హైదరాబాద్, వెలుగు : ఆది మానవుల కాలం నాటి రాక్ ఆర్ట్స్ మహబూబ్‌నగర్ జిల్లాలో బయటపడ్డాయి. మూసాపేట్ మండలం నందిపేట్ గ్రామ సమీపంలోని గజ్జెలోనిగుట్ట కింది భాగంలో ఉన్న పెద్దగుహలో వీటిని కనుగొన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు వేమారెడ్డి హనుమాన్ వెల్లడించారు. ఇవి తామ్రయుగం నాటి రాతి చిత్రాలని, పురామానవుల ఆవాస సంస్కృతికి ఆనవాళ్లని పేర్కొన్నారు. ‘‘ఈ గుహలోకి ప్రవేశించే మార్గం సొరంగంలా ఉంది. లోపలికి పాకుతూ వెళ్లాలి. గుహలో 10, 12 మంది నివసించేంత స్థలం ఉంది. ఇక్కడ ఆదిమానవులు నివసించి ఉంటారు. అందులో 10 మీటర్ల ఎత్తున్న పులిగుండు మీద ఎరుపు రంగులో చిత్రించిన రాతి చిత్రాల్లో పొడవైన తోక ఉన్న ఒక చిరుత, దానికి ఎదురుగా విల్లమ్ములు ధరించిన వేటగాడు, దుప్పి, పొడువాటి తోకగల జంతువు కనిపించాయి’’అని హనుమాన్ తెలిపారు.
రాక్ ఆర్ట్స్ ఎక్స్‌పర్ట్ బండి మురళీధర్ రెడ్డి ఈ రాతి చిత్రాలను పరిశీలించి చాల్కోలిథిక్ కాలానికి చెందినవని, గతంలో పెద్ద పులి బొమ్మలు లభించాయని, ఇక్కడ చిరుత చిత్రం కనిపించడం అరుదైనదని అన్నారు. గజ్జెలోనిగుట్ట మీద పదుల సంఖ్యలో డోల్మన్ సమాధుల్లో కొన్ని కూలిపోయి ఉన్నాయి. దీంతో వాటిల్లోని వస్తువులు తొలగించినట్లు అనిపిస్తోందని హరగోపాల్ వెల్లడించారు. ఇదే మండలంలోని చెన్నంపల్లి గ్రామం దగ్గర పడిగె రాతి గుండు మీద ఎరుపు రంగులో గాడిద/గుర్రం మీద కుడిచేతిలో డాలుతో, ఎడమ చేతలో కత్తితో వీరుడి చిత్రాలు గుర్తించినట్లు చెప్పారు.