
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను ప్రకటించిన గంటల వ్యవధిలోనే అసెంబ్లీ స్పీకర్ ఎవరనే విషయంలో కూడా స్పష్టత వచ్చేసింది. ఢిల్లీ శాసనసభ సభాపతిగా రోహిణి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన విజేందర్ గుప్తా నామినేట్ అయ్యారు. సభాపతిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గత ఆప్ ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన కాగ్ రిపోర్ట్స్ను సభ ముందుకు తీసుకొస్తానని ఆయన చెప్పారు. రోహిణి నియోజకవర్గం నుంచి విజేందర్ గుప్తా మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాగ్ రిపోర్ట్స్ను ఆప్ ప్రభుత్వం బయటపెట్టడం లేదని గతంలో ఇతర బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి విజేందర్ గుప్తా కోర్టును కూడా ఆశ్రయించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆప్ నుంచి 22 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. శాసనసభ్యులంతా కలిసి ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ను శాసనసభ సాక్షిగా ఎన్నికోనున్నారు. బీజేపీ అధిష్టానం అయితే ఇప్పటికే విజేందర్ గుప్తాను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా ప్రతిపాదించింది. సభలో మెజార్టీ ఉండటంతో విజేందర్ గుప్తానే ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా ఆయనే ఎన్నిక కానున్నారు. బీజేపీ అధిష్టానం గుప్తా సామాజిక వర్గానికి ప్రభుత్వంలో పెద్ద పీట వేసింది. సీఎంగా రేఖా గుప్తాను, స్పీకర్గా విజేందర్ గుప్తాను బీజేపీ అధిష్టానం ప్రకటించి.. వైశ్య సామాజిక వర్గానికి ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పదవులను కేటాయించడం గమనార్హం.
ALSO READ | ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం
రేఖా గుప్తా హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్‌గఢ్ గ్రామంలో 1974 జూలై 19 జన్మించారు. ఆమె తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు. రేఖా గుప్తా రెండేండ్ల వయసు(1976)లో వారి కుటుంబం ఢిల్లీకి వలస వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో చదివేటప్పుడే రేఖా గుప్తా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు. 1996 నుంచి-1997 మధ్య ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డీయూఎస్ యూ) అధ్యక్షురాలిగా పనిచేశారు.
రేఖా గుప్తా రాజకీయ జీవితం 2000లో ప్రారంభమైంది. 2015, 2020లో ఢిల్లీ ఎన్నికలలో షాలిమార్ బాగ్ స్థానానికి పోటీ చేశారు. కానీ రెండు సార్లు ఆప్ అభ్యర్థి బందన కుమారి చేతిలో ఓడిపోయారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ షాలిమార్ బాగ్ నుంచి పోటీ చేశారు. ఆప్ అభ్యర్థి బందన కుమారిని 29 వేల ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎం పదవి వరించింది.