Duleep Trophy: అభిమానులకు గుడ్ న్యూస్.. దులీప్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లకు 40 రోజుల పాటు రెస్ట్ లభించనుంది. ఈ గ్యాప్ లో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దులీప్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. నివేదికల ప్రకారం బంగ్లాదేశ్‌తో జరగబోయే స్వదేశీ సిరీస్‌కు ముందు దేశవాళీ టోర్నీకి టెస్ట్ ఆటగాళ్లందరూ అందుబాటులో ఉండాలని సెలక్టర్లు కోరుతున్నారట. రోహిత్, కోహ్లితో పాటు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను కూడా ఈ ట్రోఫీలో ఆడడం దాదాపుగా ఖాయమైంది. 

టీమిండియా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ట్రోఫీకి సైతం రెస్ట్ తీసుకోనున్నాడు. స్వదేశంలో సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు సైతం బీసీసీఐ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు ఇండియా ఎ, ఇండియా బి, ఇండియా సి, ఇండియా డి అనే నాలుగు జట్ల కోసం జట్టులను త్వరలోనే ఎంపిక చేయనుంది. 

దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి అనంతపురం (ఆంధ్రప్రదేశ్)లో జరగనుంది. మొత్తం టోర్నీలో ఆరు మ్యాచ్ లు జరుగుతాయి. అయితే నివేదిక ప్రకారం, అనంతపురంలో విమానాశ్రయం లేనందున మ్యాచ్ లన్ని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు మార్చవచ్చు. రానున్న నాలుగు నెలల వ్యవధిలో భారత్‌లో బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు.. న్యూజిలాండ్ తో మూడు టెస్టులు.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది.