వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లు ముగిసాయి. మరో రెండు రోజుల్లో నాకౌట్ సమరం మొదలుకానుంది. అద్భుత ప్రదర్శన చేసిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ మెగా టోర్నీలో సెమీస్ కు అర్హత సాధించాయి. నిన్న(నవంబర్ 12) వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై భారత్ 160 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం డచ్ సీనియర్ స్పిన్నర్ వాండర్ మెర్వ్ వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఈ మ్యాచ్ లో పొదుపుగా బౌలింగ్ చేసిన ఈ 38 ఏళ్ళ ఆఫ్ స్పిన్నర్ 10 ఓవర్లలో 53 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన కోహ్లీ వికెట్ సంపాదించాడు. బ్యాటింగ్ లో 8 బంతుల్లో రెండు సిక్సులతో 16 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్ తర్వాత ప్రెస్ తో మాట్లాడిన వాండెర్ మెర్వ్ పరోక్షంగా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. భారత్ జట్టు చాలా బ్యాలన్స్ గా ఉందని రోహిత్ సేనను జట్టును ఓడించడం కష్టమని తెలిపాడు. దక్షిణాఫ్రికా జట్టులో మ్యాచ్ విన్నర్లున్నారని చెప్పిన ఈ లెఫ్టర్మ్ స్పిన్నర్.. న్యూజిలాండ్ నిలకడగా ఆడుతుందని తెలిపాడు.
ఆస్ట్రేలియా గురించి మాట్లాడుతూ ఆస్ట్రేలియా.. ఆస్ట్రేలియానే అంటూ ఆ జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందని నమ్మకముంచాడు. 5 సార్లు వరల్డ్ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఎప్పటికీ ప్రమాదమే అని చెప్పకనే చెప్పాడు. కాగా.. ఈ వరల్డ్ కప్ లో నవంబర్ 15 న భారత్ తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముంబైలోని వాంఖడే ఆతిధ్యమిస్తుంది. ఇక మరో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా సమరానికి సిద్ధమైంది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగనుంది.