- చుట్టుపక్కల ఇండ్లు డ్యామేజ్ కాకుండా జీహెచ్ఎంసీ చర్యలు
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్‌లో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లోపల ఉండిపోయిన ముగ్గురిలో ఒకరి అవశేషాలు లభించగా.. మరో ఇద్దరి డెడ్ బాడీల కోసం సెర్చ్ కొనసాగుతున్నది. వారి డెడ్ బాడీలను గుర్తించిన వెంటనే బిల్డింగ్‌ను కూల్చివేయనున్నారు. ఎన్ఐటీ డైరెక్టర్ రమణారావు ఇచ్చిన రిపోర్ట్ మేరకు శనివారం జీహెచ్ఎంసీ అధికారులు అల్ట్రా సోనిక్ టెస్టు చేశారు. ఆదివారం డెడ్ బాడీలను గుర్తిస్తే సోమవారం ఉదయం కూల్చివేత పనులు ప్రారంభించనున్నారు. చుట్టుపక్కల ఇండ్లు డ్యామేజ్ కాకుండా మాలిక్ ట్రేడింగ్ అండ్ డెమోలిషన్ సంస్థకి చెందిన టెక్నాలజీ యంత్రంతో కూల్చివేయనున్నారు. రెండు రోజుల్లో భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయనున్నారు. కూల్చివేసేందుకు అయ్యే ఖర్చు మొత్తం బిల్డింగ్ ఓనర్ నుంచి వసూలు చేస్తామని బల్దియా అధికారులు చెబుతున్నారు. భవనాన్ని శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ అమోయ్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ జీయావుద్దీన్ పరిశీలించారు. ఎలా కూల్చివేయాలనే దానిపై చర్చించారు.
లోపల 10 వేల టన్నుల మెటీరియల్: తలసాని
చుట్టుపక్కల ఇండ్లకు డ్యామేజ్ కాకుండా బిల్డింగ్‌ని కూల్చేస్తామని, వేరే వారి ఇండ్లకు డ్యామేజ్ అయితే తనదే బాధ్యతని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బిల్డింగ్‌ను పరిశీలించిన తలసాని మీడియాతో మాట్లాడారు. 10 వేల టన్నుల మెటీరియల్ లోపల ఉందని, బిల్డింగ్‌ను కూల్చేందుకు రెండు రోజుల టైమ్ పడుతుందన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు వచ్చారని, వారితో మాట్లాడామని, ఆదుకుంటామని చెప్పారు. చుట్టు పక్కల వారి కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 25న హై లెవల్ మీటింగ్ నిర్వహిస్తామని, ఫైర్ ఎన్ ఓసీ లు లేని బిల్డింగ్ లు, పర్మిషన్లు లేని భవనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జనావాసాల్లో ఉన్న గోదాంలపై ముందుగా దృష్టి పెడతామన్నారు. నగరంలో 25 వేలకు పైగా ఇలాంటి భవనాలు ఉంటాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దన్నారు.
క్రేన్ తరహా యంత్రం
బిల్డింగ్‌ని కూల్చే సమయంలో పక్క బిల్డింగ్‌లకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా రోబోటిక్ టెక్నాలజీ (కాంబి కటింగ్ బిగ్ మిషన్)తో భవనాన్ని కూల్చనున్నారు. క్రేన్ తరహాలోనే ఉండే యంత్రాన్ని కింది నుంచే ఆపరేట్ చేస్తారు. ఐరన్, స్లాబులు, గోడలను కట్ చేసి వ్యర్థాలను ముక్కలుగా యంత్రమే కిందకు తీసుకొస్తుంది. భవనం ముందు భాగంలో పై ఫ్లోర్ల నుంచి కూల్చివేతను ప్రారంభించనున్నారు. గతంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు కూడా ఈ యంత్రాన్నే వినియోగించారు.