Robin Uthappa: వరల్డ్ కప్‌కు రాయుడు సెలక్ట్ అవ్వడం కోహ్లీకి ఇష్టం లేదు: ఉతప్ప సంచలన ఆరోపణలు

టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప సంచలన ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ముఖ్యంగా కోహ్లీని టార్గెట్ చేస్తూ అతను చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపుతున్నాయి. ఇటీవలే యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడానికి కోహ్లీనే కారణమని చెప్పిన ఉతప్ప.. తాజాగా భారత మాజీ బ్యాటర్ అంబటి రాయడు 2019 వన్డే వరల్డ్ కప్ కు ఎంపిక కాకపోవడానికి కోహ్లీనే నిందించాడు. 

లల్లన్‌టాప్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోఉతప్ప మాట్లాడుతూ..‘‘ఆటగాళ్లను ఎంపిక చేయడానికి కెప్టెన్ పాత్ర ఉంటుంది. ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. అయితే కోహ్లీ తన వ్యక్తిగతంగా రాయుడిని టార్గెట్ చేశాడు. 2019 వన్డే వరల్డ్ కప్ భారత జట్టుకు కోహ్లీ కెప్టెన్సీ చేస్తున్నాడు. కోహ్లీకి ఇష్టం లేకపోతే ఎవరూ జట్టులోకి రావడానికి వీలు లేదు. అంబటి రాయుడు విషయంలోనూ దే జరిగింది. అంబటి రాయుడు అంటే కోహ్లీకి నచ్చేది కాదు. ఈ కారణంగానే 2019 వన్డే ప్రపంచ కప్ భారత జట్టు నుంచి రాయుడిని ఎంపిక చేయలేదు". అని ఈ మాజీ క్రికెటర్ అన్నాడు. 

2019 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో శిఖర్ ధావన్ గాయపడినప్పుడు అతని స్థానంలో అంబటి రాయుడిని జట్టులోకి తీసుకుంటారని భావించినా అది జరగలేదు. ధావన్ స్థానంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. విజయ్ శంకర్ ఎంపిక అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. భారత క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు దిగ్గజ క్రికెటర్లు సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్‌కే ప్రసాద్‌ పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కానీ ఇప్పుడు రాయుడును తప్పించడంలో కోహ్లీ పాత్ర ఉందని ఉతప్ప చెప్పడంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది.