
- కంట్రోల్ రూం, మాస్టర్ రోబో రెడీ
- బుధవారం నుంచి రంగంలోకి..టన్నెల్లో క్లిష్టంగా మారుతున్న పరిస్థితులు
ఎస్ఎల్బీసీ నుంచి వెలుగు టీం: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 18 రోజులు కావస్తుండగా, మంగళవారం అన్వి రోబోటిక్ సంస్థ మాస్టర్ రోబోతో రంగంలోకి దిగింది. సంస్థకు చెందిన నిపుణులు టన్నెల్ ముందు కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనే మూడు రోబోలను టన్నెల్‌లోని 13.600 కిలోమీటర్ల దగ్గర దింపుతారు. రోబోలను మట్టి, రాళ్లు, బురద తీసే పనులకు వినియోగిస్తారు.
టన్నెల్ బయట కంట్రోల్ రూమ్‌లో ఉండే మాస్టర్ రోబో కమాండ్స్‌తో మూడు రోబోలు అప్పగించిన పని చేస్తాయని సమాచారం. అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన విజయ్ జగడం, అక్షయ్ టన్నెల్ లోపల రోబోల పనితీరును స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్‌కు వివరించారు.
కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్, సింగరేణి జీఎం బైద్య, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్‌హోల్ మైనర్స్, ర్వైల్వే ఇంజనీర్లతో ఉదయం రెస్క్యూ ఆపరేషన్‌లో మ్యాన్ పవర్, మెషీన్లు, రోబోలతో ఏ విధంగా పనిచేయించాలనే దానిపై చర్చించారు. టన్నెల్ లోపల పని చేసే రోబోలకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పని చేసే కెమెరాలను అమర్చుతారు. వీటి ద్వారా రోబోల పనితీరును గమనిస్తూ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు కమాండ్స్ ఇవ్వనున్నారు..
క్లిష్టంగా పరిస్థితులు..
టన్నెల్ లోపల 13.800 కిమీ దగ్గర స్లైడింగ్ ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 12 ఏజెన్సీలకు చెందిన వందలాది మంది నిపుణులు మూడు షిప్టుల్లో రెస్క్యూలో పాల్గొంటున్నప్పటికీ.. అనుకున్న స్థాయిలో రిజల్ట్ రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన డాక్టర్లు టన్నెల్లో అందుబాటులో ఉంటున్నారు. సింగరేణి రెస్క్యూ టీమ్ జీఎం బైద్య 19 గంటలు టన్నెల్ లోపలే ఉండి మట్టి, రాళ్ల తరలింపుతో పాటు టీబీఎం కటింగ్, బురదలో కొట్టుకువచ్చిన మిషనరీ భాగాలను లోకో ట్రాక్ ద్వారా బయటికి పంపిస్తున్నారు.
గనుల నిర్వహణ, ప్రమాదాలు జరిగిన సమయంలో వెంటనే స్పందించే సింగరేణి సంస్థ మైనింగ్ ఎక్స్పర్ట్స్ సైతం టన్నెల్ చివర్లో స్లైడింగ్ ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. 9.2 వ్యాసార్థం ఉన్న టన్నెల్లో 200 మీటర్ల వరకు కొట్టుకువచ్చిన వ్యర్థాలు, మట్టి, రాళ్లు, బురదను ఎస్కవేటర్ల ద్వారా కింది నుంచి తొలగిస్తుంటే పైనున్న మట్టి కిందికి జారుతోందని సమాచారం.
సోమవారం రాత్రి టన్నెల్లో అర గంట కరెంట్ సప్లై నిలిచిపోవడంతో రెస్క్యూ బృందాలు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలిసింది. విపరీతంగా పెరిగిపోతున్న నీటి ఊట కారణంగా గట్టిపడిన మట్టి మళ్లీ వదులై బురదగా మారుతోందని చెబుతున్నారు. ఒక్క నిమిషం డీవాటరింగ్ మోటార్లు నిలిచిపోతే 300 గ్యాలన్ల నీరు వరదలా పారుతోందని సమాచారం.