కాబూల్: అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్ ఉగ్రవాద సంస్థ అఫ్ఘాన్‌పై మళ్లీ పట్టుసాధించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది. దీంతో అఫ్ఘాన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. అయితే తాలిబన్లు బలంగా దూసుకెళ్తున్నారు. అఫ్ఘాన్ ఆర్మీని ఎదుర్కొంటూ ఇప్పటికే దాదాపు 85 శాతం వరకు అఫ్ఘానిస్థాన్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా దక్షిణ అఫ్ఘాన్‌లోని కాందహార్ ఎయిర్‌పోర్టుపై రాకెట్ దాడులకు దిగారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఉన్నట్టుండి మూడు రాకెట్ బాంబర్లు ఎయిర్‌పోర్టుపైకి దూసుకొచ్చాయని కాందహార్ ఎయిర్‌పోర్టు చీఫ్ మసౌద్ పాస్తూన్ తెలిపారు. అందులో రెండు రాకెట్లు రన్ వేపై పడ్డాయని, వారి రిపేర్లు పూర్తి చేసే వరకు అన్ని ఫ్లైట్స్ రద్దు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
#BREAKING Rockets hit Kandahar airport in Afghanistan: airport official pic.twitter.com/IwEm0fI6Bu
— AFP News Agency (@AFP) August 1, 2021
గడిచిన కొన్ని వారాలుగా కాందహార్‌ను హస్తగతం చేసుకునేందుకు తాలిబన్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దేశంలోనే రెండో అతి పెద్ద సిటీ ఇది. పైగా ఈ ఎయిర్‌బేస్ నుంచే అఫ్ఘాన్ దళాలకు లాజిస్టిక్ సపోర్ట్ అందుతోంది. తాలిబన్లను నిలువరించేందుకు అఫ్ఘాన్ ఆర్మీకి ఈ ఎయిర్ బేస్ చాలా కీలకం. అటు తాలిబన్లు కూడా దీన్ని సొంతం చేసుకోవడం ద్వారా తమ బలాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు. ఈ ఒక్క కాందహార్‌ను సొంతం చేసుకుంటే అఫ్ఘాన్‌లోని పశ్చిమ, దక్షిణ భాగాలు దాదాపు పూర్తిగా తాలిబన్ల చేతిలోకి వెళ్లినట్టే. అఫ్ఘాన్ ఆర్మీకి కూడా కోలుకోలేని దెబ్బ తగిలినట్లవుతుంది.