కాగజ్‌నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్‌లో మూడు రోజులుగా హల్‌చల్ చేసిన ఏనుగు ఎట్టకేలకు మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి దారితప్పి వచ్చిన ఏనుగు చింతలమానేపల్లి, పెంచికల్‌పేట మండలాల్లో ఇద్దరిని చంపేసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఏనుగు శుక్రవారం సాయంత్రం మురళీగూడ, జిల్లేడ గ్రామాల మధ్య ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర వైపు వెళ్లిందని ఫారెస్ట్ సిబ్బంది, గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే మరో ఏనుగు ఖర్జెళ్లి రేంజ్‌లో సంచరిస్తున్నట్లు వార్త వైరల్ కావడం కలకలం సృష్టించింది.
శుక్రవారం సాయంత్రం ఆటోలో ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్న వారికి ఖర్జెళ్లి రేంజ్‌లోని కేతిని – దిందా గ్రామాల మధ్య ఏనుగు రోడ్డు దాటడం కనిపించిందన్న వార్త వైరల్‌గా మారింది. దీంతో రేంజ్ ఆఫీసర్లు సదరు ప్రాంతానికి చేరుకొని గాలింపు చేపట్టారు. అప్పటికే రాత్రి కావడంతో గాలింపునకు ఇబ్బందిగా మారింది. కాళేశ్వరం జోన్ వైల్డ్ లైఫ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ మాట్లాడుతూ కేతిని–దిందా మధ్య ఏనుగు కనిపించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. ఇటీవల దారి తప్పి వచ్చిన ఏనుగు తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయిందన్నారు.