- పేషెంట్లకు ఇష్టారాజ్యంగా బిల్లులు
- చేయని ట్రీట్మెంట్ కు చార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు
- గట్టిగా అడిగితే పోలీస్ కేసులు పెడ్తామని బెదిరింపులు
- బిల్లుపై డీఎంహెచ్‌వో కు ఫిర్యాదు చేశాక సగం మాఫీ..
- చర్చనీయాంశంగా మారిన కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్ ఘటన
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో బిల్లుల బాదుడుకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. హాస్పిటల్స్ మేనేజ్ మెంట్స్ చేయని ట్రీట్ మెంట్ కు చార్జీ చేయడం, ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లుల బాగోతం అర్థమై ప్రశ్నించినోళ్లకు డిస్కౌంట్ ఇవ్వడం, అడగలేనోళ్లను నిలువు దోపిడీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కరీంనగర్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
జిల్లాలో దాదాపు 400 రిజిష్టర్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్, మరో 79 రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్లు పెట్టుకున్న హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ లో చార్జీల వసూళ్లపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల కంట్రోల్ లేకపోవడంతోనే మేనేజ్మెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, ప్రశ్నించిన పేషెంట్ల బంధువులపై ప్రైవేట్ బౌన్సర్లతో దౌర్జన్యానికి దిగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇష్టారాజ్యంగా చార్జీల బాదుడు..
ప్రైవేట్ హాస్పిటల్స్ లో సాధారణంగా డాక్టర్ చార్జీలు, నర్సింగ్, హౌస్ కీపింగ్, డీఎంవో, మెడికల్ రికార్డు, ఆపరేషన్ థియేటర్, డ్రెస్సింగ్, ఎంసీయూ, రూమ్ చార్జీలు, ఓ2 చార్జీలు, మానిటర్ చార్జీలు, కన్సల్టేషన్, ఐసీయూ ఇలా రకరకాల చార్జీలను బిల్లులో కలిపి వసూలు చేస్తున్నారు. అయితే ఇందులో ఇవ్వని సర్వీసులకు కూడా చార్జీలు వేయడం, రెండు సార్లు ఇచ్చిన సర్వీసుకు నాలుగైదు సార్లు సర్వీస్ చేసినట్లు అదనపు చార్జీలు వసూలు చేయడం విమర్శలకు తావిస్తోంది.
సదరు హాస్పిటల్ ఘటనలోనూ ఆపరేషన్ థియేటర్ కు రెండు సార్లే తీసుకెళ్లారని, కానీ బిల్లులో 5 సార్లు తీసుకెళ్లినట్లు ఓటీ చార్జీలు వేశారని, మూడు సార్లు డ్రెస్సింగ్ చేసి ఐదు సార్లు చేసినట్లు చార్జీ చేశారని, ఐసీయూ ఒక్క రోజు మాత్రమే ఉంచి.. మూడు రోజులు ఉన్నట్లు చార్జీ చేశారని పేషెంట్ కూతురు అశ్విని ఆరోపించారు. ఈ బిల్లుల లోగుట్టు అర్థమైనవాళ్లు ఇదేంటని ప్రశ్నిస్తే కొన్నిసార్లు పొరపాటున పడిందని బిల్లులు సరిచేస్తున్నారని, కట్టకుంటే వెళ్లనిచ్చేది లేదని బెదిరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అడ్వాన్స్ బిల్లు రూ.50 వేల పైనే..
ఎవరైనా పేషెంట్ ను ఇన్ పేషెంట్ గా అడ్మిట్ చేస్తే కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అడ్వాన్స్ వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ట్రీట్ మెంట్ అవుతున్నా కొద్దీ డబ్బులు తెమ్మని జలగల్లా పీలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేషెంట్ల కుటుంబ సభ్యుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నేరుగా ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
కరీంనగర్ కు చెందిన మధు స్వామికి ఛాతీలో నొప్పిగా అనిపించడంతో రెండు నెలల కింద గవర్నమెంట్ హాస్పిటల్ వెనక ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. కేవలం ఈసీజీ తీసి, బ్లడ్ టెస్టులు చేసి ఓ గ్లూకోజ్ బాటిల్ ఎక్కించారు. అక్కడ సరైన వైద్యం అందడం లేదని, వేరే హాస్పిటల్ కు వెళ్తాననడంతో డిశ్చార్జి చేశారు. ఈ ఒక్క రోజు ట్రీట్ మెంట్ కు రూ.14 వేలు బిల్లు వేయడంతో మధుస్వామి కంగుతిన్నాడు.
ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం..
ప్రైవేట్ హాస్పిటల్స్ బిల్లుల విషయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. సదరు హాస్పిటల్ విషయంలో ఫిర్యాదు అందగానే ఇద్దరు హెల్త్ సూపర్ వైజర్లను పంపాను. ఐఎంఏ వాళ్లను కూడా ఇన్వాల్వ్ చేశాం. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాను. చివరికి హాస్పిటల్ మేనేజ్ మెంట్ బిల్లు తగ్గించారు.
- డాక్టర్ లలితా దేవి, డీఎంహెచ్‌వో, కరీంనగర్
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన చంద్రుపట్ల రఘోత్తం రెడ్డికి ఇటీవల బైక్ సైలెన్సర్ కాలికి తగిలి గాయమైంది. దీంతో ఆయనను కరీంనగర్ లోని ఓ ప్రైవేట్హాస్పిటల్ లో ఆయన కూతురు అశ్విని రూ.70 వేలు అడ్వాన్స్ చెల్లించి ఈ నెల 11న జాయిన్ చేశారు. ఆ గాయానికి 14 రోజుల ట్రీట్ మెంట్ అనంతరం రూ.2,90,200 బిల్లు వేశారు. దీంతో కాలిన గాయానికి ఇంత బిల్లు ఏమిటని, తన తండ్రికి చేయని టెస్టులు, ట్రీట్ మెంట్ కు కూడా బిల్లు వేశారని హాస్పిటల్ సిబ్బందిని ఆమె అడిగారు. బిల్లు మొత్తం కట్టాల్సిందేనని మేనేజ్ మెంట్ చెప్పడంతో ఆమె డీఎంహెచ్‌వోకు శుక్రవారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి తమ సిబ్బందిపై అశ్విని దాడి చేస్తోందని మేనేజ్మెంట్ 100కు ఫోన్ చేసి కంప్లైంట్ చేసింది.
దీంతో ఓ కానిస్టేబుల్ వచ్చి ఆమెను న్యూసెన్స్ చేస్తే స్టేషన్ కు తీసుకెళ్తానని బెదిరించాడు. నిజంగా తాను ఎవరినైనా ఏమైనా అంటే తనను తీసుకెళ్లండని అనడంతో చుట్టుపక్కల వారిని విచారించి వెళ్లిపోయారు. శనివారం ఉదయం హాస్పిటల్ మేనేజ్ మెంట్ దిగొచ్చి రూ.2.90 లక్షల బిల్లులో కనీసం రూ.70 వేలైనా కట్టండని బేరసారాలకు దిగారు. దీంతో వారు ఆ డబ్బులు చెల్లించి డిశ్చార్జి అయ్యారు. బిల్లులో లోపాలను గుర్తించి ఫైట్ చేస్తే బిల్లు సగానికి తగ్గించారని, తెలియనివాళ్ల సంగతేమిటని పేషెంట్ కూతురు అశ్విని ఆవేదన వ్యక్తం చేశారు.