దేశంలో మహిళలకు భద్రత లేదు : రాబర్ట్ వాద్రా

దేశంలో మహిళలకు భద్రత లేదు : రాబర్ట్ వాద్రా
  • నా భార్య, కూతురు విషయంలోనూ భయపడ్తుంట

హైదరాబాద్, వెలుగు: దేశంలో మహిళలు, చిన్నారులకు భద్రత లేకుండా పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. తన భార్య, కూతురు విషయంలోనూ అప్పుడప్పుడు ఆందోళన చెందుతానని తెలిపారు. ఎప్పుడైతే మహిళలు స్వేచ్ఛగా రోడ్లపై నడుస్తారో.. అప్పుడే తాము సేఫ్​గా ఉన్నామనే భావన వారిలో వస్తుందన్నారు. పలు పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ ప్లేస్​లు సందర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్న రాబర్ట్​వాద్రాకు రంగారెడ్డి జిల్లా సెక్రటరీ ప్రవీణ్ కుమార్, నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత జూబ్లీహిల్స్​లోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని రాబర్ట్ వాద్రా సందర్శించారు.

 అనంతరం మాదాపూర్​లోని ఓ హోటల్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్​లో నేను పవర్ సెంటర్ కావడమనేదిదానిపై ఇప్పుడేం కామెంట్లు చేయలేను. దాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తది. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు. మరో ఐదేండ్లలో ఆ మార్పును ప్రజలే చూస్తరు. కేరళలోని వయనాడ్ నుంచి నా భార్య ప్రియాంక పోటీ చేయబోతున్నది. దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్యగా మారింది. మహిళలు సేఫ్​గా ఉండాలంటే వారితో ఎలా ప్రవర్తించాలో ప్రతి ఇంట్లో మగవారికి మనం నేర్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో నేను, రాహుల్ గాంధీ ఒకే అభిప్రాయంతో ఉన్నం’’అని రాబర్ట్ వాద్రా అన్నారు.