తడబడి.. తడాఖా చూపి.. రోహిత్‌‌‌‌, జడేజా సెంచరీలు

తడబడి.. తడాఖా చూపి.. రోహిత్‌‌‌‌, జడేజా సెంచరీలు
  •     ఫిఫ్టీతో మెరిసిన సర్ఫరాజ్
  •     ఇండియా 326/5

రాజ్‌‌‌‌‌‌కోట్‌‌‌‌:  కెప్టెన్‌‌‌‌ రోహిత్ శర్మ (196  బాల్స్‌‌‌‌లో  14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131), లోకల్ హీరో రవీంద్ర జడేజా (212 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 2  సిక్సర్లతో 110 బ్యాటింగ్‌‌‌‌) క్లాసికల్ బ్యాటింగ్‌‌‌‌తో.. ఖతర్నాక్ సెంచరీలతో సత్తా చాటారు. అరంగేట్రం కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ (66 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 62) మెరుపు ఫిఫ్టీతో ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌లోకి తన రాకను ఘనంగా చాటుకున్నాడు.

దాంతో గురువారం ఇంగ్లండ్‌‌‌‌తో మొదలైన మూడో టెస్టులో ఇండియా తొలి రోజు పైచేయి సాధించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఆతిథ్య జట్టు 326/5 స్కోరుతో మొదటి రోజు ముగించింది. ఆరంభంలోనే మూడు వికెట్లు పడి 33/3తో కష్టాల్లో పడ్డ జట్టును రోహిత్, జడేజా నాలుగో వికెట్‌‌‌‌కు  డబుల్ సెంచరీ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్​ (204)తో ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జడేజాకు తోడు కుల్దీప్ యాదవ్ (1 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. చేతిలో మరో ఐదు వికెట్లున్న నేపథ్యంలో  రెండో  రోజు ఇండియా 500 రన్స్‌‌‌‌ మార్కును చేరుకుంటే మ్యాచ్‌‌‌‌పై పట్టు సాధించొచ్చు. 
 
మార్క్‌‌‌‌ వుడ్ దెబ్బ

తొలి రోజు ఆటను ఇండియా మెరుగ్గా ముగించినా ఆరంభంలో మాత్రం తడబడింది. టాస్ నెగ్గిన కెప్టెన్‌‌‌‌ రోహిత్ బ్యాటింగ్ ఎంచుకోగా.. మొదటి గంటలోనే మూడు వికెట్లు కోల్పోయిన హోమ్‌‌‌‌టీమ్ డీలా పడింది. ఉదయం ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఎక్స్‌‌‌‌ట్రా పేస్‌‌‌‌తో టాపార్డర్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. గత మ్యాచ్‌‌‌‌ డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (10)ను నాలుగో ఓవర్లోనే ఔట్‌‌‌‌ చేశాడు. వుడ్ నాలుగో  స్టంప్‌‌‌‌పై కాస్త ఎక్స్‌‌‌‌ట్రా బౌన్స్‌‌‌‌తో వేసిన షార్ట్ లెంగ్త్ బాల్‌‌‌‌ను ఫార్వర్డ్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌ ఆడే ప్రయత్నంలో జైస్వాల్‌‌‌‌.. స్లిప్‌‌‌‌లో రూట్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు.

తన తర్వాతి ఓవర్లోనే వన్‌‌‌‌డౌన్ బ్యాటర్ శుభ్‌‌‌‌మన్ గిల్ (0)ను ఊరించే ఆఫ్ స్టంప్‌‌‌‌ బాల్‌‌‌‌తో పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ రోహిత్ ఓపిగ్గా క్రీజులో నిలిచినా.. నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రజత్‌‌‌‌ పటీదార్ (5) కూడా నిరాశ పరిచాడు. పేసర్ల బౌలింగ్‌‌‌‌లో ఇబ్బంది పడ్డ అతను స్పిన్నర్ హార్ట్‌‌‌‌ లీ వేసిన లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌కు డకెట్‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇండియా 33/3తో నిలిచింది. ఈ దశలో బ్యాటింగ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో ముందుకొచ్చిన జడేజా కెప్టెన్‌‌‌‌కు తోడయ్యాడు. గత ఎనిమిది ఇన్నింగ్స్‌‌‌‌ల్లో ఒక్క ఫిఫ్టీ చేయని రోహిత్ ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు.

ఈ క్రమంలో అతనికి కొంత అదృష్టం కూడా తోడైంది. 27 రన్స్‌‌‌‌ వద్ద హార్ట్‌‌‌‌లీ బౌలింగ్‌‌‌‌లో ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను స్లిప్‌‌‌‌లో రూట్ డ్రాప్ చేశాడు. అండర్సన్ బౌలింగ్‌‌‌‌లో ఎల్బీ నుంచి బయటపడ్డాడు. మార్క్‌‌‌‌ వుడ్ వేసిన ఓ బౌన్సర్‌‌‌‌‌‌‌‌హెల్మెట్‌‌‌‌ గ్రిల్‌‌‌‌కు తగిలినా రోహిత్‌‌‌‌కు ఏమీ కాలేదు. ఈ క్రమంలో రోహిత్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా ఇండియా 93/3తో తొలి సెషన్‌‌‌‌ను ముగించింది.

రోహిత్, జడ్డూ జోరు

లంచ్ బ్రేక్ తర్వాత ఇండియా జోరు మొదలైంది. క్రీజులో కుదురుకున్న రోహిత్, జడ్డూ ఇంగ్లండ్ బౌలర్లను ఈజీగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన స్వభావానికి భిన్నంగా హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌  ప్రశాంతంగా ఆడాడు. చెత్త బాల్స్‌‌‌‌ వచ్చే వరకూ వేచి చూశాడు.  ఇంకోవైపు క్లోజ్ ఫీల్డింగ్‌‌‌‌తో పాటు లెగ్‌‌‌‌ సైడ్ ఎక్కువ ఫీల్డర్లను ఉంచినా జడేజా గ్యాప్స్‌‌‌‌ మీదుగా బంతులను బౌండ్రీకి పంపాడు.

ఈ క్రమంలో అతను 97 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  దాంతో రెండో సెషన్‌‌‌‌లో ఇండియా 92 రన్స్ రాబట్టింది. 185/3తో టీ బ్రేక్‌‌‌‌ నుంచి వచ్చిన వెంటనే రోహిత్ (157 బాల్స్‌‌‌‌) టెస్టుల్లో తన 11వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమ్ స్కోరు కూడా 200 దాటింది. ఇక వరుసగా షార్ట్ బాల్స్‌‌‌‌తో పరీక్ష పెట్టిన మార్క్‌‌‌‌ వుడ్ చివరకు రోహిత్‌‌ను ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 204 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగించింది. అయితే ఈ ఆనందం ఇంగ్లిష్ టీమ్‌‌‌‌కు ఎంతో సేపు నిలవలేదు. కొత్త కుర్రాడు సర్ఫరాజ్ రాకతో ఇన్నింగ్స్‌‌‌‌కు మరింత వేగం వచ్చింది.

తను వన్డే స్పీడ్‌‌‌‌లో దూకుడుగా, నిర్భయంగా బ్యాటింగ్ చేశాడు. పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ స్వీప్ షాట్స్‌‌‌‌, లాఫ్టెడ్‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌తో అలరించిన ఖాన్‌‌‌‌ 48 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దాంతో చూస్తుండగానే స్కోరు 300 దాటింది. ఖాన్, జడ్డూ జోరు చూస్తుంటే మరో వికెట్ పడకుండా ఇండియా రోజు ముగించేలా కనిపించింది. కానీ, సర్ఫరాజ్‌‌‌‌ రనౌట్ కావడంతో ఐదో వికెట్‌‌‌‌కు 77 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. సెంచరీ పూర్తి చేసుకున్న జడేజా మరో వికెట్ పడకుండా రోజు ముగించాడు.  

ఆనందం.. భావోద్వేగం..

ఈ మ్యాచ్‌‌‌‌తో యంగ్ క్రికెటర్లు సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్  టెస్టు అరంగేట్రం చేశారు. ఈ ఇద్దరూ ఇండియా క్యాప్‌‌‌‌లు అందుకోగా ఉదయం గ్రౌండ్‌‌‌‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో దంచికొడుతున్న సర్ఫరాజ్‌‌‌‌కు లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఇండియా టెస్ట్ క్యాప్ అందజేశాడు.  తన కల నిజమైన వేళ సర్ఫరాజ్‌‌‌‌ కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు.

ఆ టైమ్‌‌‌‌లో  గ్రౌండ్‌‌‌‌లోకి వచ్చిన అతని  తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్‌‌‌‌, భార్య కూడా  భావోద్వేగానికి గురయ్యారు. పరుగెత్తుకెళ్లి తండ్రిని హగ్ చేసుకున్న సర్ఫరాజ్ తన క్యాప్‌‌‌‌ను అతని చేతిలో పెట్టాడు. నౌషద్  దాన్ని ముద్దుపెట్టుకున్నాడు. భార్య కన్నీళ్లు తుడిచిన సర్ఫరాజ్‌‌‌‌ సాయంత్రం తన తమ్ముడు, అండర్‌‌‌‌‌‌‌‌19 క్రికెటర్ ముషీర్ ఖాన్‌‌‌‌కు వీడియో కాల్‌‌‌‌ లో క్యాప్ చూపిస్తూ ‘ఏదో రోజు నువ్వు కూడా దీన్ని అందుకుంటావు’ అని అన్నాడు.  కీపర్ ధ్రువ్ జురెల్‌‌‌‌కు  మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌‌‌‌ టెస్టు క్యాప్‌‌‌‌ అందిస్తూ అతని జర్నీ గురించి చెప్పాడు. 

కుర్రాడు రనౌట్.. కెప్టెన్‌‌‌‌ ఆగ్రహం

మూడో సెషన్ చివర్లో  సర్ఫరాజ్‌‌‌‌ రనౌటైన విధానం చూసి కెప్టెన్ రోహిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 99 రన్స్ వద్ద ఉన్న జడేజా అండర్సన్‌‌‌‌ బాల్‌‌‌‌ను మిడాన్‌‌‌‌ మీదుగా ఆడి సర్ఫరాజ్‌‌‌‌ను  సింగిల్‌‌‌‌కు పిలిచి వెంటనే వెనక్కివెళ్లాడు. సర్ఫరాజ్‌‌‌‌ తిరిగొచ్చేలోగా నాన్‌‌‌‌ స్ట్రయికింగ్ ఎండ్‌‌‌‌లో మార్క్‌‌‌‌ వుడ్‌‌‌‌ స్ట్రెయిట్‌‌‌‌ త్రోతో వికెట్లు పడగొట్టాడు. అసహనానికి గురైన రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌‌‌‌లో తన క్యాప్‌‌‌‌ను నేలకు విసిరికొట్టాడు. కాగా, రనౌట్‌‌‌‌కు తన తప్పిదమే కారణమని సర్ఫరాజ్‌‌‌‌కు జడేజా సారీ చెప్పాడు.

టెస్టుల్లో రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్లు. ఈ ఫార్మాట్‌‌‌‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఇండియా బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా ధోనీ (78)ని దాటి రెండో ప్లేస్‌‌‌‌కు వచ్చాడు. సెహ్వాగ్ 90 సిక్సర్లతో టాప్‌‌‌‌ లో ఉన్నాడు. 

టెస్టుల్లో 3000 ప్లస్ రన్స్‌‌‌‌, 250 ప్లస్ వికెట్లు ఖాతాలో వేసుకున్న ఇండి యా మూడో ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌గా జడేజా నిలిచాడు. కపిల్ దేవ్‌‌‌‌, అశ్విన్ ముందున్నారు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 3003 రన్స్‌‌‌‌, 280 వికెట్లు ఉన్నాయి.

  ఈ మ్యాచ్‌‌‌‌లో 48 బాల్స్‌‌‌‌లోనే హాఫ్​ సెంచరీ చేసిన సర్ఫరాజ్ అరంగేట్రం టెస్టులో సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన ఇండియా క్రికెటర్‌‌‌‌గా హార్దిక్ పాండ్యా రికార్డును సమం చేశాడు. హార్దిక్ కూడా 2017లో లంకపై 48 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ కొట్టాడు. యాదవేంద్ర సింగ్ 1934లో 42 బాల్స్‌‌‌‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో రికార్డు సృష్టించాడు.  ‌‌‌‌

సంక్షిప్త స్కోర్లు


ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 86 ఓవర్లలో 326/5 (రోహిత్ 131, జడేజా 110 బ్యాటింగ్, సర్ఫరాజ్ 62, మార్క్‌‌‌‌ వుడ్ 3/69).