రోబో కుక్కలు రెడీ.. త్వరలో మార్కెట్లోకి

రోబో కుక్కలు రెడీ.. త్వరలో మార్కెట్లోకి

మనం వాకింగ్ కు వెళ్లేప్పుడు పెంపుడు కుక్కల్ని వెంట తీసుకెళ్తుంటాం. కానీ, యూఎస్ లోని ఫ్లోరిడాలో ఓ బీచ్ కు వచ్చిన మహిళ ఏకంగా రోబో డాగ్ను తీసుకురావడం అక్కడున్నవారందర్నీ ఆశ్చర్యపర్చింది. అచ్చం నిజం కుక్కలాగే చెప్పినట్లు వింటున్న ఆ మెకానికల్ పెట్ను చూసి షాక్ తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోబో డాగ్ ని ముద్దుగా స్క్రాపీ అని పిలుచుకుంటానని, నిజం కుక్కులాగే కూర్చుంటుందని, అది నడుస్తున్నప్పుడు ఏదైనా అడ్డుగా వస్తే పక్కకు తప్పుకుంటుందని స్క్రాపీ ఓనర్ చెప్తున్నారు. అవుట్ డోర్లోనే కాదు ఇంట్లో కూడా మెట్లు ఎక్కడం, తలుపులు తెరవడం, దాంట్లో అమర్చిన కెమెరాతో వాతావరణం అంచనా వేయడంతో పాటు వాచ్మన్ లా ఇంటి చుట్టూ తిరుగుతూ కాపలా కూడా కాస్తుందట. అణు కర్మాగారాలు, ఆఫ్షోర్ ఆయిల్ ఫీల్డ్లు, నిర్మాణ స్థలాల్లోనూ ప్రమాదకర పనులు చేస్తుందట. ఈ రోబో కుక్క పేరిట కిందటి నెలలో యూట్యూబ్ చానల్ క్రియేట్ చేశానని, అది చేసే విన్యాసాలను అందులో పోస్టు చేస్తున్నానని చెప్తోంది స్క్రాపీ ఓనర్. 

కిందటేడాదిలో మార్కెట్లోకి..
2015లో బోస్టన్ డైనమిక్స్ రూపొందించిన ఈ రోబోటిక్ కుక్కకు స్పాట్ అని పేరు పెట్టారు. తొలుత అంతరిక్ష ప్రయోగాలు, క్రైమ్ సీన్ ట్రేసింగ్లు, ఆస్పత్రులలో వినియోగించారు. న్యూయార్క్ లోని క్రైమ్ సీన్స్, పేలుడు సందర్భాల్లోనూ దీని పనితనాన్ని పరిశీలించారు. మసాచుసెట్స్ లో కరోనా టైంలో డ్యూటీ చేస్తున్న డాక్టర్లకు సాయంగానూ మెకానికల్ పెట్ ని వినియోగించారు. అన్ని పరీక్షల తర్వాత దీనిని కిందటేడాది జూన్ లో రూ.54.51 లక్షలకు కమర్షియల్ మార్కెట్ లోకి తీసుకువచ్చారు. అమ్మకానికి పెట్టిన కొద్ది రోజుల్లోనే టెక్సాస్ లోని ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్  టెస్టింగ్ సెంటర్ లో ఈ రోబో డాగ్ పెట్రోలింగ్ చేస్తున్నట్లు కనిపించిన వీడియో కూడా కిందటేడాది వైరల్ అయింది. స్పాట్ని కొనుగోలు చేసిన ఫస్ట్ కస్టమర్ కూడా ఎలన్ మస్క్ అని బోస్టన్ డైనమిక్స్ కంపెనీ వెల్లడించింది. ఇప్పటివరకు దీనిని కంపెనీలు మాత్రమే కొనుగోలు చేశాయని, రాబోయే రోజుల్లో ఇంటి పెంపుడు జంతువులాగా రోబో డాగ్ ని ఉపయోగించవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.

త్వరలో అడ్వాన్స్ వెర్షన్ స్పాట్ మినీ..
కొత్త తేలికపాటి స్పాట్ మినీ అనే అత్యాధునిక నాలుగు కాళ్ల రోబో డాగ్ ని త్వరలోనే ఆవిష్కరిస్తామని బోస్టన్ డైనమిక్స్ ఇప్పటికే ప్రకటించింది. స్పాట్ మినీ ఇంతవరకు రాని అడ్వాన్స్డ్ వెర్షన్ హ్యూమనాయిడ్ రోబోట్ అని, దీనిని ఆఫీసుల్లోనూ ఇండ్లలోనూ తేలికగా వినియోగించవచ్చని సంస్థ తన వెబ్సైట్ లో తెలిపింది. స్పాట్ తో పోలిస్తే స్పాట్ మినీకి అదనంగా రోబోటిక్ చేయి ఉంటుందని, దీని మొత్తం బరువు 25 నుంచి 30 కిలోలుంటుందని పేర్కొంది. ‘దీనికి ఒకసారి చార్జింగ్ చేస్తే 90 నిమిషాల పాటు పనిచేస్తుంది. ఇందులోని డెప్త్ కెమెరాలు, ప్రొప్రియోసెప్షన్ సెన్సార్ల ద్వారా నావిగేషన్ ట్రేస్ చేసి ఇంటిని, ఆఫీస్ను గుర్తుపట్టగలదు. ఇందులోని సెమీ అటానమస్ సిస్టంతో మనం ఫీడ్ చేసిన పనుల్ని స్పాట్ మినీ సొంతంగా చేస్తుంది. తలుపులు తీయడం, మెట్లు ఎక్కడం, ఇంటిచుట్టూ కాపలా కాయడం, చెత్త ఎత్తిపారేయడం, ఎదురుగా ఉన్న వస్తువులను గుర్తించడం వంటి పనుల్ని అవలీలగా చేస్తుంది. కిందపడిపోయినా ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో సులభంగా పైకి లేవగలదు అని కంపెనీ పేర్కొంది. అయితే, దీనిని కమర్షియల్ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారు, ధర ఎంత అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.