- రికార్డు సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్
- అఫ్గానిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ
- రాణించిన కోహ్లీ, ఇషాన్, బుమ్రా
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (84 బాల్స్‌లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 131) టీ20 మ్యాచ్ ఆడాడు. పాకిస్తాన్‌తో మెగా మ్యాచ్ ముంగిట అఫ్గానిస్తాన్ బౌలర్లను చితక్కొడుతూ మెగా ఈవెంట్‌లో రికార్డు స్థాయిలో ఏడో సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా 8 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 272/8 స్కోరు చేసింది.
కెప్టెన్ హష్మత్లులా షాహిది (88 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 80), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (69 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 62) హాఫ్ సెంచరీలు చేశారు. బుమ్రా (4/39) నాలుగు వికెట్లు తీశాడు. తర్వాత ఇండియా 35 ఓవర్లలో 273/2 స్కోరు చేసి గెలిచింది. విరాట్ కోహ్లీ (56 బాల్స్‌లో 6 ఫోర్లతో 56 నాటౌట్), ఇషాన్ (47 బాల్స్‌లో 5 ఫోర్లు, 2సిక్సర్లతో 47) రాణించారు. రోహిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. శనివారం అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది.
బుమ్రా అదుర్స్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను బుమ్రా కట్టడి చేశాడు. ఏడో ఓవర్లో తొలి మూడు బాల్స్‌కు ఇన్ స్వింగర్లు వేసిన బుమ్రా.. నాలుగో బాల్‌ను ఔట్ స్వింగ్ చేశాడు. ఊహించని విధంగా కట్ అయిన బాల్ ఇబ్రహీం (22) బ్యాట్‌ను టచ్ చేస్తూ కీపర్ రాహుల్ చేతుల్లోకి వెళ్లింది. మరో 5 ఓవర్ల తర్వాత పాండ్యా (2/43) వేసిన బౌన్సర్‌ను ఫుల్ చేసిన రహ్మనుల్లా (21) డీప్ ఫైన్ లెగ్‌లో శార్దూల్ (1/31)కు క్యాచ్ ఇచ్చాడు.
14వ ఓవర్‌లో శార్దూల్ వేసిన మిడిల్ స్టంప్ బాల్‌కు రహ్మత్ షా (16) ఎల్బీ అయ్యాడు. దీంతో అఫ్గాన్ 63 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో హష్మతుల్లా, ఒమర్‌జాయ్ ఓపికగా బ్యాటింగ్ చేశారు. జడేజా, కుల్దీప్ (1/40) టర్నింగ్ బాల్స్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఒమర్‌జాయ్ 4 భారీ సిక్సర్లు కొట్టాడు. దాదాపు 20 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న వీరిద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.
అయితే 35వ ఓవర్‌లో పాండ్యా.. ఒమర్‌జాయ్‌ను ఔట్ చేసి నాలుగో వికెట్‌కు 121 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. మరో 8 ఓవర్ల తర్వాత హష్మతుల్లాను కుల్దీప్ ఎల్బీ చేశాడు. ఆ వెంటనే బుమ్రా జోరందుకున్నాడు. 45వ ఓవర్‌లో నాలుగు బాల్స్ తేడాలో నజీబుల్లా జద్రాన్ (2), మహ్మద్ నబీ (19)ని పెవిలియన్‌కు పంపాడు. దీంతో 35 ఓవర్లలో 184/4తో పటిష్ట స్థితిలో ఉన్న అఫ్గాన్ స్కోరు 45 ఓవర్లు ముగిసే సరికి 235/7గా మారింది. చివర్లో రషీద్ ఖాన్ (16), ముజీబ్ (10 నాటౌట్), నవీన్ ఉల్ హక్ (9 నాటౌట్) ఫెయిలయ్యారు.
‘హిట్’ మ్యాన్..
ఛేజింగ్‌లో రోహిత్ దంచికొట్టడంతో టార్గెట్ఈజీగా కరిగింది. తొలి మూడు ఓవర్లలో అఫ్గాన్ బౌలర్ల లైన్‌ను తెలుసుకున్న హిట్‌మ్యాన్ ఐదో ఓవర్లో 6, 4, 4, ఏడో ఓవర్లో 4, 4, 6 దంచాడు. 8వ ఓవర్‌లో 4, 6తో కేవలం 30 బాల్స్‌లోనే ఫిఫ్టీ ఫినిష్ చేశాడు. 9వ ఓవర్‌లో 6, 4తో రెచ్చిపోయాడు. మధ్యలో చాన్స్ వచ్చినప్పుడల్లా ఇషాన్ కూడా బౌండ్రీలు బాదడంతో ఇండియా 12 ఓవర్లలోనే వంద రన్స్‌కు చేరింది.
13, 14వ ఓవర్లలో ఇద్దరూ కలిసి 4, 6, 4, 4, 4 బాదారు. నబీ వేసిన 18వ ఓవర్ రెండో బాల్‌కు సింగిల్‌తో రోహిత్ సెంచరీ (63 బాల్స్) పూర్తి చేశాడు. 19వ ఓవర్‌లో రషీద్ వేసిన గూగ్లీకి ఇషాన్ ఔటవడంతో తొలి వికెట్‌కు 156 పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. వన్‌డౌన్‌లో కోహ్లీ మెల్లగా ఆడినా రోహిత్ మాత్రం తగ్గలేదు. 23వ ఓవర్‌లో 4, 4, 6 దంచాడు. మొత్తానికి 25 ఓవర్లలో స్కోరును 202/1కు చేర్చాడు.
అయితే 26వ ఓవర్‌లో రషీద్ వేసిన స్ట్రయిట్ బాల్‌ను స్వీప్ చేయబోయి రోహిత్ క్లీన్ బౌల్డ్ కావడంతో మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ దశలో కోహ్లీతో కలిసి శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) స్ట్రయిక్ రొటేట్ చేస్తూ క్లాసిక్ షాట్లతో అలరించాడు. ఫిఫ్టీ పూర్తి చేసిన విరాట్ మూడో వికెట్‌కు 68 రన్స్ జత చేసి గెలుపు లాంఛనం పూర్తి చేశాడు.
7 వరల్డ్‌కప్‌లో రోహిత్ సెంచరీలు. మెగా టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సచిన్ (6) రికార్డును బ్రేక్ చేశాడు.
19 వరల్డ్ కప్స్‌లో వెయ్యి రన్స్ చేసేందుకు రోహిత్ ఆడిన ఇన్నింగ్స్‌లు. టోర్నీలో వేగంగా ఈ మార్కు దాటిన ప్లేయర్‌గా వార్నర్ (19 ఇన్నింగ్స్) రికార్డు సమం చేశాడు.
31 వన్డేల్లో రోహిత్ సెంచరీలు. ఈ ఫార్మాట్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన ప్లేయర్లలో రికీ పాంటింగ్ (30)ను దాటి మూడో ప్లేస్ చేరుకున్నాడు. సచిన్ (49), కోహ్లీ (47) ముందున్నారు.
63 ఈ మ్యాచ్‌లో సెంచరీ కోసం రోహిత్ తీసుకున్న బాల్స్. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియా ప్లేయర్‌గా కపిల్ దేవ్ రికార్డు (72 బాల్స్‌లో)ను అధిగమించాడు.
556 అన్ని ఫార్మాట్లలో రోహిత్ కొట్టిన సిక్సర్లు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా క్రిస్ గేల్ (553 సిక్సర్లు)ను వెనక్కు నెట్టి టాప్ ప్లేస్‌కు వచ్చాడు.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్: 50 ఓవర్లలో 272/8 (హష్మతుల్లా షాహిది 80, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 62, బుమ్రా 4/39, పాండ్యా 2/43). ఇండియా: 35 ఓవర్లలో 273/2 (రోహిత్ 131, కోహ్లీ 55 నాటౌట్, రషీద్ 2/57).