- బెంగళూరు నివాసికి నెలలోనే వందసార్లు బ్రెయిన్ స్ట్రోక్స్
బెంగళూరు : బెంగళూరులోని కెంగేరికి చెందిన రోహన్ (34) గత నెల రోజుల్లో వందసార్లు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యాడు. ప్రస్తుతం అతను బెలూన్ యాంజియోప్లాస్టీ చికిత్సతో కోలుకుంటున్నాడు. డాక్టర్లు డ్రగ్ కోటెడ్ బెలూన్ తో చికిత్స చేసి అతని మెదడులోని బ్లాక్స్ ను (సెరబ్రల్ ఆర్టరీస్) తొలగించి కొత్త జీవితం ప్రసాదించారు. ఫోకల్ సెరబ్రల్ ఆర్టిరియోపతి (ఎఫ్ సీఏ) వల్ల రోహన్ మెదడుకు రక్త సరఫరా ఆగిపోయింది.
దీంతో అతనికి రోజూ మూడు నుంచి ఆరుసార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది. ఇలాంటి వారికి సాధారణంగా స్టెరాయిడ్లు, బ్లడ్ థిన్సర్ ఇచ్చి వ్యాధి లక్షణాలు తగ్గిస్తారు. అయితే, ఎలాంటి డ్రగ్స్, ఇంజెక్షన్లకూ రోహన్ స్పందించేవాడు కాదు. దీంతో ఎమ్ఆర్ఐ స్కాన్ చేసి చూడగా.. స్ట్రోక్స్ వల్ల అతని మెదడుకు డ్యామేజ్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో అతనికి స్టంట్స్ ఇచ్చి చికిత్స చేయాలని భావించారు.
ఈ ప్రక్రియలో అతని మెదడులోని ధమనులు దెబ్బతింటాయని డాక్టర్లు భావించారు. దీంతో జూన్ 2న రోహన్ ను నారాయణ హెల్త్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు అతనికి బెలూన్ యాంజియోప్లాస్టీ చేశారు. బెలూన్ ఉన్న డ్రగ్ ను ట్యూబ్ కు పెట్టి ధమనిలో బ్లాకులు ఉన్నచోట ఆ ట్యూబ్ ను పంపించి వాటిని తొలగించారు.