ముంబై : ఐపీఎల్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్ వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో చేరి కెప్టెన్సీ కూడా చేపడుతాడంటూ పెద్ద చర్చకు దారి తీశాడు. ఈ సీజన్‌లో ముంబై ఫ్రాంచైజీ రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడాన్ని ఆ టీమ్ ఫ్యాన్స్ జీర్ణించుకోవడం లేదు. సోషల్ మీడియాతో పాటు స్టేడియాల్లోనూ హార్దిక్‌ను ఇబ్బంది పెడుతున్నారు.
కెప్టెన్సీ మార్పు విషయంలో రోహిత్ సైతం అసంతృప్తిగా ఉన్నాడని, ముంబైని వదిలి వచ్చే ఏడాది మెగా వేలంలో బరిలో నిలుస్తాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ పోడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న వాన్ ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా మాట్లాడాడు. ‘రోహిత్ చెన్నై ఫ్రాంచైజీలో చేరి ధోనీ స్థానాన్ని భర్తీ చేస్తాడని అనుకుంటున్నా. రుతురాజ్ ఈ సీజన్ వరకే కెప్టెన్‌గా ఉంటాడు. వచ్చే సీజన్‌లో రోహిత్‌కు బాధ్యతలు ఇచ్చేస్తాడు’ అని అభిప్రాయపడ్డాడు.