Silver Rates: ఈ ఏడాదిలోనే కేజీ వెండి రేటు రూ.2 లక్షలకు చేరుతుందా..? సీక్రెట్ రివీల్డ్..

Silver Rates: ఈ ఏడాదిలోనే  కేజీ వెండి రేటు రూ.2 లక్షలకు చేరుతుందా..? సీక్రెట్ రివీల్డ్..

Silver Prices: ప్రస్తుతం గడచిన ఏడాది కాలం నుంచి బంగారం కంటే వెండి ధరలు వేగంగా పెరగటం మనం చూస్తూనే ఉన్నాం. గత ఏడాది వెండి కేజీ ధర రిటైల్ మార్కెట్లలో దాదాపు రూ.లక్షకు పైకి చేరుకుని కొనసాగుతోంది. చాలా కాలంగా బంగారం వైపు మెుగ్గు చూపిన ప్రజలు ప్రస్తుతం వెండి వెనుక పడటంతో చాపకింద నీరులా దాని రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధరల గురించి ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. 

కియోసాకి ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందిని తన పుస్తకం ద్వారా ఆర్థికపరమైన అంశాలు, పెట్టుబడుల గురించి ఎడ్యుకేట్ చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు వివిధ పెట్టుబడి ఎంపికల్లో ఎలా తమ డబ్బును పొదుపు చేసుకోవచ్చనే అంశాలపై కియోసాకీ పుస్తకం ప్రజలకు అవగాహన కల్పించింది. ఎల్లప్పుడూ కియోసాకి వెండి బంగారంలను నిజమైన ఆస్తులుగా పేర్కొంటుంటారు. పైగా వీటిని భౌతిక రూపంలో కలిగి ఉండటం ఉత్తమమని ఆయన చెబుతుంటారు. ఈ క్రమంలోనే 2025లో వెండి రేటు కేజీకి రూ.2 లక్షలకు చేరుకోవచ్చని తన తాజా అంచనాలను పంచుకున్నారు.

కియోసాకీ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఔన్సు వెండి ధర ప్రస్తుతం 34 డాలర్ల వద్ద ఉంది. అయితే దీని రేటు ఈ ఏడాది చివరి నాటికి 70 డాలర్లకు చేరుకోవచ్చని ఆయన చెబుతున్నారు. అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం కేజీ రేటు ప్రస్తుతం 34 డాలర్ల ఔన్సు లెక్కల ప్రకారం రూ.90 వేల నుంచి పెరిగి ఔన్సుకు 70 డాలర్లకు చేరితే రూ.2 లక్షల మార్కును క్రాస్ చేస్తుందని ఆయన వెల్లడించారు. చారిత్రాత్మకంగా ప్రభుత్వాలు వెండి ధరలను తారుమారు చేస్తూ వచ్చాయని, పరిశ్రమలకు దానిని అందుబాటు ధరలో ఉంచేందుకు రేట్లు పెరగకుండా తొక్కిపెట్టి ఉంచినట్లు కియోసాకి అభిప్రాయపడ్డారు.

 

అందుకే తాను మరింత వెండిని కొనుగోలు చేస్తున్నానని కియోసాకి పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వెండిని కొనటానికి ధనవంతులే కావాల్సిన అవసరం లేదని, తక్కువ డబ్బు ఉన్న వ్యక్తులు కూడా ఔన్సు వెండిని సులువుగా కొనుగోలు చేయగలరని ఆయన అన్నారు. వాస్తవానికి బంగారం, వెండి, బిట్ కాయిన్ రేట్లు పెరగటం లేదని అమెరికా డాలర్ విలువను కోల్పోతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. అందుకే ప్రజలు విలువలేని పేపర్ కరెన్సీని దాచుకోవటానికి బదులుగా వెండిని కొనుగోలు చేయాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థల అస్థిరతల నుంచి ప్రజలు తమ సంపదను కాపాడుకోవటానికి బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి వాటిలో ఆలస్యం కాకమునుపే పెట్టుబడులు పెట్టాలని సూచించారు. 

వెండి బంగారం కంటే ఎందుకు ఎక్కువ విలువైనది..?
వాస్తవానికి చాలా మంది బంగారం వెండి కంటే ప్రియమైనదిగా పేర్కొంటుంటారు. కానీ కియోసాకీ మాత్రం వెండిపై ఎక్కువ మక్కువ చూపటానికి గల కారణాలను పంచుకున్నారు. ముఖ్యంగా వెండిని.. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ వాహనాలు, కంప్యూటర్లతో పాటు అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో వినియోగించటం దాని డిమాండ్ రోజురోజుకూ పెంచుతోందని ఆయన అన్నారు. అలాగే ఆయుధాలు, ఆధునిక మెడికల్ అప్లయెన్సెస్, వాటర్ ఫ్యూరిఫికేషన్ టెక్నాలజీల్లో దీని వినియోగం పెరిగిందని వెల్లడించారు. ఇలా వెండికి పెరుగుతున్న పారిశ్రామిక వినియోగ డిమాండ్ ధరలను పెంచగలదని కియోసాకీ అభిప్రాయం వ్యక్తం చేశారు.