ముంబై : టీమిండియా కెప్టెన్, ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ (3), యశస్వి జైస్వాల్ (4), శ్రేయస్ అయ్యర్ (11).. గురువారం జమ్మూ కశ్మీర్‌తో మొదలైన రంజీ ఎలైట్ గ్రూప్–ఎ మ్యాచ్‌లో ఫెయిలయ్యారు. దీంతో టాస్ నెగ్గిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 33.2 ఓవర్లలో 120 రన్స్‌కే ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్ (51) టాప్ స్కోరర్. తనుష్ కొటియాన్ (26) ఫర్వాలేదనిపించాడు. ఉమన్ నజిర్ మిర్, యుధ్వీర్ సింగ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. తర్వాత ఆట ముగిసే టైమ్‌కు జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లలో 174/7 స్కోరు చేసింది. శుభమ్ ఖజురియా (53), అబిద్ ముస్తాక్ (44) రాణించారు.
పారస్ డోగ్రా (19 బ్యాటింగ్), యుధ్వీర్ సింగ్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కర్నాటకతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (4) కూడా నిరాశపర్చాడు. దీంతో పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 55 రన్స్‌కే కుప్పకూలింది. రమన్‌దీప్ సింగ్ (16) టాప్ స్కోరర్. వాసుకి కౌశిక్ 4, అభిలాష్ షెట్టి 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 199/4 స్కోరుతో కొనసాగుతోంది.
పంత్ ఒకటి.. జడేజా ఐదు
ఢిల్లీ, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రిషబ్ పంత్ (1) నిరాశపరిస్తే.. రవీంద్ర జడేజా (5/66) బౌలింగ్‌లో దుమ్మురేపాడు. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 188 రన్స్‌కు ఆలౌటైంది. ఆయుష్ బదోనీ (60), యష్ ధుల్ (44), మయాంక్ గుసాని (38 నాటౌట్) మెరుగ్గా ఆడారు. ధర్మేంద్రసిన్హా జడేజా 3 వికెట్లు తీశాడు. తర్వాత సౌరాష్ట్ర 163/5 స్కోరు చేసింది. హర్విక్ దేశాయ్ (93), రవీంద్ర జడేజా (38) రాణించారు.