది. గతంలో  పనిచేసిన కలెక్టర్​ నారాయణరెడ్డి అనేక సందర్భాల్లో తరుగు విధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  కొత్తగా వచ్చిన కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతు కూడా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు గురించి మరిచిపోవాలని ఇటీవల జరిగిన జడ్పీ మీటింగ్​లో  హెచ్చరించారు. ఆ మీటింగ్​లో డీసీవో సింహాచలం అక్రమాలు జరుగకుండా నిఘా కోసం సూపర్​వైజింగ్​ఆఫీసర్లను నియమించామని వెల్లడించారు. కానీ ప్రస్తుతం ఇవేవీ క్షేత్రస్థాయిలో లేవు.  రైతులపై తరుగు దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది.  


తరుగు వడ్లకు మరో ఖాతా..


కొనుగోలు కేంద్రాలను సింగిల్​ విండోలు ఎక్కువ నిర్వహిస్తున్నాయి.  వాటి పాలకులు తరుగుగా సేకరించిన వడ్లను తమకు  అనుకూలంగా ఉండే రైతుల పేర్లపై రాసి క్యాష్​చేసుకుంటున్నారు. బియ్యం మిల్లర్లూ  తరుగు కోతలు పెడుతున్న ఉదాహరణలు ఉన్నాయి.   ఇలా యథేచ్ఛగా రైతుల కష్టాన్ని దోచుకుంటున్న అక్రమార్కులను ఎవరూ ఏమీ చేయడంలేదు.  భరించడమే అలవాటు చేసుకున్న రైతులు కొన్ని చోట్ల ఎదురుతిరుతున్నా న్యాయం జరగడం లేదు.  


మంత్రి నియోజకవర్గంలో రైతుల ఆందోళన


రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మోర్తాడ్​లో తరుగు మోసంపై రైతులు గళమెత్తి  పది రోజుల  కింద సింగిల్​ విండో  ప్రెసిడెంట్​అశోక్​రెడ్డి,  సెక్రటరీ కాశీరామ్​ను  వారి ఆఫీస్​లో  నిర్భదించారు.   దీనిపై ఉన్నతాధికారుల  ఎంక్వైరీ పేరిట చేసిన హడావిడి కొండను పట్టి ఎలుకను పట్టిన సామెత గుర్తు చేసింది.  మంత్రి స్థాయిలో గట్టిగా స్పందిస్తే కొంత వరకైనా  రైతులకు మేలు కలిగేది.  అది లేనందున రూ.కోట్ల కడ్తా ప్లాన్​కు  రెడ్​ కార్పెట్​ వేసినట్టయింది.