
న్యూఢిల్లీ: బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని బిజినెస్‌మెన్, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తున్నదని ఆయన ఆరోపించారు. హర్యానాలో భూఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వాద్రాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మంగళవారం విచారణకు హాజరయ్యేందుకు ఆయన సెంట్రల్ ఢిల్లీలోని తన ఇంటి నుంచి ఈడీ ఆఫీసుకు 2 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు.
ఈ సందర్భంగా వాద్రా మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఏమీ లేదని అన్నారు. ‘‘పార్లమెంట్‌లో మాట్లాడకుండా రాహుల్‌గాంధీని అడ్డుకున్నారు. నేను ప్రజల పక్షాన గొంతు విప్పిన ప్రతిసారి నన్ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నేను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ల కోరిక మేరకు నేను పాలిటిక్స్‌లోకి రావాలని అనుకున్న ప్రతిసారి.. నన్ను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది.
ఇందులో భాగంగానే పాత కేసులను తెరపైకి తెస్తున్నది. అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నది. అసలు ఈ కేసులో ఏమీ లేదు. ఇప్పటికే వివిధ కేసుల్లో 15 సార్లు నాకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరైన ప్రతిసారి 10 గంటలకు పైగా ప్రశ్నించారు” అని పేర్కొన్నారు.
6 గంటల పాటు వాద్రా విచారణ..
మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది. సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయనను విచారించింది. మళ్లీ బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఈ నెల 8న ఈడీ మొదట నోటీసులు ఇవ్వగా, వాద్రా ఆరోజు విచారణకు హాజరుకాలేదు. మళ్లీ నోటీసులు జారీ చేయగా.. మంగళవారం రాబర్ట్ వాద్రా విచారణకు హాజరయ్యారు.