ఓ సందేశం.. రాక్ ఆర్ట్.. బొమ్మలతో ఆలోచింపజేస్తున్న వెంకన్న

ఓ సందేశం..  రాక్ ఆర్ట్.. బొమ్మలతో ఆలోచింపజేస్తున్న వెంకన్న
  • పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఓయూలో రాక్​ఆర్ట్
  • క్యాంపస్ లో పక్షులు, జంతువుల, మెసేజ్ ఇచ్చే చిత్రాలు దర్శనం

హైదరాబాద్, వెలుగు: పట్టుదల ఉంటే ఎన్ని  బాధ్యతలున్నా ఇష్టమైన కళను సహకారం చేసుకోవచ్చని నిరూపిస్తున్నాడు ఇస్లావత్​వెంకన్న. ఓ వైపు జాబ్ చేస్తూనే సెలవు రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలోని బండరాళ్లపై సందేశాత్మక చిత్రాలు గీస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మహబూబాబాద్​జిల్లాకు చెందిన వెంకన్న ఓయూలో ఎంఏ, ఏంఈడీ చదివాడు.

గత పదేండ్లుగా వర్సిటీ లైబ్రరీలో బుక్​కీపర్​గా కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నాడు. వర్సిటీ  ఏర్పాటై వందేండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వందకుపైగా బండరాళ్ల మీద బొమ్మలు వేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రకృతి సంబంధించిన చిత్రాలతో పాటు జంతువులు, పక్షులు, ప్రకృతికి సంబంధించిన చిత్రాలు వందకుపైగా వేశాడు.  క్యాంపస్ కు వెళ్లి చూస్తే.. బండరాళ్ల పై ఆయన వేసిన బొమ్మలే దర్శనం ఇస్తుంటాయి. 

 పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా..

వర్సిటీ  వందేండ్ల వేడుకల సందర్భంగా తను గుర్తుండిపోయేలా ఏదో ఒక ప్రయత్నం చేయాలనుకున్నారు వెంకన్న. ప్రతి రాయిలో ఒక రూపం దాగి ఉంటుందని, దాని ఆకారం తగ్గట్లు.. ఖడ్గ మృగం, జిరాఫీ, జింకా, ఒంటె, ఏనుగు, చిలుక, పావురం, సీతాకొకచిలుక, ఉడత, కంగారు, తాబేలు, కుక్క ఇలా.. రకరకాల చిత్రాలు గీశారు.

అలాగే పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సేవ్​సాయిల్, సేవ్ ఎర్త్, సేవ్​ట్రీస్​, స్టాప్​ది పొల్యూషన్ పేరుతో  అనేక సందేశాత్మక బొమ్మలు కూడా చిత్రించారు. ఓయూకు వచ్చిన వారు ఆహ్లదకర వాతావరణంలో గడపడమే కాకుండా చిత్రాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటు పడేలా ఆలోచిస్తారని వెంకన్న చెబుతున్నారు.

చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం ఇష్టం 

చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఎంతో ఇష్టం. కొన్ని కారణాలతో ఆర్ట్​ వైపు వెళ్లలేకపోయా. ప్రస్తుతం జాబ్ చేస్తూనే బొమ్మలు గీస్తున్న. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రాక్​ఆర్ట్ వేస్తున్న.

వర్సిటీలో వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం, క్లీన్ అండ్ గ్రీన్, ఆర్మీ డే వంటి పలు కార్యక్రమాలు చేపట్టాను. పర్యావరణ పరిరక్షణకు నా వంతుగా కృషి చేస్తున్న. సొంత ఖర్చులతోనే రాక్​ఆర్ట్ వేస్తున్న. ప్రభుత్వం సహకారమందిస్తే మరిన్ని చిత్రాలు గీస్తాను. 
 

– ఇస్లావత్ వెంకన్న, 
రాక్​ ఆర్టిస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ