ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌లోకి రోబోలు

ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌లోకి రోబోలు
  • మనుషులు వెళ్లలేని, హైరిస్క్‌‌ ప్రాంతాల్లో రోబోలతో తవ్వకాలు
  • ప్రమాదకరంగా మారుతున్న టన్నెల్‌‌ లాస్ట్‌‌ పాయింట్‌‌
  • జలపాతాన్ని తలపిస్తున్న నీటి ఊటలు, కష్టంగా మారుతున్న రెస్క్యూ

ఎస్‌‌ఎల్‌‌బీసీ నుంచి వెలుగు టీమ్‌‌ : ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. రెస్క్యూలో ఇప్పటివరకు ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్‌‌, ఎస్‌‌డీఆర్‌‌ఎఫ్‌‌, సింగరేణి, ర్యాట్‌‌హోల్‌‌ మైనర్స్‌‌ పనిచేయగా మృతదేహాలను గుర్తించేందుకు క్యాడవర్‌‌ డాగ్స్‌‌ను తీసుకొచ్చారు. తాజాగా రోబోలు సైతం రంగంలోకి దిగాయి. మంగళవారమే టన్నెల్‌‌ వద్దకు చేరుకున్న అన్వి రొబోటిక్‌‌ సంస్థ ప్రతినిధులు అక్కడ కంట్రోల్‌‌ రూమ్‌‌, కమాండ్‌‌ సెంటర్‌‌ను ఏర్పాటు చేసుకున్నారు.

బుధవారం రెండు రోబోలను టన్నెల్‌‌లోకి పంపించారు. టన్నెల్‌‌లో మనుషులు వెళ్లలేని హైరిస్క్‌‌, డేంజర్‌‌ ప్లేసెస్‌‌లో రోబోలతో వర్క్ చేయిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌‌లో పాల్గొంటున్న వారికి రిస్క్‌‌ లేకుండా, ఇంకా ముప్పు పొంచి ఉన్న 13.800 కిలోమీటర్ల పాయింట్‌‌ వద్ద రోబోలు మట్టిని తవ్వి కన్వేయర్‌‌ బెల్ట్‌‌పై వేస్తాయని రోబోటిక్‌‌ సంస్థ హెడ్‌‌ విజయ్‌‌ జగడం చెప్పారు.

ఏఐ ఇంటిగ్రేటెడ్ అల్గారిథం ఆధారంగా, టన్నెల్‌‌లోని పరిస్థితులను విశ్లేషించుకుంటూ, వాటికి అనుగుణంగా సూపర్‌‌ సక్కర్స్‌‌ ద్వారా మట్టి, రాళ్లు, శిథిలాల తొలగింపు, తరలింపు వంటి పనులు చేస్తాయన్నారు. టన్నెల్‌‌లో మనుషులతో అవసరం లేకుండా ఐదు రకాల రోబోలతో పని చేయిస్తామన్నారు. 

క్లిష్టంగా రెస్క్యూ ఆపరేషన్‌‌

టన్నెల్‌‌ లోపల టీబీఎం కూరుకుపోయిన చివరి పాయింట్‌‌లో తవ్వకాలు రిస్క్‌‌తో కూడుకున్నట్లు తెలుస్తోంది. టీబీఎం ముందు భాగంలో 8 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన మట్టి, రాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీబీఎం తవ్విన తర్వాత సిమెంట్‌‌ సెగ్మెంట్స్‌‌ ఫిక్స్‌‌ చేయని ప్రాంతంతో పాటు, సిమెంట్‌‌ సెగ్మెంట్స్‌‌ మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్‌‌ల నుంచి నుంచి నీళ్లు జలపాతంలా కారుతుండగా, నీటితో పాటు బురద కొట్టుకువస్తోంది.

డీవాటరింగ్‌‌కు ఉపయోగిస్తున్న మోటార్ల ఫుట్‌‌బాల్స్‌‌లోకి మట్టి, రాళ్లు చేరుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సుమారు 6.500 టన్నుల బరువు ఉండే ఒక్క సిమెంట్‌‌ సెగ్మెంట్‌‌ కూలినా ల్యాండ్‌‌ స్లైడింగ్‌‌ జరిగే ప్రమాదం ఉందని కార్మికులు భయపడుతున్నారు. టన్నెల్‌‌లోని చివరి పాయింట్‌‌లో టీబీఎం ముందు భాగంలో మట్టి కూలకుండా సింగరేణి మైన్స్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌ కింది నుంచి పైవరకు దుంగలు పేరుస్తున్నారు.

మంగళవారం నైట్‌‌ ఫిఫ్ట్‌‌లో టన్నెల్‌‌లోకి వెళ్లిన రెస్క్యూ టీమ్స్ టీబీఎం పక్కన ఉన్న మట్టి, రాళ్లు తవ్వేశారు. క్యాడవర్‌‌ డాగ్స్‌‌ గుర్తించిన ప్రదేశాల్లో ఏడుగురి ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. మరో వైపు కలెక్టర్‌‌ బాదావత్‌‌ సంతోష్‌‌ టన్నెల్‌‌ చివరి వరకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌‌ను పరిశీలించారు. సింగరేణి రెస్క్యూ జీఎం బైద్య రోజులో 17 గంటల పాటు టన్నెల్‌‌ లోపలే ఉండి రెస్క్యూ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 20 వరకు రెస్క్యూ ఆపరేషన్‌‌ను ముగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.