గాంధీ ఫ్యామిలీలో సభ్యుడిననే టార్గెట్ చేస్తున్నరు: రాబర్ట్ వాద్రా ఆరోపణ

గాంధీ ఫ్యామిలీలో సభ్యుడిననే టార్గెట్ చేస్తున్నరు: రాబర్ట్ వాద్రా ఆరోపణ

న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంతో సంబంధం కలిగి ఉన్నందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలు తనను టార్గెట్ చేస్తున్నాయని లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బావ, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఆరోపించారు. త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. 2008 నాటి హర్యానా ల్యాండ్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాద్రాను బుధవారం రెండో రోజు కూడా విచారించింది. ఉదయం 11 గంటలకు వాయనాడ్ ఎంపీ, తన భార్య అయిన ప్రియాంకా గాంధీతో  కలిసి వాద్రా ఈడీ ఆఫీసుకు చేరుకుని విచారణను ఎదుర్కొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.."ఈ కేసులో హర్యానా ప్రభుత్వం తనకు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ అదే ప్రశ్నలను ఈడీ అధికారులు మళ్లీ అడుగుతున్నారు. నేను ప్రజల కోసం పోరాడే గాంధీ కుటుంబంలోని సభ్యుడిని. అందుకే బీజేపీ గాంధీ కుటుంబంతోపాటు నన్నూ లక్ష్యంగా చేసుకుంటున్నది.  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నన్నూ ఎంత ఇబ్బంది పెట్టినా భయపడం.మేం బలంగా తిరిగి వస్తాం" అని వాద్రా పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలను  కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు.