హృతిక్ రోషన్ తమ్ముడి పాత్రలో రోహిత్

హృతిక్ రోషన్ తమ్ముడి పాత్రలో రోహిత్

తన రోల్ స్క్రీన్​ మీద ఎంతసేపు  కనిపిస్తుందనే దాంతో సంబంధం లేకుండా... ఇంపాక్ట్ చూపించే సినిమాలు చేస్తున్నాడు పాతికేండ్ల రోహిత్ సురేశ్ సరఫ్. హిందీలో  రీమేక్ అవుతున్న ‘విక్రమ్ వేద’ సినిమాలో హృతిక్ రోషన్ తమ్ముడి పాత్రలో నటిస్తున్న రోహిత్​  తన మాటల్లోనే మరిన్ని విశేషాలు...

‘‘విక్రమ్ వేద సినిమాలో హృతిక్ రోషన్ తమ్ముడి పాత్రలో చేస్తున్నా. సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ లాంటి గొప్ప నటుల పక్కన చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమాల్లోకి రావాలని చిన్నప్పట్నించే కలలు కనేవాడిని. స్కూల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్​ అన్నింటిలో పాల్గొనేవాడిని. కథక్ డాన్స్​ నేర్చుకున్నా. స్టేజీ పర్ఫార్మెన్స్ కూడా చేశా. ఛానెల్ ‘వి’ వాళ్లు 2012లో నిర్వహించిన ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్?’ అనే డ్రామా షో-లో సాహిల్​గా నటించా. అదే నేను మొదటిసారి స్క్రీన్ మీద కనిపించడం. నన్ను నేను బెటర్​గా ఎక్స్​ప్రెస్ చేసుకోవడానికి యాక్టింగ్ లేదా మోడలింగ్ బాగా ఉపయోగపడుతుంది అనుకున్నా. అలా పదిహేనేండ్ల వయసులో ఆడిషన్​కి ఫొటోలు పంపించా. షార్ట్​లిస్ట్ అవడంతో స్కూల్ మానేసి ముంబై వెళ్లా.

ఆరు నెలలే ఉన్నా...

ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చి, అంత చిన్న వయసులో ముంబైలో ఒంటరిగా ఉండటం చాలా కష్టమైంది. ఆరు నెలల తర్వాత ఆ షో ఆగిపోయింది. దాంతో ఢిల్లీ వెళ్లిపోయా. నాకు పదహారేండ్లప్పుడు మళ్లీ ఇంకో సినిమా సైన్ చేశా. రెండేండ్లు ఎదురుచూసినా ఆ మూవీ రిలీజ్​ కాలేదు. తరువాత అవకాశాలు రాలేదు. అప్పుడు మా అమ్మ, రిలేటివ్స్​ ఎంత చెప్పినా ముంబై విడిచిపెట్టలేదు. సెయింట్ జేవియర్ కాలేజీలో డిగ్రీ చేస్తూ...  ఛాన్స్​ల కోసం ఆడిషన్స్ ఇచ్చా. అలా ‘డియర్ జిందగీ’ సినిమా అవకాశం వచ్చింది.   

నా కెరీర్ మొదలైంది

డియర్ జిందగీలో అలియా నుంచి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నా. ఆ తర్వాత 2017లో వచ్చిన నార్వే సినిమా ‘వాట్ విల్ పీపుల్ సే’ లో అమిర్ క్యారెక్టర్ చేశా. 2020లో నెట్ ఫ్లిక్స్​లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ‘మిస్ మ్యాచ్డ్’ వెబ్ సిరీస్​లో నా రోల్ అందరికీ గుర్తుండి పోయింది. అదే ఏడాది వచ్చిన క్రైమ్ కామెడీ ‘లూడో’ కూడా మంచి పేరు తెచ్చింది.

ప్రియాంక మోటివేషన్

2018లో వచ్చిన కామెడీ డ్రామా ‘హిచ్కి’ మూవీ చేశా. అదే ఏడాది18 ఏండ్లకే కంబైన్డ్ ఇమ్యూనో డెఫీషియెన్సీతో ప్రాణాలు కోల్పోయిన రచయిత్రి, మోటివేషనల్ స్పీకర్ ఐషా చౌదరి జీవితం ఆధారంగా తీసిన బయోపిక్ ‘ది స్కై ఈజ్ పింక్’ అనే బాలీవుడ్ మూవీలో నటించా. ఈ మూవీ మా నాన్న మరణాన్ని గుర్తు చేసింది. మన జీవితంలో ఒక విలువైన వ్యక్తిని కోల్పోయినప్పుడు ఎలాంటి దుఃఖం ఉంటుందో, దాన్ని ఇందులో చూపించ గలిగా. ప్రతి రోల్​కి నేను ఒక కొత్త వ్యక్తిగా మారిపోవాలి – అదే నా లక్ష్యం. సినిమాల్లోనే కాదు కేఎఫ్ సీ, డిస్నీ ఛానెల్, సన్ ఫీస్ట్ డార్క్ ఫాంటసీ చాకొలెట్ బ్రాండ్స్ టీవీ కమర్షియల్స్​లో కూడా చేశా.

ఓటీటీ రాకతో...

ఓటీటీల రాకతో ఆర్టిస్టులకు, మేకర్స్​కి అవకాశాలు పెరిగాయి. ప్రపంచంలో ఉన్న ఏ ప్రేక్షకుడికైనా ఇప్పుడు భాష  అడ్డుగోడ కానే కాదు. మూడేండ్లుగా చూసుకుంటే, ప్రపంచ వ్యాప్తంగా వెబ్ సిరీస్​ల పాపులారిటీ పెరిగిపోయింది. ఇలాంటి టైంలో యాక్టర్​గా నేను చేయడం అదృష్టం.

సంతోషంగా ఉంది

ముంబైలో ప్రతి రోజు సర్​ప్రైజింగ్​గానే ఉంటుంది. ఇండస్ట్రీ చెడ్డదని చెప్పను. కానీ, అవకాశాలు రావడం మాత్రం అనుకున్నంత ఈజీ కాదు. నాకు గుర్తింపు రావడం పట్ల సంతోషంగా ఉంది. కొన్నిసార్లు ఊహించకుండానే మ్యాజిక్స్ జరిగిపోతుంటాయి. సక్సెస్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రేక్షకుల అంచనాలు అందుకోవాలనే బాధ్యతా పెరుగుతుంది. వీటన్నింటికన్నా ఇప్పుడు నన్ను నేను బాగా చూసుకోవాలనే బాధ్యతకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తా. ఎందుకంటే, నేను చేసే పని నాకు సంతోషాన్ని ఇవ్వాలి కదా! 

ఖాఠ్మాండులో పుట్టా

 నేపాల్​లోని ఖాఠ్మాండు​లో ఇండియన్ హిందు ఫ్యామిలీలో పుట్టా. నాకు ఐదేండ్ల వయసున్నప్పుడు మేం ఢిల్లీకి తిరిగొచ్చేశాం. నాన్న చనిపోయినప్పుడు నా వయసు పదకొండేండ్లు. నాన్నతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నా ఫొటోలు ఎక్కువగా తీసేవాడు నాన్న. ‘ఏదో ఒక రోజు నిన్ను యాక్టర్​ని చేస్తా’ అనేవాడాయన. మా చిన్నప్పుడే... ‘నచ్చిందే చెయ్యాలి. చదువు ముఖ్యం కాదు. మీరు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి’ అని నాకు, అన్నయ్యకు చెప్తుండేవాడు.

‘ఇదంతా కలలాగా ఉందిరా’ అని మా అమ్మ అంటుంటే, ఆమె నమ్మకాన్ని పదే పదే నిజం చేయడమే నా పని. స్క్రీనింగ్స్ జరిగేటప్పుడు యాక్టర్స్ వాళ్ల నాన్నలతో మాట్లాడుతుంటే... మా నాన్నను మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ, ఇప్పుడు ఆయన కలలో జీవిస్తున్నందుకు గర్వంగా ఉంది.

 ::: గుణ