అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ శర్మకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో కాదు బౌండరీలు బాదడంలో రోహిత్ ముందే ఉంటాడు. ఇక సిక్సులు విషయంలో తనకు తానే సాటి. ఫార్మాట్ ఏదైనా రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడితే సిక్సులు వర్షం కురవాల్సిందే. హిట్ మ్యాన్ 20,30 పరుగులు చేసినా వాటిలో కనీసం ఒకటి రెండు సిక్సులు ఉంటాయంటే అతనికి సిక్సులు బాదేయడం ఎంత ఈజీనో మనం అర్ధం చేసుకోవచ్చు. తన అంతర్జాతీయ కెరీర్ లో ఎన్నో సిక్సులు కొట్టిన రోహిత్.. తాజాగా క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేయడానికి సిద్ధం అయిపోయాడు.
గేల్ కి దగ్గరలోనే..
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లు కలుపుకొని అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ టాప్ లో ఉన్నాడు. గేల్ 551 ఇన్నింగ్స్ లో 553 సిక్సులు కొట్టేసాడు. ఇక మన హిట్ మ్యాన్ కేవలం 467 మ్యాచులోనే 539 సిక్సులు కొట్టి గేల్ కి సమీపంలో ఉన్నాడు. మరో 15 సిక్సులు కొడితే గేల్ ఆల్ టైం రికార్డ్ తుడిచిపెట్టుకుపోతుంది.
రోహిత్ తర్వాత ఈ లిస్టులో ఉన్న ఏడుగురు క్రికెటర్స్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినవారే కావడం విశేషం. ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్న గేల్ కూడా క్రికెట్ కి వీడ్కోలు చెప్పేసాడు. కాబట్టి భవిష్యత్తులో ఈ రికార్డ్ హిట్ మ్యాన్ పేరు మీదే ఎక్కువకాలం ఉండే అవకాశం ఉంది.