పొలం పనులు చేసే రోబో

పొలం పనులు చేసే రోబో

వర్షాలొచ్చినయ్​. రైతును సంతోషంలో ముంచినయ్​. దుక్కి దున్ని విత్తు నాటడానికి ఎన్నో రోజులుగా ఆకాశం వంక చూసిన రైతన్న ఇప్పుడు పొలం పనుల్లో బిజీ అయిపోయాడు. పంట వేయగానే సరిపోతుందా.. పొలం ఎదుగుతున్న కొద్దీ కలుపు పొలంలో పెనవేసుకుంటుంది. పంటను పాడు చేస్తుంది. కాబట్టి ఆ కలుపును కూలీలను పెట్టి తీయించేస్తుంటారు. అంతేకాదు, పురుగుమందులు పొలంపై కొట్టేస్తుంటారు. మరి, ఇటు రైతుకు, అటు పర్యావరణానికి మేలు చేసేలా ఏం చేయాలి? ఇదే ఆలోచన జపాన్​కు చెందిన కార్ల కంపెనీ ఇంజనీర్లు ఓ రోబోను తయారు చేశారు. దాని పేరు ‘ఐగమో’. అంటే బాతు అని అర్థం. దానికి ఆ పేరు పెట్టడానికీ కారణం లేకపోలేదు. బాతులు పొలాల్లోని కలుపులు, అక్కడ పెరుగుతూ పంటకు నష్టం చేసే చిన్న చిన్న కీటకాలను తినేస్తుందట. అందుకే బాతును స్ఫూర్తిగా తీసుకుని పొలం పనులు చేసే ఈ రోబో బాతును కనిపెట్టారు.

బాతుకు అంటే కాళ్లుంటాయి.. ఈదుకుంటూ వెళుతుంది. మరి, ఇదెలా నీళ్లలో వెళుతుంది? అంటే, దాని కింది భాగంలో ప్లాస్టిక్​ రడ్డర్స్​ను ఏర్పాటు చేశారు. అదే ఈ రోబో బాతును ముందుకు నడిపిస్తుంది. అంతేకాదు, అవి తిరుగుతున్న కొద్దీ నీళ్లలో ఆక్సిజన్​ తయారవుతూ ఉంటుంది. ఆ రడ్డర్లే పొలాల్లో కలుపు పెరగకుండా నిరోధిస్తుంటుంది. వైఫై, బ్యాటరీ, సౌర కరెంట్​, జీపీఎస్​లతో పొలాలను అది దున్నేస్తుంటుంది. 1.5 కిలోల బరువుండే ఈ రోబో బాతు, ఓ వాక్యూమ్​ క్లీనర్​ సైజులో ఉంటుంది. ప్రస్తుతం దీని ప్రొటోటైప్​ను జపాన్​లోని యమగత ప్రిఫెక్చర్​లో టెస్ట్​ చేశారు. పొలంలోకి దిగి అది చలాకీగా పనులు చేసేసింది.