- సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచే ఆఖరిది
- టెస్ట్, వన్డేల్లో కొనసాగింపు..
బ్రిడ్జ్‌టౌన్ : ఒక గొప్ప విజయంతో.. ముగ్గురు టీమిండియా లెజెండ్స్ టీ20 ఫార్మాట్‌కు ముగింపు పలికారు. 13 ఏళ్లుగా పోరాడుతున్నా చిక్కినట్టే చిక్కి చేజారుతున్న మెగా కప్‌ను సగర్వంగా ఒడిసిపట్టిన అద్భుత క్షణాలను తమ కెరీర్‌లో మధుర ఘట్టంగా నిలుపుకున్నారు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌ను వదిలేస్తున్నట్లు ప్రకటిస్తే.. హిట్‌మ్యాన్ రోహిత్ మీడియా సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
అప్పటికే ఒకింత నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు మరో షాకిస్తూ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆదివారం తన వీడ్కోలు ప్రకటన చేశాడు. మొత్తానికి టీమిండియాను ముందుకు తీసుకెళ్లే అతి పెద్ద బాధ్యతలను కుర్రాళ్లపై పెట్టి షార్ట్ ఫార్మాట్‌కు అల్విదా చెప్పేశారు. అయితే ఈ ముగ్గురూ టెస్ట్, వన్డేల్లో కొనసాగనున్నారు.
సలామ్.. శర్మాజీ
ఒక కపిల్ దేవ్, ఒక ధోనీ, ఒక రోహిత్.. టీమిండియా క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న హిట్‌మ్యాన్.. 17 ఏళ్ల టీ20 కెరీర్‌కు ముగింపు పలికాడు. 13 ఏళ్ల తర్వాత టీమిండియాకు నాలుగో వరల్డ్ కప్ అందించి గుడ్‌బై చెప్పాడు. ‘ఇదే నా ఆఖరి మ్యాచ్. వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదు. ఈ ట్రోఫీ గెలుపును నేను చెడ్డగా ఊహించుకున్నా. దాన్ని మాటల్లో చెప్పలేను. కానీ నేను కావాలనుకున్నది సాధించా. నా లైఫ్‌లో చాలాసార్లు దీనికోసం ప్రయత్నించి విఫలమయ్యా. ఈసారి ఆ హద్దు దాటినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ ప్రతిభపై ఏన్నాడూ అపనమ్మకం లేకపోయినా.. కొన్నిసార్లు పరిస్థితులు చాలా అడ్డంకులు సృష్టించాయి.
2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత అతని కెరీర్ సందిగ్ధంలో పడింది. కానీ ఆ ఒత్తిడిని అద్భుతంగా హ్యాండిల్ చేసిన రోహిత్ 2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చి తన సత్తా ఏంటో చూపెట్టాడు. అయితే టైటిల్ గెలవకపోవడం అతన్ని మానసికంగా దెబ్బతీసినా ఏనాడూ బెదరలేదు. 2007లో ఇంగ్లండ్‌పై టీ20ల్లో అరంగేట్రం చేసిన రోహిత్.. కెరీర్‌లో 159 మ్యాచ్‌లు ఆడాడు. 32.05 యావరేజ్‌తో 4231 రన్స్ చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గానూ రోహిత్ రికార్డులకెక్కాడు.
61 మ్యాచ్‌ల్లో 50 విజయాలు సాధించాడు. కేవలం టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ సారథ్యంలో 13 మ్యాచ్‌లు ఆడితే 11 గెలిచాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు (205) కొట్టిన రికార్డు కూడా రోహిత్ పేరుమీదే ఉంది. టీమిండియా గెలిచిన రెండు టీ20 వరల్డ్ కప్స్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన 9 టోర్నీల్లోనూ ఆడిన ఏకైక ప్లేయర్ హిట్‌మ్యాన్.
మేటి ఆల్‌రౌండర్‌గా..
టీమిండియాకు నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా సేవలందించిన జడేజా కూడా ఈ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. అత్యద్భుతమైన ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతను స్పిన్నర్‌గా, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా ఇండియాకు తిరుగులేని విజయాలు అందించాడు. 2009లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన జడ్డూ 74 మ్యాచ్‌లు ఆడాడు. 515 రన్స్‌తో పాటు 54 వికెట్లు తీశాడు. క్లిష్టమైన క్యాచ్‌లు పట్టడం, రనౌట్స్ చేయడంలో జడ్డూ దిట్ట.
విభిన్నమైన బౌలింగ్ శైలితో కుంబ్లే, హర్భజన్ తర్వాత టీమ్‌లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘నా మనస్ఫూర్తిగా టీ20లకు వీడ్కోలు పలుకుతున్నా. అవకాశం వచ్చిన ప్రతిసారి నా దేశం కోసం శక్తి మేరకు అత్యుత్తమ ప్రదర్శన చేశా. టీ20 వరల్డ్ కప్ గెలవడంతో నా కల నెరవేరింది. నా కెరీర్‌లో ఉన్నతమైన శిఖరం ఇదే. ఇన్నాళ్లూ నాకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు’ అని జడ్డూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. జడ్డూ, సర్, రాక్‌స్టార్‌లాంటి నిక్ నేమ్‌లు కలిగిన జడేజా ఆరు టీ20 వరల్డ్ కప్స్ ఆడాడు.
యువరాజ్ సరసన..
షార్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. ధోనీకి కూడా సాధ్యం కాని ఓ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 4 ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన రెండో ఇండియన్ ప్లేయర్‌గా యువరాజ్ సరసన చోటు సంపాదించాడు. అండర్–19 వరల్డ్ కప్ (2008), వరల్డ్ కప్ (2011), చాంపియన్స్ ట్రోఫీ (2013), టీ20 వరల్డ్ కప్ (2024) విరాట్ ఖాతాలో ఉన్నాయి. 2021, 2023లో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్ ఆడినా టైటిల్‌ను మాత్రం నెగ్గలేకపోయాడు.
వచ్చే ఏడాదైనా ‘గద’ను అందుకుంటాడేమో చూడాలి. ధోనీ 3 ట్రోఫీలతోనే (2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ) కెరీర్ ముగించాడు. ఇక యువరాజ్ అండర్–19 వరల్డ్ కప్ (2000), చాంపియన్స్ ట్రోఫీ (2002), టీ20 వరల్డ్ కప్ (2007), వన్డే వరల్డ్ కప్ (2011) గెలిచిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.