T20 World Cup 2024: రికార్డులు కొల్లగొట్టిన హిట్‌మ్యాన్.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏకైక ఆట‌గాడు

T20 World Cup 2024: రికార్డులు కొల్లగొట్టిన హిట్‌మ్యాన్.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏకైక ఆట‌గాడు

బుధవారం(జూన్ 05) ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 600 సిక్సులు కొట్టిన మొనగాడిగా, టీ20 ప్రపంచ‌క‌ప్ అన్ని ఎడిష‌న్లలో ఆడిన ఏకైక ఆట‌గాడిగా, కెప్టెన్‌గా జట్టుకు అత్యధిక విజయాలు అందించిన నాయకుడిగా వంటి పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. 

600 సిక్స్‌లు

ఐర్లాండ్‌పై రోహిత్ శర్మ 140.54 స్ట్రైక్ రేట్‌తో 37 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ మూడు సిక్సర్లతో హిట్‌మ్యాన్ 600 క్లబ్ లో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (553 సిక్స్‌లు), షాహిద్ అఫ్రిది (553 సిక్స్‌లు), బ్రెండన్ మెకల్లమ్ (478 సిక్స్‌లు), మార్టిన్ గప్టిల్ (398 సిక్స్‌లు) తరువాత స్థానాల్లో ఉన్నారు.

అన్ని ఎడిష‌న్లలో ఆడిన ఏకైక ఆట‌గాడు

2007 టీ20 ప్రపంచ‌క‌ప్ ప్రారంభ ఎడిష‌న్ మొదలు ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ఎడిష‌న్లలో ఆడిన ఏకైక ఆట‌గాడిగా రోహిత్ చరిత్రలోకెక్కాడు. ధోని సారథ్యంలో 2007లో పొట్టి ప్రపంచకప్ నెగ్గిన భారత జ‌ట్టులో హిట్‌మ్యాన్ స‌భ్యుడు. అనంతరం 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 టీ20 ప్రపంచ‌క‌ప్‌లు జరగ్గా.. అన్నింటా రోహిత్ భార‌త జ‌ట్టు త‌రుపున ఆడాడు. బంగ్లా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ ఈ ఘ‌న‌త‌ అందుకునేందుకు అడుగుదూరంలో ఉన్నాడు. ష‌కీబ్ కూడా 2007 నుంచి ప్రతీ టీ20 ప్రపంచ‌క‌ప్ ఆడుతూ వ‌స్తున్నాడు. ఈ సీజ‌న్‌లో బంగ్లాదేశ్ ఇంకా తమ తొలి మ్యాచ్‌ ఆడ‌కపోవడంతో అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు.

కెప్టెన్‌గా అత్యధిక విజయాలు 

ఐర్లాండ్‌పై విజయంతో భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ధోనీని వెనక్కినెట్టి.. టీ20ల్లో భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన నాయకుడిగా తన పేరు లిఖించుకున్నాడు. ఈ జాబితాలో 46 విజయాలతో పాక్ కెప్టెన్ బాబర్ అజాం మొదటి స్థానంలో ఉన్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు - కెప్టెన్లు 

  • బాబర్ ఆజమ్ (పాకిస్థాన్): 46 (81 మ్యాచ్‌లు)
  • బ్రయన్ మసాబా (ఉగాండా): 44 (57 మ్యాచ్‌లు)
  • ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్): 44 (71 మ్యాచ్‌లు)
  • రోహిత్ శర్మ (భారత్): 43  (55 మ్యాచ్‌లు)
  • అస్గర్ ఆఫ్ఘన్ (ఆఫ్ఘనిస్థాన్): 42 (52 మ్యాచ్‌లు) 
  • ఎంఎస్ ధోనీ (భారత్): 42 (72 మ్యాచ్‌లు)
  • అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా): 41 (76 మ్యాచ్‌లు)