ODI World Cup 2023: రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర ..కెప్టెన్సీలో దిగ్గజాలను దాటేశాడు

ODI World Cup 2023: రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర ..కెప్టెన్సీలో దిగ్గజాలను దాటేశాడు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఓ వైపు బ్యాటర్ గా పరుగులు చేస్తూనే మరో వైపు కెప్టెన్ గా వరుస విజయాలను అందిస్తున్నాడు. హిట్ మ్యాన్ గ్రేట్ బ్యాటర్ తో పాటు మంచి కెప్టెన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత్ కు రెండు సార్లు ఆసియా కప్ లు అందించిన రోహిత్.. తొలిసారి వరల్డ్ కప్ లో టీమిండియాకు కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో ఆడిన ఆరు మ్యాచ్ ల్లో భారత్ కి విజయాలను అందించగా.. కెప్టెన్సీలో దిగ్గజాలను మించిపోయాడు.
 
వరల్డ్ కప్ లో భాగంగా నిన్న (అక్టోబర్ 29) లక్నో వేదికగా ఇంగ్లాండ్ పై జరిగిన మ్యాచులో టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా 100 మ్యాచ్ లను పూర్తి చేసుకోగా వీటిలో భారత్ కు 74 మ్యాచ్ ల్లో విజయాన్ని అందించాడు. తొలి 100 వన్డేలు చూసుకుంటే రోహిత్ టాప్ లో ఉండడం విశేషం. రోహిత్ విజయాల శాతం 74 గా ఉంది. ఇప్పటివరకు ఈ లిస్టులో ఆస్ట్రేలియా మాజీ సారధి రికీ పాంటింగ్ టాప్ లో ఉన్నాడు.

పాంటింగ్ తన తొలి వంద మ్యాచ్ ల్లో విజయాల శాతం చూసుకుంటే  70.5% గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ 69.6% తో మూడో స్థానాల్లో నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్సీతో పాటు బ్యాటర్(87) గాను అదరగొట్టిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. కోహ్లీ తర్వాత టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ మొత్తం 9 టెస్టుల్లో 5 విజయాలు, 40 వన్డేల్లో 30 విజయాలు,59 టీ 20 ల్లో 39 విజయాలను భారత్ కు అందించాడు.