నర్సాపూర్ ఎక్స్​ప్రెస్​లో దోపిడీ

నర్సాపూర్ ఎక్స్​ప్రెస్​లో దోపిడీ
  • జనగామ జిల్లా పెండియాల్​ రైల్వేస్టేషన్​ సమీపంలో ఘటన
  • పనులు జరుగుతుండడంతో మెల్లిగా వెళ్లిన ట్రైన్​ 
  • కిటికీల దగ్గర పడుకున్న మహిళల మెడల్లోంచి ఆభరణాల అపహరణ

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని నష్కల్– పెండియాల్​ రైల్వేస్టేషన్ల మధ్య నర్సాపూర్ ​సూపర్ ఫాస్ట్​ఎక్స్​ప్రెస్​ రైలులో బుధవారం అర్ధరాత్రి దోపిడీ జరిగింది. కాజీపేట రైల్వే జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం..నాగర్​సోల్​ నుంచి నర్సాపూర్ వెళ్లే సూపర్​ ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్ ​రైలు జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్,పెండియాల్ ​రైల్వేస్టేషన్ల మధ్యకు రాగానే స్లో అయ్యింది. ఇక్కడ కొద్ది రోజులుగా రైల్వే లైన్ ​నిర్మాణం, రిపేర్​ పనులు జరుగుతుండడంతో గంటకు 15-–20 కిలోమీటర్ల  వేగంతో వెళ్తోంది.

ఇదే అదునుగా మాటువేసిన దొంగలు రిజర్వేషన్​ బోగీల్లోని కిటికీల వద్ద ఆదమరిచి నిద్రిస్తున్న మహిళల మెడల్లోని పుస్తెలతాళ్లు, చైన్లు తెంపడం మొదలుపెట్టారు. పదుల సంఖ్యలో మహిళలకు చెందిన బంగారు ఆభరణాలను అపహరించారు. మహిళలు మేల్కొని గట్టిగా అరిచినా అప్పటికే దొంగలు పారిపోయారు. బాధితులు రైల్వే కంట్రోల్​ రూమ్​ టోల్​ఫ్రీ నెంబర్139కి ఫోన్​చేయడంతో స్టేషన్​ఘన్​పూర్​ఏసీపీ భీమ్​శర్మ, కాజీపేట జీఆర్​పీ రైల్వే పోలీసులు అక్కడికి వచ్చి విచారణ జరిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట జీఆర్​పీ రైల్వేపోలీసులు తెలిపారు. సుమారు 10 మంది మహిళల నుంచి ఆభరణాలు దోచుకోగా ఒక్కరే కంప్లయింట్ ఇచ్చినట్టు తెలిసింది.