హైదరాబాద్, వెలుగు: కోల్డ్‌చెయిన్ అప్లియెన్సెస్ తయారీ సంస్థ రాక్‌వెల్ హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. కోల్డ్‌చెయిన్, రిఫ్రిజిరేషన్ టెక్నాలజీల గురించి తెలియజేయడానికి దీనిని మొదలుపెట్టామని తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ కొత్త కోల్డ్ చైన్ ఉత్పత్తులను కూడా ప్రారంభించింది. వీటిలో ఐస్ క్యూబ్ మెషీన్‌లు, షోకేస్ కూలర్‌లు, ఆడియో -వీడియో మర్చండైజింగ్ కూలర్‌లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో–-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోమ భరత్ కుమార్ ఈ సెంటర్‌ను ప్రారంభించారు. రాక్‌వెల్ ఇండస్ట్రీస్ ఎండీ అశోక్ గుప్తా మాట్లాడుతూ దేశంలోని 20 టైర్2 నగరాల్లో ఎక్స్‌పీరియన్స్ జోన్‌లను తెరుస్తామని వెల్లడించారు. కంపెనీకి హైదరాబాద్‌లో రెండు మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. లక్నోలో రూ.100 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో కొత్త ప్లాంటును తెరుస్తామని గుప్తా వెల్లడించారు.
రావిర్యాలలో మెగా డెయిరీ ఏర్పాటు
ఈ సందర్భంగా సోమ భరత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ విజయ డెయిరీని పెద్ద ఎత్తున విస్తరిస్తామని చెప్పారు. రంగారెడ్డిలోని రావిర్యాల వద్ద మెగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ డెయిరీ ప్రొడక్టులను పెద్ద ఎత్తున తయారు చేస్తామని అన్నారు. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పాలు సరిపోవడం లేదు. విజయ డెయిరీ రోజుకు 3 లక్షల లీటర్లు పాలు అమ్ముతోంది. దాదాపు 25 శాతం కొరత ఉంది. దీనిని తీర్చడానికి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున పశువులను రైతులకు అందిస్తాం. ఇందుకోసం బ్యాంకుల ద్వారా లోన్లు, సబ్సిడీలు ఇప్పిస్తాం. మొదటిదశలో 45 వేల యూనిట్లు ఇస్తాం. విజయ డెయిరీ ద్వారా ప్రస్తుతం 24 ప్రొడక్టులు అమ్ముతున్నాం. త్వరలో వీటిని వందకు పెంచుతాం. విజయా పార్లర్ల సంఖ్యను రెండు వేలకు పెంచుతాం”అని భరత్ వివరించారు.