SLBC టన్నెల్ లోకి రోబో: 110 మందితో రెస్య్కూ టీం..

SLBC టన్నెల్ లోకి రోబో: 110 మందితో రెస్య్కూ టీం..
  • ఎస్ఎల్బీసీలో గల్లంతైన ఏడుగురి కోసం సెర్చ్
  • నాన్ స్టాప్ గా వస్తున్న నీటి ఊట, పేరుకు పోతున్న బురద
  • టీబీఎం మిషన్ కట్ చేసి శిథిలాలను తొలగిస్తూ  ముందుకు
  • 13.200 కి. మీ వరకు లోకో ట్రైన్ ద్వారా.. తర్వాత కాలినడకన

మహబూబ్ నగర్/హైదరాబాద్: సొరంగంలో గల్లంతైన ఏడుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇవాళ రోబోను రంగంలోకి దించారు. మొత్తం 8 మందిలో గుర్ ప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే.  కేరళకు చెందిన కేడావర్ డాగ్స్, జీపీఆర్ సిస్టం ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు తవ్వకాలు జరిపినా ఫలితం లేక పోయింది. దీనికి తోడు పై నుంచి నిరంతరంగా నీటి ఊట వస్తుండటం, బురద పేరుకుపోతుండటంతో రెస్యూ ఆపరేషన్ లోకి రోబోను రంగంలోకి దించారు అధికారులు. చివరి పాయింట్ వద్ద గల్లంతైన వారి మృతదేహాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.  

దీంతో హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబో తో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా లోపలికి వెళ్లారు. 13.200 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ ద్వారా చేరుకుంటారు. అక్కడనుండి 13.850 కిలోమీటర్ల వరకు కాలినడకన శిథిలాలు, మట్టి, బురద, రెండు ఎస్కవేటర్ల మట్టి, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. 17 రోజులపాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు కార్మికుల జాడ లభించకపోవడంతో రోబో ద్వారా అయినా ఆచూకీ లభిస్తుందనే ఆశతో రంగంలోకి దింపారు. 

మానవులు చేరుకోలేని ప్రదేశానికి రోబోను పంపి సహాయక చర్యలను మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.  లోపల శిథిలాలు, మట్టి, బురద సహాయక చర్యలకు అడ్డంకిగా మారడంతోపాటు నీటి ఊట కొనసాగుతూ ఉండటంతో సహాయక బృందాలు జాగ్రత్తలు పాటిస్తున్నారు.